వృద్ధుల్లో ఒకరు చనిపోతే వాళ్లతోనే పెన్షన్ పోతాంది!

వృద్ధుల్లో ఒకరు చనిపోతే వాళ్లతోనే పెన్షన్ పోతాంది!
  • వృద్ధుల్లో ఒకరు సచ్చిపోతే వాళ్లతోనే పెన్షన్ పోతాంది!
  • ఇంట్ల మిగిలినోళ్లకు పెన్షన్ రాక గోసపడ్తున్న పండుటాకులు
  • మూడేండ్లుగా  అప్లికేషన్లను పెండింగ్​ పెట్టిన సర్కారు

మెదక్ జిల్లా  కౌడిపల్లి మండలం రాజిపేటకు చెందిన దూదేకుల ఫాతిమా బేగం భర్త దూదేకుల అల్లి సాబ్ రెండేండ్ల కింద సచ్చిపోయిండు. అల్లిసాబ్​ బతికున్నప్పుడు  నెల నెలా ఆసరా పింఛన్ వచ్చేది. ఆ పైసల్తోనే ఇంట్లకు కావాల్సిన ఉప్పు, పప్పు, కాయగూరలు కొనుక్కొని ఇద్దరు ముసలోళ్లు బతికేది. కానీ అల్లిసాబ్​ చచ్చిపోంగనే ఆఫీసర్లు  పింఛన్​ బంద్​ పెట్టిన్రు. తన భర్త పింఛన్​ తనకు ఇయ్యాలని ఫాతిమా బేగం రెండేండ్లుగా ఆఫీసర్ల చుట్టు తిరుగుతాంది. నాలుగైదు సార్లు కలెక్టరేట్​లో ప్రజావాణికి పోయి అప్లికేషన్​ ఇచ్చింది. కానీ ఇప్పటివరకు వితంతు పింఛన్​ రాలేదు. దీంతో ఫాతిమాబేగం చేతిల పైసల్లేక  ఇంట్ల అవసరాలకు, మందులకు ఇబ్బంది పడుతాంది.

రాష్ట్రంలో ఆసరా పింఛన్​ తీసుకునే వృద్ధులు చనిపోయినప్పుడు బతికి ఉన్న వాళ్ల భార్యకో, భర్తకో ఆ పింఛన్​ను ట్రాన్స్​ఫర్​ చేస్తలేరు. వాళ్లు కూడా వృద్ధులే అయినప్పటికీ పరిగణలోకి తీసుకుంటలేరు. ప్రస్తుత రూల్స్​ ప్రకారం భార్యాభర్తల్లో ఇద్దరు వృద్ధులున్నా సరే, ఇంట్లో ఒకరికి మాత్రమే ఆసరా పింఛన్​వస్తుంది. కానీ లబ్ధిదారు చనిపోయిన వెంటనే అదే నెల నుంచి పింఛన్​ బంద్​ చేస్తున్న సర్కారు, ఆ ఇంట్లో ఒంటరిగా మిగిలిన ముసలోళ్ల గురించి ఆలోచిస్తలేదు. వృద్ధజంటలో ఎవరైనా చనిపోయినప్పుడు మరొకరికి పింఛన్​ ట్రాన్స్​ఫర్​చేసే రూల్​ లేదని, వాళ్లు కొత్తగా అప్లై చేసుకోవాల్సిందేనని ఆఫీసర్లు చెబుతున్నారు. ఈ క్రమంలో కొత్తగా అప్లై చేసుకొని ఏండ్లు గడుస్తున్నా పింఛన్లు మాత్రం సాంక్షన్​ కావట్లేదు. దీంతో పండుటాకులు తల్లడిల్లుతున్నారు. ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతూ అడపాదడపా ఆందోళనలకు దిగుతున్నారు. 

పాతయి బంద్​.. కొత్త ఇస్తలేరు..

రాష్ట్రంలో ప్రస్తుతం వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ, చేనేత తదితర 9 కేటగిరీలకు సంబంధించి 39 లక్షల36 వేల 521 మందికి ఆసరా పింఛన్లు అందుతున్నాయి.  గడిచిన మూడేండ్ల కాలంలో చనిపోయిన లబ్ధిదారులకు సంబంధించి 2.5 లక్షల దాకా పాత పింఛన్లు తొలగించినట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. టీఆర్ఎస్​ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఇలా తొలగించడమే తప్ప కొత్త పింఛన్లు ఇచ్చింది లేదు.  దుబ్బాక, నాగార్జున సాగర్​, హుజూర్​నగర్,​ హుజూరాబాద్​ ఉప ఎన్నికల టైంలో  ఆయా నియోజకవర్గాల్లో మాత్రం కొత్త పింఛన్లు సాంక్షన్​ చేశారు. మిగిలిన నియోజకవర్గాల్లో  కొత్త పింఛన్ల కోసం 3.5 లక్షల మంది అప్లై చేసుకోగా పెండింగ్​లో ఉన్నాయి. 2018 ఎన్నికల ముందు 57 ఏండ్లు దాటిన వారందరికీ వృద్ధాప్య పింఛన్​ ఇస్తామని రూలింగ్ ​పార్టీ హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చి మూడేండ్లు దాటినా ఈ హామీ అమలు చేయలేదు. ఇటీవల ఇందుకు సంబంధించి అప్లికేషన్లు స్వీకరించగా, స్టేట్​వైడ్ ​ఏంతక్కువ 10.5 లక్షలు వచ్చినట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. అన్ని కలిపి సుమారు 14లక్షల అప్లికేషన్లు సర్కారు సాంక్షన్​ కోసం ఎదురుచూస్తున్నాయి. ఇలా కొత్త పింఛన్లపై సర్కారు నిర్ణయం తీసుకోకపోవడం వల్ల  మిగిలిన వాళ్ల సంగతేమో గానీ వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.    

పింఛన్​ లేక తక్లీబైతంది

మా ఆయన పేరు బాలయ్య. బతికున్నప్పుడు నెలకు రూ.2 వేల పింఛన్ వచ్చేది. 4 నెలల కింద చనిపోయిండు. నాకు ఏ ఆధారం లేదు. మా పాలోళ్లే కూపన్​బియ్యం, కూరగాయలు తెచ్చిస్తే వండుకతింటున్నా. మా ఆయన పింఛన్​నాకు ఇయ్యాలని గ్రామ పంచాయతీల మూడు నెల్ల కింద అప్లికేషన్ ​పెట్టుకున్న. ఇంతవరకు ఇయ్యలే. చేతిల పైసల్లేక మస్తు తక్లీబైతంది. 
–శంకరమ్మ, బాలానగర్, పాలమూరు జిల్లా

శానా దినాలైతుంది 

నా భర్త మల్లేశం చనిపోయి దగ్గర దగ్గర యాడాదిన్నరయితంది. అప్పట్నుంచి నాకు పెన్షన్ వస్తలేదు. సర్పంచ్, ఎంపీటీసీలకు ఎన్నిమాట్లు చెప్పినా ఇగ వస్తది, అగ వస్తది అంటున్నరు. కానీ వచ్చింది లేదు ఇచ్చింది లేదు. మండలాఫీస్ కు పోయి కూడా అప్లికేషన్ ఇచ్చచ్చిన. జర జల్దీ పెన్షన్ అస్తే ఆ పైసలు మందు గోలీలకు పనికొస్తయని అనుకుంటున్నా. ఎప్పుడు వస్తయో ఏమో!
- జిట్టి బాలమణి, నిజాంపేట్, మెదక్ జిల్లా