- ఆరుగురిని అదుపులోకి తీసుకుని 5 కేజీల గాంజా స్వాధీనం
- ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడి
ఆదిలాబాద్, వెలుగు: అంతరాష్ట్ర గంజాయి ముఠాను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. గురువారం ఎస్పీ అఖిల్ మహాజన్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈనెల 7న ఇంద్రవెల్లి మండలంలోని శ్మశానవాటిక సమీపంలో మూడు బైక్ లపై గంజాయి తరలిస్తుండగా సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేసి పట్టుకున్నారు. సంచుల్లో దాచిన 5 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
దాని విలువ సుమారు రూ.1.30 లక్షలు ఉంటుంది. గంజాయి తరలిస్తున్న ఇంద్రవెల్లికి చెందిన బస్సీ సంతోష్, జవాడే శంకర్, షేక్ ఖాజా, జైనూర్ కు చెందిన సయ్యద్ సాబీర్, మహారాష్ట్రకు చెందిన గిరీష్ విఠల్, షేక్ షరీఫ్ ఇర్షద్ ను అదుపులోకి తీసుకున్నా రు. మరో నిందితుడు ఆత్రం బాధిరావు పరార్ అయ్యాడు. బస్సీ సంతోష్, జవాడే శంకర్ స్థానికంగా గంజాయి అమ్మకాల ఏర్పాట్లు చేస్తుంటారు. వీరికి సయ్యద్ సాబీర్ మధ్యవర్తిగా వ్యవహరిస్తుంటాడు.
షేక్ ఖాజా తన పరిచయాలను ఉపయోగించి గంజాయిని దాచడంతో పాటు అమ్మకాలకు సహకరిస్తుంటాడు. ఫోన్లలో సంప్రదింపులు జరిపి, గంజా యిని తక్కువ ధరకు తెచ్చి అధిక ధరకు అమ్మే ప్లాన్ చేశారు. పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకునేందుకు ముఠా బైక్ లపై సరఫరా చేస్తున్నట్లు తేలింది.
