వానొస్తే.. వణుకుతున్న వరంగల్

వానొస్తే.. వణుకుతున్న వరంగల్

నాలుగు సమస్యల వల్లే నరకం..

చెరువులు, నాలాలు ఎక్కడికక్కడ కబ్జా

40 శాతం కాలనీల్లో మోరీల్లేవ్

హామీగానే.. అండర్గ్రౌండ్డ్రైనేజీ

వరంగల్‍ స్మార్ట్​సిటీ చిన్న వానకే వణుకుతున్నది. ఇటీవల నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సిటీలో100 నుంచి 120 కాలనీలు ముంపునకు గురయ్యాయి. వందలాది ఇండ్లలోకి నీళ్లు వచ్చాయి. జనాలకు రాత్రిళ్లు నిద్రాహారాలు కరువయ్యాయి. మెయిన్‍ రోడ్లు కాలువల్లా పారాయి. అనేక రోడ్లు బ్లాకై, వెహికిల్స్​ ముందుకు కదలలేదు. ఎమర్జెన్సీ సేవలు అందించే రెస్క్యూ టీం లు సిటీ నడిబొడ్డు న బోట్లు వేసుకొని తిరిగారు. వెంచర్ల పేరుతో షాడో లీడర్లు చెరువులను ఆక్రమిం చడం, 40 శాతం కాలనీల్లో మోరీల్లేకపోవడం, నాలాలు ఎక్కడికక్కడ కబ్జా కావడం, అండర్‍ గ్రౌండ్‍ డ్రైనేజీ హామీగానే మిగిలిపోవడం ప్రస్తుత దుస్థితికి కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వరంగల్రూరల్‍, వెలుగు: గ్రేటర్‍ వరంగల్‍ పరిధిలో ఏం తక్కువ 1400 కాలనీలు ఉన్నాయి. తాజా వర్షాల కారణంగా ఇందులో 100 నుంచి 120 వరకు ముంపునకు గురయ్యాయి. ప్రధానంగా వరంగల్ లోని ఎన్టీఆర్ నగర్‍, సుందరయ్యనగర్‍, ఎస్సార్ నగర్, లక్ష్మీగణపతి నగర్‍, మాధురి నగర్‍, కాశిబుగ్గ, దేశాయిపేట,గాంధీ నగర్‍, సూర్జిత్ నగర్‍, గాయత్రి కాలనీ, ఉర్సు, కరీమాబాద్‍, రంగంపేట, ఎస్‍ఆర్‍ఆర్‍ తోట, చింతల్‍, శివనగర్‍, ఖిలా వరంగల్‍, అండర్‍బ్రిడ్జి, సీఎస్సార్‍ గార్డెన్‍, హంటర్ రోడ్డు, భద్రకాళి బండ్‍, పెద్దమ్మగడ్డ, కాకతీయ కాలనీ, హన్మకొండ న్యూ శాయంపేట, పెగడపల్లి రోడ్డులోని వెంకట్రామయ్యనగర్‍, గుండ్లసింగారం, ఇందిరమ్మకాలనీ, పోచమ్మకుంట, సగర కాలనీ, అమరావతి నగర్‍, టీవీ టవర్‍ ఏరియా, సమ్మయ్యనగర్‍, లష్కర్ సింగారం, కాజీపేట దర్గా, కడిపికొండ, బాపూజీనగర్ తో పాటు పలు కొత్త కాలనీలు జలమయమయ్యాయి. ఆయా కాలనీలకు రోడ్లు బ్లాక్ కావడంతో జనం వెళ్లలేకపోతున్నారు.

చెరువులు మాయం.. నాలాలు ఆక్రమణ

వరంగల్‍ సిటీలో ఒకప్పుడు చెరువులు, కుంటలు, శిఖం భూములు 275 వరకు ఉండేవి. ప్రస్తుతం అందులో పట్టు మని పది కనపడట్లేదు. గోపాల్ పూర్‍, సమ్మయ్యనగర్‍, రామారం, బీమారం వంటి ఎన్నో చెరువులు, కుంటలు నామా రూపల్లేకుండా పోయాయి. భద్రకాళి చెరువు ఇప్పటికే పెద్దోళ్ల చేతిలో కబ్జా అవుతోంది. ఈ భూములపై అక్రమార్కులు కన్నే యగా, భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచన లేని ఆఫీసర్లు వెంచర్లకు పర్మిషన్‍ ఇచ్చారు. గ్రేటర్‍ పరిధిలో ప్రధానంగా నయీం నగర్‍, రంగంపేట, బొంది వాగు వంటి పెద్దవాటితో కలిపి 15 నాలాలున్నాయి. దాదాపు 25 కిలోమీటర్ల పరిధిలో పారే ఈ మూడు నాలాలు ఎక్కువగా ఆక్రమణకు గురయ్యాయి. గ్రేటర్‍ 58 డివిజన్ల పరిధిలో ఏం తక్కువ 1400 కాలనీలు ఉండగా.. 600 కాలనీల్లో అంతర్గత మోరీలే లేవు. ఏకాస్త వర్షం పడ్డా.. నీరంతా రోడ్ల మీదకు, అక్కడుండే ఖాళీ ప్లాట్లలోకి చేరుతోంది.

నాలా మార్కిం గ్‍’ మరిచిపోయిన్రు

సిటీలో 2007, 2012, 2013, 2016, 2019లో అతి సాధారణ వర్షాలు కురిశాయి. 2016లో సిటీ ముంపునకు గురైంది. ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‍, అప్పటి మేయర్‍ నరేందర్‍ అధికారులతో కలిసి నాలాలను పరిశీలించారు. బఫర్ జోన్‍ ఆధారంగా నాలాకు ఇరువైపులా మార్కింగ్‍ చేస్తామన్నారు. వానకాలంలో ముందస్తుగా పూడికతీత చేపడతామని, హరితహారం కార్యక్రమంలో కాలువకు ఇరు వైపులా మొక్కలు నాటుతామని చెప్పారు. తూతూ మంత్ రంగా సిబ్బంది కొన్నింటి కి మార్కిం గ్‍ చేసి వదిలేశారు. సిటీ మాత్రం మరోసారి మునిగింది.

అప్పుడు కాలే.. ఇప్పుడు కావట్లే

ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్‍ సర్కారు కొనసాగినప్పుడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా జైపాల్ రెడ్డి వ్యవహరించారు. వరంగల్‍ సిటీలో అండర్‍ డ్రైనేజీ సిస్టం ఏర్పాటుకు రూ.800 కోట్లు కేటా యిస్తున్నామని చెప్పారు. డీపీఆర్‍ తయారు చేయాలన్నారు. ఆఫీసర్ల అలసత్వం కారణంగా అది కార్యరూపం దాల్చలేదు. తెలంగాణ రాకముందు.. వచ్చాక సీఎం కేసీఆర్‍ సైతం వరంగల్‍ సిటీలో అండర్‍ డ్రైనేజీ ఇంపార్టెన్స్ పై మాట్లాడారు. 2014లో ప్రచారానికి వచ్చినప్పుడే అధికారంలోకి వచ్చిన వెంటనే వరంగల్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటుచేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. కారణాలేవైనా ఆ హామీ హామీగానే మిగిలిపోయింది. సరిపడా బడ్జెట్ లేకపోవడం వల్లే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కాగితాలకే పరిమితమవుతోందని ఆఫీసర్లు అంటున్నారు.

నాలుగు సమస్యల వల్లే నరకం

వరంగల్‍ సిటీ మొదట మున్సిపాలిటీగా ఆపై కార్పొరేషన్‍.. ఇప్పుడు గ్రేటర్‍ కార్పొరేషన్‍గా అప్‍గ్రేడ్‍ అయిం ది. కానీ అదేస్థా యిలో డెవలప్ మెంట్‍, ఫెసిలిటీస్‍ కనపడట్లేదు. వానొస్తే సిటీ మునగడానికి ఏళ్ల తరబడి నాలుగు ప్రధాన సమస్యలు కనపడుతున్నాయి. అందులో మొదటిది.. గ్రేటర్‍ పరిధిలోని చెరువులు, కుంటలను ఎక్కడికక్కడ కబ్జా చేశారు. రెండోది.. వంద ఫీట్ల వెడల్పున్న నాలాలు ఇప్పుడు సగం కంటే ఎక్కువ ఆక్రమణకు గురయ్యాయి. మూడు.. సిటీలోని 30 నుం చి 40 శాతం కాలనీల్లో ఇప్పటికి ఇంటర్నల్‍ డ్రైనేజీ సిస్టమ్ లేదు. చివరిది.. అండర్‍ గ్రౌండ్‍ డ్రైనేజీ. ప్రత్యేక రాష్ట్రం రాకముందు నుంచి ఇది చర్చలో ఉంటోంది. ఈ విషయంలో సీఎం కేసీఆర్‍ ఇచ్చిన హామీ నెరవేరలేదు. ఒక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజీని ఏర్పాటుచేసినా 80శాతం సమస్య తీరుతుందని, వరంగల్​ సిటీ వరద ముప్పు నుంచి బయట పడుతుందని ఆఫీసర్లు అంటున్నారు.

ఇంట్లో ఉండలేం ..బయటికి పోలేం

మాది హన్మకొండ పోచమ్మకుంట. వర్షం వస్తే మొదట మా కాలనీ వణుకుతది. రోడ్లు సక్కగా లేవ్‍. మోరీలు లేవ్‍. ఇంట్లో మంచాలు మునిగే వరకు వరద వస్తది. రోడ్లపై నడుం లోతు వరకు నీళ్లొస్తయ్‍ ఇంట్లో ఉండలేం. అలా అని బయటకు పోలేం. ఒక్కటి కాదు రెండు కాదు యాభై, అరవై ఏళ్లు గా మా పరిస్థితి ఇంతే. పక్క నుండే నయీంనగర్‍ నాలా మొత్తం కబ్జా అవుతోంది. అందులో వెళ్లాల్సిన వాన నీళ్లు మా ఇళ్లకు వస్తున్నయ్‍. ఇదే విషయాన్ని లీడర్లు , అధికారులకు ఎన్నోసార్లు చెప్పినం. –శ్రావణ్‍, బాధితుడు

కబ్జాలే అసలు సమస్య

చెరువులు, కుంటలు, నాలాలు కళ్ల ముందు కబ్జా చేస్తున్నా ఆఫీసర్లు, లీడర్లు ఏనాడు పట్టించుకోలే. వెంచర్లు , కొత్త కాలనీలకు పర్మిషన్‍ ఇచ్చే ఆఫీసర్లు అక్కడ మోరీలు కట్టట్లేదు. 40 శాతం కాలనీల్లో ఇదే దుస్థితి. పాత రాష్ట్రంలో.. ప్రత్యేక రాష్ట్రంలో అండర్‍ గ్రౌండ్‍ డ్రైనేజీ వ్యవస్థ కల నేరవేరడంలేదు. ఇన్ని సమస్యలున్నాయి కాబట్టే వరద నీరు ఇండ్లలోకి చేరి జనాలను వణికిస్తోంది. –పుల్లూరు సుధాకర్‍  (ఫోరం ఫర్‍ బెటర్‍ వరంగల్‍ అధ్యక్షుడు).