కరోనాతో మృతి.. ఆ కుటుంబాలకు తప్పని అవమానం

కరోనాతో మృతి.. ఆ కుటుంబాలకు తప్పని అవమానం

గ్రామాల పొలిమేరలకు మృతదేహాలను తీసుకరావద్దంటున్నరు
కరోనా మృతదేహాల ఖననంపై ప్రజల్లో భయం భయం
కరోనా బాధిత కుటుంబాలపై గ్రామాల్లో వివక్ష
దహన సంస్కారాలు అడ్డుకుంటే
చర్యలు తీసుకుంటామన్న ఆఫీసర్లు

మహబూబాబాద్, వెలుగు: కరోనా మృతులకు, మృతుల కుటుంబాలకు అవమానాలు తప్పడం లేదు. కరోనా బాధితకుటుంబాలపై గ్రామాలు, పట్టణాల్లో తీవ్రమైన వివక్ష సాగుతోంది. మానసికంగా ధైర్యం కల్పించాల్సిన ఇరుగు పొరుగు వారు మానవత్వం మరిచిపోతున్నారు. కరోనా మృతులకు అంత్యక్రియలు
నిర్వహించడానికి తమకు కరోనా సోకుతుందనే భయంతో మృతదేహాలను ఊరిలోకి అనుమతించడం లేదు. అలాగే కొన్నిచోట్ల పొలిమేరల్లో కూడా అంత్యక్రియలు చేయడానికి ఒప్పుకోవడంలేదు. దీంతో చివరి చూపుకు నోచుకోకపోవడంతో పాటు మరింత దు:ఖంలో వారి కుటుంబ సభ్యులు మునిగి పోవలసి వస్తోంది.

కరోనా మరణం అంటేనే భయపడిపోతున్నరు. కరోనా మరణం అనగానే ప్రజలు భయపడిపోతున్నారు. కరోనా సోకిన కుటుంబసభ్యులు ఉన్న ప్రదేశం వైపు కన్నెత్తి చూసేధైర్యం చేయడం లేదు. ఆపదలో ఉన్నవారికి సహాయ నిరాకరణ ప్రకటిస్తున్నారు. కొన్నిచోట్ల కిరాణాసరుకులువిక్రయించడం లేదు. పాలు పోయడం లేదు. కూరగాయలు అమ్మడం లేదు. దీంతో ఒక వైపు కరోనాతో కుటుంబ సభ్యుడు బాధపడుతుండగా కుటుంబ సభ్యులు సామాజిక వివక్షగురవుతున్నారు. తమ బాధలను ఎవరికీ చెప్పుకోలేక జీవనం కొనసాగిస్తున్నారు. మృతదేహాల వద్దకు వెళ్లినా , చూసినా కరోనా వస్తుందనే భయంతో ప్రజలు కరోనా మృతులకు ఊరి పొలిమేరల్లో అంత్యక్రియలు నిర్వహించనివ్వడం లేదు.

ఖననాన్ని అడ్డుకున్నరు..

మహబూబాబాద్‌‌ జిల్లాలోని బయ్యారం మండల కేంద్రానికి చెందిన 65 ఏండ్ల వ్యక్తికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఇటీవల జిల్లా కేం ద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్లో చేరాడు. జ్వరం, దగ్గు ఎక్కువగా ఉండడంతో కరోనా టెస్టు చేయగా పాజిటివ్ వచ్చింది. ఈ నెల 23న మృతి చెందాడు. కొడుకులు అందుబాటులో లేకపోవడంతో మృతదేహాన్ని ఎవరూ తీసుకుపోలేదు. దీంతోమున్సిపల్, రెవెన్యూ సిబ్బంది జిల్లా కేంద్రంలోని నందినగర్‌‌‌‌ సమీపంలోని గుండ్లకుంట సమీపంలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధంకాగా కాలనీ వాసులు అడ్డుకున్నారు. ఇక్కడ దహనం చేస్తే తమకు కరోనా వస్తుందని మృతదేహాన్ని అక్కడి నుంచి తీసుకుపోవాలని ఆందోళనకు దిగారు. దీంతో చేసేది ఏమీలేక అతడి సొంత మండలం బయ్యారం సమీపంలో ఎవరికీ తెలియకుండా గుట్టల నడుమ జేసీబీతో గుంతను తవ్విపూడ్చి పెట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం