
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : దేశం జోలికి ఎవరొచ్చినా సత్తా చూపిస్తామని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి అన్నారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన సందర్భంగా ఖమ్మం సిటీలో మహిళల ఆధ్వర్యంలో ఆదివారం ర్యాలీ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ పహల్గాంలో పురుషులను తమ భార్యల ముందే కిరాతకంగా హతమార్చి వారి సిందూరాన్ని తుడిచిన ఉగ్రవాదులకు ప్రధాని మోదీ తగిన గుణపాఠం చెప్పారన్నారు.
ఆపరేషన్ సిందూర్‌కు నాయకత్వం వహించిన కల్నల్ సోఫియా, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌తో పాటు ఆపరేషన్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరరావు మాట్లాడుతూ దేశ ఆర్మీకి మహిళాలోకంతో పాటు, ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని కోరారు. ఈ ర్యాలీలో కన్వీనర్ సన్నే ఉదయ్ ప్రతాప్, నాయకులు బండారు నరేశ్, నకరికంటి వీరభద్రం, విజయ రెడ్డి, దొడ్డ అరుణ, పమ్మి అనిత, నీరుకొండ ఉశా రాణి, శ్రీరామనేని మణి, మంద సరస్వతి పాల్గొన్నారు.