సాగుభూముల జోలికొస్తే.. ఫారెస్ట్​ ఆఫీసర్లను తరిమికొట్టండి

సాగుభూముల జోలికొస్తే.. ఫారెస్ట్​ ఆఫీసర్లను తరిమికొట్టండి

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు

పినపాక, వెలుగు: తరతరాలుగా పోడు సాగు చేసుకుంటున్న నిరుపేదలకు రాష్ట్ర  ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, బీమా పథకాలు అందకుండా ఫారెస్ట్​ ఆఫీసర్లు అడ్డుపడుతున్నారని ఖమ్మం జిల్లా పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్​రేగా కాంతారావు ఆరోపించారు. సాగులో ఉన్న భూముల జోలికి వస్తే ఫారెస్ట్​ఆఫీసర్లను తరిమికొట్టాలని పోడు రైతులకు సూచించారు. శనివారం ఆయన పినపాక మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి పోడు సాగుదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై రైతులతో ముచ్చటించారు. తోగ్గూడెం గ్రామంలో సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు. దుగినేపల్లి పరిధిలోని సర్వే నం.30, పోట్టపల్లిలోని సర్వే నం.560, పినపాక పరిధిలోని సర్వే నం.512లో ఉన్న వేలాది ఎకరాలు గవర్నమెంట్​ల్యాండ్స్​అని రికార్డులు తేటతెల్లం చేస్తున్నప్పటికీ ఫారెస్ట్​ఆఫీసర్లు అత్యుత్సాహంతో ట్రెంచ్​లు కొడుతూ నిరుపేద రైతులను భయాందోళనకు గురి చేస్తున్నారని ఆరోపించారు. స్టేట్​గవర్నమెంట్​నుంచి శాలరీ తీసుకుంటూ సెంట్రల్​గవర్నమెంట్​రూల్స్​పాటిస్తామని చెప్పడం దారుణమన్నారు.  సమావేశంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ, సర్పంచి శ్రీలత, ఆత్మ కమిటీ చైర్మన్​ పొనుగోటి భద్రయ్య తదితరలు పాల్గొన్నారు.