
ముంబై: వడ్డీ రేట్లు మరింత పెరిగితే తమ ఇంటి కొనుగోలు ప్రపోజల్ వాయిదా వేసుకోవాల్సి వస్తుందని బయర్లు అంటున్నారు. సీఐఐ–ఎనరాక్ నిర్వహించిన ఒక సర్వేలో 96 శాతం మంది ప్రాస్పెక్టివ్ బయ్యర్లు ఈ అభిప్రాయం వెల్లడించారు. మొత్తం 4,662 మందిపై సర్వేను నిర్వహించారు. ది హౌసింగ్ మార్కెట్ బూమ్ పేరిట రిపోర్టును ముంబైలో జరిగిన సీఐఐ రియల్ ఎస్టేట్ కాన్ఫ్లుయెన్స్ 2023 సందర్భంగా రిలీజ్ చేశారు. హోంలోన్లపై వడ్డీరేట్లు పెరిగితే ఇల్లు కొనడాన్ని వాయిదా వేస్తామని సర్వేలో పాల్గొన్న వారిలో 96 శాతం మంది వెల్లడించినట్లు ఎనరాక్ తెలిపింది. తాజా మానిటరీ పాలసీ మీటింగ్‌లో ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపుదలను తాత్కాలికంగా నిలిపి వేసిన విషయం తెలిసిందే. ప్రాపర్టీలు కొనాలనుకునే వారిలో 80 శాతం మందికి హోమ్‌లోన్ వడ్డీ రేట్లతోపాటు, ప్రాపర్టీల ధరలే ముఖ్యమైనవిగా నిలుస్తున్నాయి. గత ఏడాది కాలంగా ప్రాపర్టీల బేసిక్ కాస్ట్ పెరుగుతూ వస్తోంది. పెద్ద ఇండ్లు కావాలనుకునే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతున్నట్లు సర్వే రిపోర్టు పేర్కొంది. సర్వేలో పాల్గొన్న వారిలో 42 శాతం మంది 3 బీహెచ్‌కే ఇష్టపడుతుండగా, 40 శాతం మంది 2 బీహెచ్‌కే, 12 శాతం మంది 1 బీహెచ్‌కే, 6 శాతం మంది 3 బీహెచ్‌కే కంటే పెద్ద ఇండ్లు కావాలనుకుంటున్నారని రిపోర్టు వివరించింది.
నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో ప్రాపర్టీలు కొనాలనుకునే వారిలో 45 శాతం మంది సమీప భవిష్యత్‌లో 3 బీహెచ్‌కే కొనాలనుకుంటున్నారు. ప్రాపర్టీలు బాగా ఖరీదైన ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో 43 శాతం మంది 2 బీహెచ్‌కే చాలనుకుంటున్నట్లు సర్వే రిపోర్టు వెల్లడించింది. కానీ, మరో 32 శాతం మంది మాత్రం 3 బీహెచ్‌కేలను ఇష్టపడుతున్నట్లు తెలిపింది. ప్రాపర్టీ కొందామనుకునే వారిలో 58 శాతం మంది రూ. 45 లక్షల నుంచి రూ. 1.50 కోట్ల మధ్యలో ప్రాపర్టీలను చూస్తున్నారని, ఎక్కువ మంది ఏడాదిలోపు నిర్మాణం పూర్తయ్యే ఇల్లే కొనాలనుకుంటున్నారని సీఐఐ–ఎనరాక్ సర్వే రిపోర్టు పేర్కొంది. ప్రాస్పెక్టివ్ బయ్యర్ల నిర్ణయంపై వడ్డీ రేట్ల పెరుగుదల ఇప్పటికే ఎఫెక్ట్ చూపిస్తోంది, ఇప్పుడు సాగుతున్న ఉద్యోగాల కోతలు రాబోయే నెలల్లో ఎంతో కొంత ఎఫెక్ట్ చూపిస్తాయని ఎనరాక్ ఛైర్మన్ అనుజ్‌పురి చెప్పారు. కానీ, చాలా మందికి సొంత ఇల్లు కొనుక్కోవాలనే కోరిక మాత్రం టాప్ ప్రయారిటీగానే కొనసాగుతోందని ఆయన వివరించారు.