ఫొటో తియ్యి.. హోటల్ లో నెలంతా ఫ్రీగా ఉండు

ఫొటో తియ్యి.. హోటల్ లో నెలంతా ఫ్రీగా ఉండు

టూరిస్టుల్ని ఆకర్షించడానికి చాలా దేశాల్లోని హోటళ్లు, టూరిజం కంపెనీలు స్పెషల్​ ఆఫర్స్ ఇస్తుంటాయి. అలాంటి ఆఫరే ఇస్తోంది ఐస్​లాండ్​లోని ‘రంగా హోటల్’. ఫొటోగ్రాఫర్లు అక్కడ  నెల రోజులు ఫ్రీగా ఉండాలంటే నార్తర్న్​ లైట్స్​ ఫొటోలు, వీడియోలు తీస్తే చాలు. ఐస్​లాండ్​లోని అందమైన టౌన్​ హెల్లాలో ఉంది  ఈ హోటల్​. రాత్రిపూట ఇక్కడి ఆకాశం పలు రంగుల్లో వెలిగిపోతూ  కనులవిందుగా కనిపిస్తుంది. ఈ వెలుగుల్ని ‘నార్తర్న్​ లైట్స్’ అంటారు. ‘అరోరా బొరియాలిస్’ లేదా ‘పోలార్​ లైట్స్​​’ అని పిలిచే ఇవి ఎలా ఏర్పడతాయంటే... సోలార్ విండ్ కారణంగా​ మాగ్నెటోస్పియర్​లో వచ్చే అంతరాయాల వల్ల ఆకాశం రంగులు పులుముకుంటుంది. అప్పుడు ఆకాశం అంతా ఆకుపచ్చ, పసుపు, నీలం, ఊదా రంగుల్లో, అప్పుడప్పుడు ఆరెంజ్, తెల్లని రంగుల్లో మెరిసిపోతుంది. ఈ దృశ్యాన్ని చూసేందుకు రెండు కళ్లు చాలవు. 
విమాన టికెట్లు ఉచితం
‘రంగా హోటల్​’ ఎందుకు ఈ ఆఫర్​ చేస్తుందో తెలుసా...  నార్తర్న్​ లైట్స్​ని బాగా దగ్గరి నుంచి చూడాలన్నా, ఫొటో తీయాలన్నా ఈ హోటలే సరైన్​ ప్లేస్​. అందుకే  వాటిని ఫొటో తీసిన ఫొటోగ్రాఫర్లకి నెలంతా ఉచితంగా బసచేసే ఆఫర్​ ఇస్తోంది. అలాగే, వాళ్లకి ఐస్​లాండ్ నుంచి సొంత దేశానికి వెళ్లేందుకు విమాన టిక్కెట్లు కూడా ఇస్తారు. అయితే, ఒక కండిషన్​ ఉంది. ఆ ఫొటోగ్రాఫర్​ సెప్టెంబర్, అక్టోబర్ మధ్య కాలంలో అందుబాటులో ఉండాలి. ఆకాశంలో నార్తర్న్​ లైట్స్​ ఎప్పుడు వస్తాయో ఊహించడం కష్టం. ఆ అద్భుతాన్ని కెమెరాలో బంధించడం ఎంతో థ్రిల్లింగ్​గా ఉంటుంది. ఇక్కడి అబ్జర్వేటరీలో రెండు  పెద్ద టెలిస్కోప్స్​ ఉంటాయి. నార్తర్న్​ లైట్స్​ని  పర్ఫెక్ట్​గా ఫొటో తీయడంలో లోకల్​ సైంటిస్టులు గైడ్​ చేస్తారు. అందుకే, ప్రొఫెషనల్​ ఫొటోగ్రాఫర్స్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు పోటీపడుతున్నారు. 
ఇలా అప్లై చేయాలి
ఆసక్తి ఉన్న ఫొటోగ్రాఫర్లు ‘హోటల్​ రంగా’ వెబ్​సైట్​లో అప్లికేషన్​ నింపాలి. తమకున్న సోషల్​మీడియా పాపులారిటీ, ఫొటోగ్రఫీ అనుభవం, గతంలో ఐస్​లాండ్​లో పర్యటించి ఉంటే, ఆ వివరాలు, వ్యాక్సిన్ వేసుకున్నారా? లేదా? వంటి ప్రశ్నలకు జవాబు చెప్పాలి. అప్లై చేసేవాళ్లు తాము ఎందుకు ఆ హోటల్​ ఫొటోగ్రాఫర్​ అవ్వాలనుకుంటున్నారో వివరించాలి కూడా.