​ధరణిలో కట్టిన పైసలు వాపస్ ఇయ్యని సర్కార్

​ధరణిలో కట్టిన పైసలు వాపస్ ఇయ్యని సర్కార్
  • రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకున్నోళ్లకు తిప్పలు
  • మ్యుటేషన్ అప్లికేషన్ రిజెక్ట్ చేసినా పైసలు తిరిగియ్యట్లే 
  •  కోట్లాది రూపాయలు సర్కార్ ఖజానాలోనే
  • లబోదిబోమంటున్న లక్షన్నర మంది బాధితులు 
  • పోర్టల్ ప్రారంభమైనప్పటి నుంచీ ఇదే తీరు
  • డబ్బులు ఎప్పుడొస్తయో తెలియదంటున్న తహసీల్దార్లు, కలెక్టర్లు

హైదరాబాద్, వెలుగు : ధరణి పోర్టల్ లో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, కోట్లాది రూపాయలు సర్కార్ ఖజానాలో మూ విరాసత్ తదితర లావాదేవీల కోసం డబ్బులు చెల్లించి స్లాట్ బుక్ చేసుకుని ఏదైనా కారణంతో క్యాన్సిల్ చేసుకుంటే కట్టిన డబ్బులు వాపస్ రావడం లేదు.  అత్యాధునిక సాఫ్ట్ వేర్ తో రూపొందించిన ధరణి పోర్టల్ లో డబ్బులు వాపస్ వసూలు చేయడం తప్ప.. వాపసేచేసే టెక్నాలజీ లేకుండా పోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ధరణిపోర్టల్ అందుబాటులోకి వచ్చాక గడిచిన 23నెలల్మలో ఆఫీసర్లు, దరకాస్తుదారులు క్యాన్సిల్ చేసుకున్న స్లాట్లకు సంబంధించిన డబ్బులు కోట్లాది రూపాయలు సర్కార్ ఖజానాలో మూలుగుతున్నాయి. నిమిషాల్లో సంబంధిత దరఖాస్తుదారుల ఖాతాల్లో పడాల్సిన డబ్బులు నెలలు గడిచినా జమకావడం లేదు.

వసూళ్లలో ముందు..వాపస్ చేయడంలో నిర్లక్ష్యం

వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, సక్సేషన్ల కోసం రూపోందించిన ధరణి పోర్టల్ ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 10 లక్షల లావాదేవీలు దాటిపోగా ఆదాయం సుమారు రూ.5 వేల కోట్లు దాటింది. ధరణిలో వివిధ రకాల లావాదేవీలకు లెక్కగట్టి మరీ డబ్బులు వసూలు చేస్తున్న ప్రభుత్వం.. అనివార్య కారణాలతో స్లాట్ క్యాన్సిల్ చేసుకున్నోళ్లకు డబ్బులు వాపస్​ ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. ఏటీఎం మిషన్​లో డబ్బులు రాకపోయినా అమౌంట్ కట్ అయినట్లుగా చూపిస్తే సేమ్ బ్యాంక్​ అయితే వారం రోజుల్లో, ఇతర బ్యాంకులైతే నెల రోజుల్లో తిరిగి రీఫండ్ చేయడం రోజూ వందల్లో జరుగుతుంది. గూగుల్ పే, ఫోన్​ పేలాంటి యాప్​ బేస్డ్​ ట్రాన్జక్షన్స్ లోనూ సర్వర్ ప్రాబ్లంతో కొన్నిసార్లు డబ్బులు కట్ అయినా.. మళ్లీ ఒక రోజులో యాడ్ అవుతాయి. కానీ అత్యాధునికమైన సాఫ్ట్ వేర్​తో రూపొందించిన ధరణి పోర్టల్ లో మాత్రం ఈ తరహా మెకానిజం లేకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. 

టెక్నికల్​ ఇష్యూసే ఎక్కువ.. 

సబ్‌‌ రిజిస్ట్రార్‌‌ ఆఫీసుల్లో స్టాంపు డ్యూటీ చెల్లించిన తర్వాత రిజిస్ట్రేషన్‌‌ను రద్దు చేసుకుంటే..  స్టాంపు డ్యూటీ ఫీజులో 10 శాతాన్ని సర్వీసు చార్జీల కింద కట్ చేసుకుని మిగతా డబ్బులను తిరిగి విక్రయదారులకు సుమారు మూడు నెలలలోపు ఇస్తున్నారు. కానీ ధరణిలో రిజిస్ట్రేషన్‌‌ కోసం స్లాట్‌‌ బుకింగ్‌‌ చేసుకున్న తర్వాత అనివార్య కారణాలతో రద్దు చేసుకుంటే చెల్లించిన స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌‌ ఫీజులను వాపస్​ఇవ్వడం లేదు. ధరణిలో భూమి రిజిస్ట్రేషన్‌‌ కోసం స్లాట్‌‌ బుకింగ్‌‌ చేసుకునేటప్పుడు ఆన్ లైన్​లో చార్జీలు చెల్లించినప్పటికీ టెక్నికల్ ఎర్రర్, సర్వర్‌‌ నెమ్మదించడం, ఇతర కారణాలతో  కొన్నిసార్లు చలానా జనరేట్‌‌ కావడం లేదు. దీంతో మళ్లీ చార్జీలు చెల్లిస్తేనే  చలానా జనరేట్‌‌ కావడంతోపాటు స్లాట్‌‌బుక్‌‌ అవుతుంది. ఫస్ట్ టైం చెల్లించిన డబ్బులు తిరిగి రావడం లేదు. పెండింగ్‌‌ మ్యుటేషన్, సక్సేషన్‌‌ దరఖాస్తుల సపోర్టెడ్ డాక్యుమెంట్లు సక్రమంగా లేకపోవడం, భూముల లెక్కల్లో గందరగోళం ఉండడం, పార్టీషియన్​లో సరైన బౌండరీస్​ పేర్కొనకపోవడంతోపాటు మరేదైనా కారణంతో కలెక్టర్లు రిజెక్ట్​ చేస్తున్నారు. పెండింగ్‌‌ మ్యుటేషన్, సక్సేషన్‌‌ దరఖాస్తుదారులు అప్లికేషన్​ టైంలో కట్టిన డబ్బులు తిరిగి చెల్లించడం లేదు. 

లక్షన్నర మంది బాధితులు..

స్లాట్ క్యాన్సిలై ధరణి పోర్టల్ లో డబ్బులు ఉండిపోయిన బాధితులు రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్షన్నర మంది ఉన్నట్లు అంచనా. అధికారిక లెక్కల ప్రకారమే ఈ నెల 3 వరకు పెండింగ్ మ్యుటేషన్​ అప్లికేషన్లు 2,87,404 రాగా ఇందులో 58,319 అప్లికేషన్లను కలెక్టర్లు రిజెక్ట్​ చేశారు. అలాగే సక్సేషన్ వితౌట్ పీపీబీ ఆప్షన్ కింద మరో 49,235 మంది అప్లై చేసుకుంటే 21,201 అప్లికేషన్లను రిజెక్ట్ చేశారు. ఏదో ఓ కారణంతో మ్యుటేషన్, సక్సేషన్‌‌ దరఖాస్తులను కలెక్టర్లు రిజెక్ట్​ చేస్తే ఆ సొమ్మును తిరిగి పొందేందుకు కనీసం ధరణిలో ఆప్షన్‌‌ కూడా లేదు. అంతేగాక మరో 70 వేల మంది వరకు రిజిస్ట్రేషన్​ కోసం చేసుకున్న స్లాట్లను అనివార్య కారణాలతో క్యాన్సిల్ చేసుకున్నారని అంచనా. వీరు ఒక్కొక్కరు లావాదేవీని, భూమి విస్తీర్ణాన్ని బట్టి రూ.10 వేల నుంచి రూ.50 వేలకు స్లాట్​ బుక్ చేసుకునే టైమ్​లో చెల్లించారు. 

చేతులెత్తేస్తున్న కలెక్టర్లు, తహసీల్దార్లు.. 

ధరణిలో డబ్బులు పోగొట్టుకున్న బాధితులు స్లాట్‌‌ క్యాన్సిల్‌‌ స్లిప్పులతో తహసీల్దార్‌‌, కలెక్టర్​ఆఫీసులు, మీ సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. డబ్బులు వాపస్​ చేయడం తమ చేతుల్లో లేదని, పై నుంచే రావాలని సదరు అధికారులు చేతులెత్తేస్తున్నారు. దీంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక బాధితులు లబోదిబోమంటున్నారు.

రూ.36 వేలు పోయినయ్​

పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం పొట్యాలకు చెందిన వేల్పుల సాంబమ్మ తన కూతురుకు ఎకరా భూమిని బదిలీ చేయించడానికి ఈ ఏడాది మార్చి 22న ధరణిలో స్లాట్​బుక్​ చేయించారు. ఇందుకోసం రూ.36 వేలు కట్టారు. టెక్నికల్​సమస్య వల్ల భూమి కూతురు రుక్మిణి పేరిట రిజిస్టర్ కాలేదు. కానీ పవర్​ఆఫ్ అటార్నీ మాత్రమే వచ్చింది. ఎమ్మారో ఆఫీసులో అడిగితే ఆ ట్రాన్సాక్షన్​ను రద్దు చేసుకోవాలన్నారు. దీంతో  సేల్​ డీడ్​ క్యాన్సిలేషన్​ కోసం అదే నెల 26న మరో రూ.2,300 కట్టి స్లాట్​బుక్​ చేయించుకున్నారు. ‘ట్రాన్సాక్షన్​ సక్సెస్​ఫుల్​’ అని మెసేజ్​ వచ్చింది కానీ సేల్​ డేడ్​ మాత్రం రద్దు కాలేదు. ఇప్పుడు ఆ భూమి ఎవరిపై ఉందో అర్థం కావడం లేదు. ఎమ్మార్వో ఆఫీసులో అడిగితే తెలియదంటున్నారు. కలెక్టర్​ఆఫీసులో అప్లికేషన్​ ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదు