అప్పటి ప్రభుత్వం స్థలాలిస్తే.. ఈ ప్రభుత్వం లాక్కుంటోంది

అప్పటి ప్రభుత్వం స్థలాలిస్తే.. ఈ ప్రభుత్వం లాక్కుంటోంది

2009లో ఇచ్చిన ఇండ్ల పట్టాల రద్దు

నిరాహార దీక్షకు దిగిన 500 మంది

ఖమ్మం అర్బన్, వెలుగు: పదేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం నిరుపేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించింది. ఆ పట్టాలను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేయడంతో 500 మంది బాధితులు నిరాహార దీక్షకు దిగారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో శనివారం జరిగింది. బాధితుల వివరాల ప్రకారం.. 2009లో ఖమ్మం నగర శివారులోని శివాయిగూడెం సర్వే నంబర్ 175లో అప్పటి ప్రభుత్వం 2500 మంది నిరుపేదలకు ఇండ్ల స్థలాలను కేటాయించింది. అక్కడ ఇండ్లు కట్టుకోవటానికి బ్యాంక్ ద్వారా లోన్లు ఇప్పిస్తామని నాటి ప్రభుత్వం పేర్కొంది. అయితే ఎన్నిసార్లు తిరిగినా చాలా మందికి లోన్లు రాలేదు. మరోవైపు ఆ స్థలంలో మౌలిక వసతులు కూడా కల్పించలేదు. తాము అక్కడ ఇండ్లు కట్టుకుంటామని, కనీస వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ కు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదని లబ్ధిదారులు చెప్పారు . ఇటీవల కొందరు వారికి కేటాయించిన స్థలాల్లో ఇల్లు కట్టుకుంటుంటే రెవెన్యూ అధికారులు వచ్చి అడ్డుకున్నారు. ఇదేంటని అడిగితే మీ ఇండ్ల పట్టాలు క్యాన్సి ల్ అయ్యాయని చెప్పారు. దీంతో బాధితులంతా గురువారం తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ధర్నా చేశారు. అయినప్పటికీ వారి సమస్య పరిష్కారం కాలేదు. దీంతో సుమారు 500 మంది శనివారం ఇండ్ల స్థలాల దగ్గర నిరాహార దీక్షకు దిగారు.

డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తమన్నరు

గతంలో ఎంత తిరిగినా లోన్లు రాలేదని, ఇప్పుడు లోన్లు వచ్చే సమయాయినికి టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టాలు రద్దు చేసిందని బాధితులు ఆరోపించారు. గతంలో సీఎం కేసీఆర్ ఖమ్మం వచ్చినప్పడు శివాయిగూడెంలోని స్థలాల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించి ఇస్తానని మాట ఇచ్చారన్నారు. కానీ కట్టించలేదన్నారు. తామే ఇల్లు కట్టుకుంటుంటే అధికారులు అడ్డుకుంటున్నారని అన్నారు. దీక్షా శిబిరం వద్దకు తహసీల్దార్, సీఐ, ఎస్సై వచ్చి చర్చలు జరిపారు. ఆర్డీవోతో మాట్లాడి నిర్ణయం ప్రకటిస్తామని, సమస్యను పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.