సెక్రటరీని నియమించకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సర్పంచ్

సెక్రటరీని  నియమించకపోతే  ఆత్మహత్య  చేసుకుంటా: సర్పంచ్

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం వెంకటాయపల్లి గ్రామ సర్పంచ్ మేఘరాజ్ ఆడియో వైరల్ గా మారింది. తాను సర్పంచ్ గా గెలిచి నాలుగు సంవత్సరాలైనా ఇప్పటికీ గ్రామ సెక్రటరీ లేడని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ కార్యదర్శి లేక పనులు ఆగిపోయాయని, బిల్లులు రావడం లేదని ఆడియోలో పేర్కొన్నారు. సెక్రటరీ లేకపోవడం వలన గ్రామ అభివృద్ధి కుంటుపడుతుందన్న మేఘరాజ్.. గ్రామ సెక్రటరీని వారం రోజుల్లో నియమించకపోతే  ఆత్మహత్య  చేసుకుంటానని హెచ్చరించారు. తన చావుకి కారణం జిల్లా పంచాయతీ అధికారి, మండల అభివృద్ధి అధికారి, ఏపీవోలే కారణమని తెలిపారు. వైకుంఠధామం  నిర్మించి సంవత్సరం అయినా ఇంకా రికార్డు చెయ్యలేదన్నారు.

సెగ్రెషన్ షెడ్ఢు కట్టి నిర్మించినా.. అది భారీ వర్షాలకి కూలిపోయిందని మేఘరాజ్ ఆడియో సందేశంలో తెలియజేశారు. అధికారులు మెడ మీద కత్తి పెట్టి మళ్ళీ నిర్మించాలని ఒత్తిడి తిసుకువస్తే మళ్ళీ నిర్మించానని, కానీ ఇప్పటి వరకూ రికార్డు చెయ్యలేదని ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడా ప్రాంగణాన్ని రూ.64వేలు పెట్టి నిర్మిస్తే రూ.42వేలు రికార్డు చేశారని చెప్పారు. పదిహేను రోజుల్లో తన పని పూర్తి చెయ్యకపోతే మండల అభివృద్ధి కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారు. తన చావుతోనైనా మిగతా అందరు సర్పంచులకు న్యాయం జరుగుతుందని మేఘరాజ్ ఆడియో ద్వారా తెలిపారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.