టీమిండియా స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ తన బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. CEAT పురుషుల T20I బ్యాటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును శాంసన్ గెల్చుకున్న సంగతి తెలిసిందే. మంగళవారం (అక్టోబర్ 7) అవార్డ్ ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తన బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై నోరు విప్పాడు శాంసన్. జట్టు అవసరాల కోసం 9వ స్థానంలో బ్యాటింగ్ చేయమని కోరినా తాను సిద్ధంగా ఉన్నానని.. ఇందులో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని క్లారిటీ ఇచ్చాడు.
తనకు లైట్‌గా ఎడమచేతి వాటం స్పిన్ బౌలింగ్ చేయడం కూడా వచ్చని.. జట్టు కోసం కావాలంటే బౌలింగ్ కూడా వేస్తానని అన్నాడు. దేశం కోసం ఏ పని చేసినా నాకు అభ్యంతరం లేదని స్పష్టం చేశాడు. ఇండియా జెర్సీ ధరించడానికి తాను చాలా కష్టపడ్డానని.. ఆ జెర్సీ ధరించిన తర్వాత దేనికి నో చెప్పాలేమన్నాడు. దేశం తరుఫున ఆడటం నాకు చాలా గర్వంగా ఉందన్నాడు.
ఇటీవలే 10 సంవత్సరాల అంతర్జాతీయ క్రికెట్‌ను పూర్తి చేసుకున్నానని.. ఈ 10 సంవత్సరాలలో ఇండియా తరుఫున కేవలం 40 మ్యాచులు మాత్రమే ఆడానని చెప్పాడు. కాగా, ఇటీవల జరిగిన ఆసియా కప్‌లో జట్టు అవసరాల దృష్ట్యా శాంసన్ తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది. అభిషేక్ శర్మ, శుభమన్ గిల్ ఆసియా కప్‌లో టీమిండియా ఓపెనర్స్‌గా బరిలోకి దిగారు. శాంసన్ మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేశాడు. అయినప్పటికీ శాంసన్ ఇండియా విజయాల్లో కీలక పాత్ర పోషించి.. తన సత్తా ఏంటో చూపించాడు.
