మాపై దాడి చేస్తే.. ఇరాన్ రాజధాని మ్యాప్లో లేకుండా చేస్తా: ట్రంప్

మాపై దాడి చేస్తే.. ఇరాన్ రాజధాని మ్యాప్లో లేకుండా చేస్తా: ట్రంప్
  • ఇజ్రాయెల్​ దాడులతో మాకు సంబంధం లేదు: ట్రంప్
  • నేను తలుచుకుంటే ఘర్షణ వెంటనే ముగిస్తానని కామెంట్​
  • న్యూక్లియర్ డీల్ చేసుకోవాలన్న ప్రెసిడెంట్

వాషింగ్టన్: అమెరికాపై ఇరాన్ దాడులకు దిగితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్​పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో అమెరికా ప్రమేయం లేదని స్పష్టం చేశారు. ఏ తరహాలో అయినా అమెరికాపై ఇరాన్ ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తే మాత్రం.. సైన్యం మొత్తం దించుతానని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. టెహ్రాన్​ను భూస్థాపితం చేస్తామన్నారు. 

తాము దాడి చేస్తే దాని తీవ్రత ఇరాన్ ఊహకు కూడా అందదని హెచ్చరించారు. టెహ్రాన్‌‌‌‌పై శనివారం రాత్రి జరిగిన దాడులతో తమకు సంబంధం లేదని చెప్పారు. ఇరాన్‌‌‌‌కు చెందిన అణ్వాయుధ కేంద్రాలు, రక్షణశాఖ ప్రధాన కార్యాలయంపై పెద్దఎత్తున దాడులు చేసినట్లు ఇజ్రాయెల్‌‌‌‌ ప్రకటించిన గంటల వ్యవధిలో ట్రంప్‌‌‌‌ ఈ మేరకు స్పందించారు. టెహ్రాన్ – టెల్‌‌‌‌ అవీవ్‌‌‌‌ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపడం తనకు చాలా ఈజీ అని పేర్కొన్నారు. 

తాను తలుచుకుంటే ఈ సంఘర్షణను వెంటనే ముగించగలనని తెలిపారు. ఇజ్రాయెల్‌‌‌‌ దాడుల్లో ఇరాన్‌‌‌‌ పూర్తిగా నాశనం అవ్వకముందే తమతో న్యూక్లియర్ డీల్ చేసుకోవాలని హెచ్చరించారు. ఒకప్పుడు ఇరానియన్‌‌‌‌ సామ్రాజ్యంగా పేరొందిన మీ దేశాన్ని కాపాడుకోవాలంటే అక్కడి పాలకులు ముందుకు రావాలని ఆయన అన్నారు. ఇజ్రాయెల్​కు అమెరికా మద్దతు మాత్రం ఉంటుందని స్పష్టం చేశారు. 

అయితే, ఇరాన్​పై దాడులతో అమెరికాకు ఎలాంటి సంబంధం ఉండదని తేల్చి చెప్పారు. కాగా, ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ స్పందించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికాతో చర్చలు అర్థరహితమని ఇరాన్‌‌‌‌ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్‌‌‌‌ అరాగ్చీ స్పష్టం చేశారు. ఒకవైపు తమపై దాడులకు మద్దతునిస్తూ.. మరోవైపు అణు ఒప్పందంపై చర్చలకు ఆహ్వానించడం సరికాదని అన్నారు.