న్యూఢిల్లీ: ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ విధానానికి తిరిగి వెళ్లాలని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న డిమాండ్ పై బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఘాటుగా స్పందించారు. ‘‘బ్యాలెట్ పేపర్ విధానానికి తిరిగి వెళ్తే మళ్లీ బూత్ క్యాప్చరింగ్ రోజులు తిరిగి వస్తాయని’’ ఆయన పేర్కొన్నారు. బుధవారం లోక్‌సభలో ‘ఎన్నికల సంస్కరణలు’ అంశంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.
పాత బ్యాలెట్ పేపర్ విధానం గురించి మాట్లాడటం మానుకోవాలని ప్రతిపక్షాలను హెచ్చరించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల(ఈవీఎం)ను సమర్థిస్తూ సుప్రీంకోర్టు, హైకోర్టులు కనీసం రెండు డజన్ల తీర్పులు చెప్పాయని ఆయన గుర్తుచేశారు. ఈవీఎంలను హ్యాక్ చేయాలని ఎన్నికల సంఘం అన్ని పార్టీలను ఆహ్వానించినా.. ఒక్కరూ ముందుకురాలేదని, ఇప్పుడు మళ్లీ గగ్గోలు పెడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు.
ఇటీవల బిహార్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈవీఎం మైక్రో కంట్రోలర్ తనిఖీ కోసం ఒక్క అప్పీల్ కూడా రాలేదని చెప్పారు. ఓటర్లలో నమ్మకం పెంచేందుకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 5 పోలింగ్ కేంద్రాల వీవీప్యాట్ స్లిప్‌లను వెరిఫై చేశారని, బిహార్‌లో ఎక్కడా ఈవీఎం లెక్కలలో తేడాలు రాలేదని ఆయన చెప్పారు. బిహార్ ఎన్నికల ముందు కాంగ్రెస్ “ఓటు దొంగతనం” ఆరోపణలు చేసిందని.. కానీ, ఫలితాలు వచ్చాక ఒక్క ఫిర్యాదు కూడా చేయలేదని ఆయన ఎద్దేవా చేశారు.

