కలిసి పని చేస్తే గెలుస్తం

కలిసి పని చేస్తే గెలుస్తం
  • ఆ తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వస్తం
  • శక్తి కేంద్రాల ఇన్ చార్జులతో మీటింగ్ 

యాదాద్రి, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ గెలుస్తుందని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం యాదాద్రి జిల్లా  రామన్నపేట మండలం ఎన్నారంలో మునుగోడు ఉప ఎన్నికపై శక్తి కేంద్రాల ఇన్​చార్జులతో మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘సీఎం కేసీఆర్​పై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్​ నిస్సహాయ స్థితిలో ఉంది. ఈ రెండు అంశాలు మనకు కలిసొస్తాయి. రాజగోపాల్​రెడ్డి బలమైన అభ్యర్థి. మునుగోడు ఉప ఎన్నిక మనకు సెమీ ఫైనల్స్. కచ్చితంగా గెలిచి తీరాలె. మీరంతా కలిసి పని చేస్తే ఫైనల్​కు చేరి అక్కడ కూడా గెలుస్తాం” అని తరుణ్ చుగ్ అన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న కూసుకుంట్ల ప్రభాకర్​రెడ్డి పైనా ప్రజల్లో వ్యతిరేకత ఉందని చెప్పారు. కాంగ్రెస్​కు సరైన అభ్యర్థే లేరని, ఆ పార్టీ ప్రజల్లో నమ్మకం కోల్పోయిందని అన్నారు. ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ బూత్ ల వారీగా కమిటీలు వేయాలని సూచించారు. ‘‘దుబ్బాక, హుజూరాబాద్​మాదిరిగానే మునుగోడులోనూ గెలవాలి. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు సాధించాలి” అని పిలుపునిచ్చారు. 

ఈడ గెలిస్తే.. అంతటా గెలుస్తం: సంజయ్ 

‘‘మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్ర ప్రజల భవిష్యత్ ను నిర్దేశిస్తుంది. టీఆర్ఎస్​కు, మనకు మధ్య గ్యాప్​చాలా తక్కువగా ఉంది. దాన్ని అధిగమించాలి. గెలుపే లక్ష్యంగా పని చేయండి” అని బీజేపీ స్టేట్ చీఫ్ సంజయ్ పిలుపునిచ్చారు. ఇక్కడ గెలిస్తే, రాష్ట్రమంతటా గెలిచి అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. త్వరలో తాను కూడా మునుగోడుకు వస్తానని తెలిపారు. బీజేపీ రోజురోజుకు బలోపేతం అవుతోందని.. అందుకే కాంగ్రెస్​, టీఆర్ఎస్​నుంచి పెద్ద ఎత్తున చేరుతున్నారని అన్నారు. పాత, కొత్త అనే తేడా లేకుండా అందరూ కలిసి పార్టీ విజయం కోసం కలిసి పని చేయాలని సూచించారు. తాను నల్గొండ ఎంపీగా పోటీ చేసిన టైమ్ లోనే మునుగోడులో 30 వేల ఓట్లు వచ్చాయని, ఇప్పుడు పార్టీ మరింత బలోపేతమైందని.. కచ్చితంగా గెలుస్తామని సీనియర్ నాయకుడు నల్లు ఇంద్రసేనారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాగా, అంతకుముందు శంషాబాద్ ఎయిర్ పోర్టులో తరుణ్ చుగ్ కు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, నేతలు దుగ్యాల ప్రదీప్ రావు, ప్రేమేందర్ రెడ్డి స్వాగతం పలికారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తమ్ముడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, హుస్నాబాద్ కాంగ్రెస్ ఇన్ చార్జ్ బొమ్మ శ్రీరాం చక్రవర్తి ఎయిర్ పోర్టులో చుగ్ ను కలిశారు. త్వరలో వీరిద్దరూ బీజేపీలో చేరనున్నారు. 

ఇది ప్రీ ఫైనల్: వివేక్  

మునుగోడు ఉప ఎన్నిక తమకు ప్రీ ఫైనల్ అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇక్కడ గెలిస్తే, ఇక అధికారం బీజేపీదేనని ధీమా వ్యక్తం చేశారు. ‘‘వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపును అడ్డుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. మీ ఉత్సాహం చూస్తుంటే భారీ మెజారిటీతో మునుగోడులో గెలవబోతున్నామని అనిపిస్తోంది” అని అన్నారు.