- స్విట్జర్లాండ్‌లో న్యూ ఇయర్ వేడుకల్లో ఘోరం
- 100 మందికి గాయాలు.. కొందరికి సీరియస్
- బాధితుల్లో ఎక్కువ మంది టూరిస్టులే
- దీని వెనుక ఉగ్ర కుట్ర లేదని పోలీసుల వెల్లడి
క్రాన్స్ మోంటానా: న్యూ ఇయర్ వేడుకల వేళ స్విట్జర్లాండ్‌లో ఘోరం జరిగింది. క్రాన్స్ మోంటానా సిటీలోని ఓ బార్‌లో పేలుడు సంభవించింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు అంటుకుని దాదాపు 40 మంది చనిపోయినట్టు తెలుస్తున్నది. మరో 100 మంది గాయపడగా, వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నది. స్విట్జర్లాండ్‌లోని క్రాన్స్ మోంటానా ప్రముఖ స్కీ రిసార్ట్ సిటీ. ఇక్కడికి వింటర్ సీజన్ హాలీడే కోసం డిసెంబర్, జనవరి మధ్య విదేశీ టూరిస్టులు ఎక్కువ మంది వస్తుంటారు. ఈసారి కూడా చాలామంది వచ్చారు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి ‘లీ కాన్స్‌టేలేషన్’ బార్‌లో నిర్వహించిన న్యూఇయర్ పార్టీకి 100 మందికి పైగా హాజరయ్యారు. డీజే పాటలు, డ్యాన్సులతో అందరూ ఎంజాయ్ చేస్తుండగా.. అర్ధరాత్రి 1:30 గంటల ప్రాంతంలో బార్‌లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఆ పేలుడు ధాటికి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఓవైపు ఎగిసిపడుతున్న మంటలు, మరోవైపు కమ్ముకున్న పొగ కారణంగా సిబ్బంది లోపలికి వెళ్లలేకపోయారు. ఈ ప్రమాదంలో దాదాపు 40 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 100 మంది గాయపడ్డారు. వీరిలో కొంతమంది కండిషన్ సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తున్నది.
పేలుడుకు కారణమేంటి?
ఎంతమంది చనిపోయారనేది ఇప్పుడే కచ్చితంగా చెప్పలేమని అధికారులు తెలిపారు. పదుల సంఖ్యలో మృతి చెందారని చెప్పారు. చనిపోయినోళ్లను గుర్తించే ప్రక్రియ కొనసాగుతున్నదని పేర్కొన్నారు. ‘‘మేం ఇప్పుడే మా ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాం. ఎంతమంది చనిపోయారు? వాళ్లు ఎవరు? అనేది ఇప్పుడే చెప్పలేం. ప్రమాదం జరిగిన టైమ్‌లో బార్‌లో వంద మందికి పైగా ఉన్నారు. బార్‌లో పేలుడు సంభవించి మంటలు అంటుకున్నట్టు ప్రాథమికంగా నిర్ధారించాం. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు దీని వెనుక ఎలాంటి ఉగ్ర కుట్ర లేదు. అయితే పేలుడుకు కారణం ఏంటన్నది ఇంకా తెలియలేదు. చనిపోయిన వాళ్లలో ఎక్కువ మంది టూరిస్టులు ఉన్నట్టుగా భావిస్తున్నాం” అని పోలీస్ డిపార్ట్‌మెంట్ అధికార ప్రతినిధి వెల్లడించారు. గాయపడినోళ్లకు ఆస్పత్రుల్లో ట్రీట్‌మెంట్ అందిస్తున్నామని తెలిపారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు. క్రాన్స్ మోంటానా సిటీని నో ఫ్లై జోన్‌గా ప్రకటించామని పేర్కొన్నారు.
బాధితుల హాహాకారాలు..
అప్పటివరకు న్యూ ఇయర్ సంబురాలతో సందడిగా ఉన్న క్రాన్స్ మోంటానా సిటీ.. ఒక్కసారిగా బాధితుల హాహాకారాలతో దద్దరిల్లింది. వెంటనే చాలామంది లోకల్స్ అక్కడికి చేరుకున్నారు. బార్‌లో తమవాళ్ల కోసం వెతికారు. బార్‌లో మంటలు ఎగసిపడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ‘‘కొంతమంది కిటికీలు పగులగొట్టుకుని బయటకు వచ్చారు. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు 20 మంది దట్టంగా కమ్ముకున్న పొగల నుంచి బయటకు రావడం చూశాను” అని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. కాగా, ఈ ఘటనపై స్విట్జర్లాండ్ ప్రెసిడెంట్ గై పార్మెలిన్ విచారం వ్యక్తం చేశారు.
