అస్థిత్వాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తే ఊరుకునేది లేదు

అస్థిత్వాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తే ఊరుకునేది లేదు

నటుడు ప్రభాకర్ రెడ్డి కూతురు శైలజారెడ్డి

ఖైరతాబాద్, వెలుగు: సినీ కార్మికులకు ఇండ్లు ఉండాలనే లక్ష్యంతో ఏర్పాటైన చిత్రపురి కాలనీ అస్థిత్వాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని ప్రముఖ నటుడు ప్రభాకర్ రెడ్డి కూతురు శైలజారెడ్డి హెచ్చరించారు. తన తండ్రి ఆలోచనతో రూపుదిద్దుకున్న కాలనీలో కొంతమంది సినీ ప్రముఖులు హాస్పిటల్​నిర్మిస్తామని ప్రకటించడం విస్మయానికి గురిచేసిందన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్నో ఏండ్లు శ్రమించి తన తండ్రి చిత్రపురి కాలనీకి బాటలు వేస్తే కొందరు అభివృద్ధి ముసుగులో చేస్తున్న కార్యక్రమాలు మనోవేదనకు గురిచేస్తున్నాయన్నారు. కాలనీలో హాస్పిటల్​నిర్మిస్తామని చెప్పడం వెనకున్న ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు.

చిత్రపురి కాలనీలో హాస్పిటల్​కట్టాలనే ఆలోచన తమదని, అందుకోసం కాలనీ కార్యవర్గానికి ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చామని చెప్పారు. కమిటీ నుంచి ఇప్పటి ఎలాంటి స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఆలోచనను ఇతరులు తమదిగా చెప్పుకుంటూ విలువైన స్థలంలో హాస్పిటల్​కట్టి ఏం సాధిద్దాం అనుకుంటున్నారో చెప్పాలన్నారు. కార్యవర్గం తమతో ఎలాంటి చర్చలు జరపకుండా సదరు స్థలాన్ని ఇతరులకు ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. ప్రభాకర్ రెడ్డి కలలుగన్న కాలనీలో ఆయన ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారని వాపోయారు. అభివృద్ధిని తాము అడ్డుకోబోమని, కానీ కాలనీ అస్థిత్వాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. సమావేశంలో ప్రభాకర్​రెడ్డి కూతుళ్లు విశాలాక్షి రెడ్డి, లక్ష్మీరెడ్డి, గంగారెడ్డి పాల్గొన్నారు.