స్పీడ్​గా వెళ్లినా.. తాగి నడిపినా..లైసెన్స్ రద్దు చేసుడే!

స్పీడ్​గా వెళ్లినా.. తాగి నడిపినా..లైసెన్స్ రద్దు చేసుడే!
  • సిటీలో భారీగా లైసెన్సులను రద్దు చేసిన ఆర్టీఏ  బాధ్యులపై అధికారులు 
  • కఠిన చర్యలు  పది నెలల్లో 9,505 లైసెన్స్ లు రద్దు 
  • ట్రాఫిక్ ​పోలీసులు, ఆర్టీఏ సమన్వయంతో యాక్షన్  

హైదరాబాద్,వెలుగు: సిటీలో నిర్లక్ష్యంగా, డ్రంకెన్​ డ్రైవ్​తో జరిగే ప్రమాదాల్లో ఎక్కువ సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో చట్ట ఉల్లంఘనులపై ఆర్టీఏ కఠిన చర్యలు తీసుకుంటున్నది. ఏడాది కాలంలోనే వందల్లో డ్రైవింగ్​లైసెన్స్​లను రద్దు చేసింది. ట్రాఫిక్​ పోలీసులు, ఆర్టీఏ అధికారులు కో ఆర్డినేషన్ తో  సమాచారం  మార్పిడి ద్వారా నిర్లక్ష్యంగా డ్రైవింగ్​చేసే వారిపై చర్యలు చేపడుతున్నది. మరిన్ని కేసులు పెరగకుండా  ఉండేందుకే ఇలా కఠినంగా వ్యవహరిస్తున్నట్టు ఆర్టీఏ అధికారులు తెలిపారు.

ఆర్టీఏ 9 జోన్ల పరిధిలో కొత్తగా డ్రైవింగ్​నేర్చుకున్న వారికి లైసెన్సులను జారీ చేస్తున్నారు. అందులో నిర్లక్ష్యంగా డ్రైవింగ్​చేసే వారిపై చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. సాధారణంగా ట్రాఫిక్​ పోలీసులు నిర్లక్ష్యంగా డ్రైవింగ్​చేసే వారిపై చలాన్లు,  డ్రంకెన్​ డ్రైవ్​తనిఖీల్లో  కేసులు పెట్టినప్పుడు కోర్టు కూడా కొన్నిసార్లు డ్రైవింగ్​ లైసెన్సుల రద్దుకు ఆదేశాలు ఇస్తాయి. అలాంటి వారిపై కూడా ఆర్టీఏకు ట్రాఫిక్​ పోలీసులు సమాచారం ఇస్తుంటారు. ఆర్టీఏ కూడా తనిఖీ చేసే సమయంలో రాష్​ డ్రైవింగ్​, డ్రంకెన్​ డ్రైవ్​ చేసిన వారిని గుర్తించి కేసు తీవ్రతను బట్టి  లైసెన్సుల రద్దుకు చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతం సిటీ పరిధిలో ట్రాఫిక్​ పోలీసులు, ఆర్టీఏ అధికారులు స్పెషల్​డ్రైవ్​నిర్వహిస్తున్నారు. 

భారీగా రద్దు

  కోర్​సిటీ, రంగారెడ్డి, మేడ్చల్​జిల్లాల పరిధిలో భారీ సంఖ్యలో కేసులు పెరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. దీనికి కారణం కఠిన చర్యలు తీసుకోకపోవడమేనని తేలింది. ట్రాఫిక్​పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా నిర్లక్ష్యపు డ్రైవింగ్​కేసులు పెరుగుతుండగా.. గతేడాది నుంచి ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీఏ అధికారులు దృష్టిపెట్టినట్టు తెలిపారు. రెండు శాఖల మధ్య డేటా షేరింగ్​తో ట్రాఫిక్​పోలీసులు తీసుకున్న చర్యలపై  ఆర్టీఏ అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నారు. కొన్ని తీవ్రమైన కేసుల్లోనే కఠిన చర్యలు తీసుకోవాలని ఇరు శాఖలు నిర్ణయించాయి.

అందులో భాగంగానే గతేడాది ఏప్రిల్​నుంచి ఈ ఏడాది జనవరి వరకు మొత్తం 9,505 డ్రైవింగ్​లైసెన్సులను రద్దు చేసినట్టు ఆర్టీఏ ఉన్నతాధికారి తెలిపారు.  హైదరాబాద్​కోర్​సిటీలో 3,207 , రంగారెడ్డి జిల్లాలో 2,865 , మేడ్చల్​జిల్లాలో 3,433 డ్రైవింగ్​ లైసెన్స్​ను రద్దుచేసినట్టు చెప్పారు. ట్రాఫిక్ పోలీసులు వేసిన చలాన్లు, మరికొన్ని తీవ్రమైన కేసుల్లో కోర్టులు కూడా డ్రైవింగ్​లైసెన్స్​రద్దుకు సిఫారసు చేస్తాయి. అలాంటి వారి జాబితా ఆర్టీఏ వద్దకు వస్తుంది. వాటిని కూడా పరిశీలించి డ్రైవింగ్​లైసెన్స్​ రద్దు చేసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. 

స్పీడ్ గా వెళ్లే కేసుల్లో ..

స్పీడ్ గా వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమతే, డ్రంకెన్​డ్రైవ్​ప్రమాదాలు చేసినవారి డ్రైవింగ్​ లైసెన్స్​లు రద్దు చేసే చాన్స్ ఉంటుందని అధికారులు తెలిపారు. నిర్లక్ష్యంగా డ్రైవ్, డ్రంకెన్​డ్రైవ్​చేస్తే.. మొదటిసారి రూ. 5 వేల ఫైన్ , 3 నెలలు జైలు శిక్ష, రెండోసారి రూ. 10వేల ఫైన్ , ఏడాది జైలు శిక్షపడే అవకాశం ఉంటుంది. శిక్షపడిన వారు మళ్లీ అదే తప్పు చేస్తే ట్రాఫిక్​పోలీసుల నుంచి సిఫారసులు రాగానే ఆర్టీఏ అధికారులు ఆన్​లైన్​లో ముందుగా నోటీసు పంపి తదనంతరం లైసెన్​రద్దు చేస్తారు. గత పది నెలల్లో  సిటీలో స్పీడ్ గా వెళ్లే కేసుల్లో 13 లైసెన్సులను రద్దు చేశారు. అధిక లోడ్​తో వెహికల్స్ నడిపినందుకు 84, రవాణా వాహనాల్లో మనుషుల ప్రయాణానికి 10, డ్రంకెన్​ డ్రైవ్​లో 5,757, ప్రమాదాలకు కారణమైనందుకు 304, కోర్టు కేసుల్లో 198, ఇతర కేసుల్లో 3,138 కేసుల్లో లైసెన్సులను రద్దు చేసినట్టు ఆర్టీఏ అధికారులు తెలిపారు.