ఇందులో పెట్టుబడిపెడితే పదేండ్లలో డబులైతది

ఇందులో పెట్టుబడిపెడితే పదేండ్లలో డబులైతది

ఎన్​ఎస్​సీ, కేవీపీ, పోస్ట్​ ఆఫీసు.. వడ్డీ ఎక్కడ ఎక్కువ?

బిజినెస్​ డెస్క్​, వెలుగు: పోస్టు ఆఫీసు టైం డిపాజిట్​ అకౌంట్​ (పీఓటీడీ), నేషనల్​ సేవింగ్స్​ సర్టిఫికేట్​ (ఎన్​ఎస్​సీ), కిసాన్​ వికాస్​ పత్ర (కేవీపీ).. రిస్క్​ లేని ఫిక్స్​డ్​​ ఇన్​కమ్​ ఇన్​స్ట్రమెంట్లు. ఇవి అష్యూర్డ్​ రిటర్నులు ఇస్తాయి కాబట్టి ఎక్కువ మంది  ఎంచుకుంటారు. పెద్ద బ్యాంకులు వడ్డీ రేట్లను మార్చడం మొదలుపెట్టాయి. ఇతర బ్యాంకులు కూడా త్వరలో ఇదే బాట పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాస్త ఎక్కువ వడ్డీ కావాలనుకునే వాళ్లు బ్యాంకుల్లో ఎఫ్​డీలకు బదులు పీఓటీడీ, ఎన్​సీ, కేవీపీల్లో ఇన్వెస్ట్​ చేయవచ్చు. వీటిలో వడ్డీలు, పన్ను రాయితీలు ఎలా ఉంటాయో చూద్దాం..

నేషనల్​ సేవింగ్స్​ స్కీమ్​
ఎన్ఎస్​సీలో పెట్టుబడులకు ఐదేళ్ల లాక్​ ఇన్​ పీరియడ్​ ఉంటుంది. అంటే ఈ కాలంలో డబ్బులను వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదు. సింగిల్, జాయింట్​ లేదా మైనర్​ తరఫున డబ్బు పొదుపు చేయవచ్చు. ఐటీ చట్టం 1961 లోని సెక్షన్​ 8‌‌‌‌‌‌‌‌0సి ప్రకారం ట్యాక్స్​ ప్రయోజనాలు పొందవచ్చు. ఇందులో ఇన్వెస్ట్​మెంట్​కు అప్పర్​ లిమిటెడ్​ లేదు. కనీసం రూ. వంద నుంచి ఇన్వెస్ట్​మెంట్​ మొదలుపెట్టవచ్చు. ఒక వ్యక్తి ఎన్ని ఎన్​ఎస్​సీ అకౌంట్లను అయినా ఓపెన్​ చేయవచ్చు. ఎన్ఎస్​సీ సర్టిఫికెట్లను ఒకరి నుంచి మరొకరికి బదిలీ చేయవచ్చు. ఏడాదికి 6.8 శాతం చొప్పున కాంపౌండ్​ విధానంలో వడ్డీ చెల్లిస్తారు. ఉదాహరణకు రూ.వెయ్యి పొదుపు చేస్తే అది ఐదేళ్లకు రూ.1,389.49 అవుతుంది. వడ్డీని పాలసీహోల్డర్​కు ఇవ్వకుండా దానిని తిరిగి మదుపు చేస్తారు. ఇందులోని ఇన్వెస్ట్​మెంట్​పై సెక్షన్​ 8‌‌‌‌‌‌‌‌0సి ప్రకారం పన్ను రాయితీలు పొందవచ్చు. ఒక ఫైనాన్షియల్​ఇయర్​లో రూ.1.5 లక్షల ఇన్వెస్ట్​మెంట్​కు పన్ను రాయితీని తీసుకోవచ్చు. 

కిసాన్​ వికాస్​ పత్ర
పోస్టు ఆఫీసు చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఇది ఎంతో సురక్షితమైనది. కేవీపీలో పెట్టుబడి పెట్టిన మొత్తం పదేళ్లకు రెట్టింపు అవుతుంది. ఇందులో కనీసం రూ.వెయ్యి ఇన్వెస్ట్​ చేయాలి. అప్పర్ లిమిట్​ లేదు. ఏడాదికి 6.9 శాతం చొప్పున వడ్డీ చెల్లిస్తారు. ఇన్వెస్ట్​ చేసిన మొత్తం 1‌‌‌‌‌‌‌‌0 ఏండ్ల  4 నెలలకు రెట్టింపు అవుతుంది. కేవీపీ వడ్డీపై  పన్ను మినహాయింపు ఉండదు. మెచ్యూరిటీ అయ్యే వరకు వడ్డీ చేతికి ఇవ్వరు.  అసలుపై కూడా పన్ను రాయితీ ఉండదని గుర్తుంచుకోవాలి. 

పోస్టు ఆఫీసు టైమ్​ డిపాజిట్​
ఇది బ్యాంకు ఫిక్స్​డ్​ డిపాజిట్​(ఎఫ్​డీ) వంటి స్కీమే! ఈ టర్మ్​ డిపాజిట్​ను 1,2,3,5 ఏళ్లలో ఏదైనా ఒక టెన్యూర్​లో ఇన్వెస్ట్​ చేయవచ్చు. పదేళ్లకు పైబడిన మైనర్ పేరిట  పీఓటీడీ తీసుకోవచ్చు. ఐదేళ్లకు ఏటా 6.7 శాతం చొప్పున వడ్డీ ఇస్తారు. ఏటా వడ్డీ ఇస్తారు కానీ దీనిని క్వార్టర్లీ లెక్కిస్తారు. కనీసం రూ.వెయ్యి ఇన్వెస్ట్​ చేయాలి. అప్పర్ లిమిట్​ లేదు. సెక్షన్​ 8‌‌‌‌‌‌‌‌0సి ప్రకారం పీఓటీడీ మొత్తంపై ఇన్​కమ్​ ట్యాక్స్​ డిడక్షన్​ తీసుకోవచ్చు. ఒక ఫైనాన్షియల్​ ఇయర్​లో రూ.4‌‌‌‌‌‌‌‌ వేల కంటే ఎక్కువ వడ్డీ వస్తే పోస్టు ఆఫీసే దానిపై పన్ను వసూలు చేస్తుంది. ఈ మూడు పథకాల్లో తేడా ఏంటంటే.. పీఓటీడీలో ఏడాదికి ఒకసారి వడ్డీ ఇస్తారు. మిగతా రెండింట్లో ఇన్వెస్ట్​మెంట్​ మెచ్యూర్​ అయ్యాకే డబ్బు చేతికి వస్తుంది. మూడు స్కీముల ద్వారా వచ్చే వడ్డీకి పన్ను ఉంటుంది.