ఆర్టికల్ 370 తొలగిస్తే కశ్మీర్ తో సంబంధాలు తెంచుకున్నట్టే : ముఫ్తీ

ఆర్టికల్ 370 తొలగిస్తే కశ్మీర్ తో సంబంధాలు తెంచుకున్నట్టే : ముఫ్తీ

జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమక్రటిక్ పార్టీ ప్రెసిడెంట్ మెహబూబా ముఫ్తీ మరోసారి హాట్ కామెంట్ చేశారు. జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి అందిస్తున్న ఆర్టికల్ 370 పై ఆమె తాజాగా స్పందించారు. ఇండియాకు , కశ్మీర్ కు ఆర్టికల్ 370 అనేది వారధి లాంటిదన్నారు.

కశ్మీర్ కు ఉన్న ప్రత్యేక హక్కు ఆర్టికల్ 370ని తొలగించడానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు మెహబూబా ముఫ్తీ. ఆ ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు. ఒకవేళ ఆర్టికల్ 370 తొలగించినట్టయితే… భారత కేంద్ర ప్రభుత్వానికి కశ్మీర్ రాష్ట్రంతో సంబంధాలు తెగిపోతాయని వార్నింగ్ ఇచ్చారు మెహబూబా. గతంలో ఊహించని కొత్త పరిణామాలు ఎదురవుతాయని ఆమె అన్నారు.

ఆర్టికల్ 370ను తొలగించినట్టయితే.. కశ్మీర్ తో సంబంధాల కోసం కేంద్రం మళ్లీ సంప్రదింపులు మొదలుపెట్టాల్సి వస్తుందన్నారు పీడీపీ చీఫ్. అప్పుడు కొత్త పరిస్థితులు.. కొత్త నిబంధనలు తేవాల్సి వస్తుందన్నారు. ముస్లిం మెజారిటీ రాష్ట్రమైనప్పటికీ కశ్మీర్ ఇండియాతో కలిసి ఉండాలనుకుంటోందనీ.. కొత్త పరిణామాలను కేంద్రం ఆహ్వానించకపోవడం మంచిదని హెచ్చరించారు ముఫ్తీ.

ఆర్టికల్ 370తో పాటు.. కశ్మీరీలకు ప్రత్యేక హక్కులు, అధికారాలు, సౌకర్యాలు కల్పిస్తున్న ఆర్టికల్ 35Aను కూడా రద్దు చేయాలని డిమాండ్లు ఊపందుకోవడంతో… మెహబూబా ముఫ్తీ కేంద్రానికి వార్నింగ్ ఇచ్చారు.