రూ.కోటి కావాలంటే..సిప్​లో ఇలా ఇన్వెస్ట్​ చేయాలి..

రూ.కోటి కావాలంటే..సిప్​లో ఇలా ఇన్వెస్ట్​ చేయాలి..

బిజినెస్​డెస్క్​, వెలుగు: మ్యూచువల్​ ఫండ్ల సిస్టమాటిక్ ఇన్వెస్టింగ్ ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు (సిప్​లు) చాలా మందికి ఇష్టమైన పెట్టుబడి. ప్రతి ఇన్వెస్ట్​మెంట్​ సైకిల్​లో నిర్దిష్ట మొత్తాన్ని పెట్టుబడి పెట్టడానికి ఇది అత్యంత అనుకూలమైన మార్గాలలో ఒకటి. అందుకే ప్రతి నెలా సిప్​ హోల్డర్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. సిప్​ల ద్వారా పెట్టుబడుల వల్ల ఆర్థిక క్రమశిక్షణ ఏర్పడుతుంది. ఎందుకంటే వారు ప్రతి నెల లేదా క్వార్టర్​లో కొంత మొత్తాన్ని ఆదా చేయాలి. నిర్దిష్ట సమయం తరువాత ఎంత మొత్తం కావాలో నిర్ణయించుకున్నాకే సిప్​ని ప్రారంభించాలి.

సిప్​ ఎలా పని చేస్తుంది?

పెట్టుబడిదారుడి బ్యాంక్ ఖాతా నుంచి క్రమం తప్పకుండా డబ్బు విత్​డ్రా అవుతుంది.  సిప్​ ద్వారా మీకు నచ్చిన మ్యూచువల్ ఫండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెట్టుబడి పెట్టవచ్చు.  పెట్టుబడి విలువను  నికర ఆస్తి విలువ (ఎన్​ఏవీ) ద్వారా నిర్ణయిస్తారు. ఎన్​ఏవీ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు, ఎక్కువ యూనిట్లు జారీ అవుతాయి.  ఎన్​ఏవీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు, తక్కువ యూనిట్లు వస్తాయి.   ఇప్పుడు, మీరు కోటీశ్వరులు కావాలని అనుకుంటున్నారని ఊహించండి. అయితే ఎంత పెట్టుబడి పెట్టాలో లేదా ఎంతకాలం పెట్టుబడి పెట్టాలో తెలియదు. ఆ వివరాలు ఇక్కడ 
తెలుసుకుందాం.

1. పదేళ్లలో కోటీశ్వరుడు కావాలంటే...

నిఫ్టీ–50 గత 10 సంవత్సరాలలో 14 శాతం చొప్పున పెరిగింది. మనం కనీసం 12 శాతం చొప్పున లెక్కిద్దాం.  పదేళ్లలో రూ. కోటి సంపాదించడానికి, నెలకు రూ. 44,000 పెట్టుబడి పెట్టాలి. 12 శాతం వార్షిక రాబడితో, నెలకు రూ. 44,000 పెట్టుబడి పెడితే సంవత్సరానికి రూ. 5,28,000 అవుతుంది. పది సంవత్సరాలలో రూ. 52.28 లక్షలు అవుతుంది. ఇది రూ.49,42,919 విలువైన దీర్ఘకాలిక మూలధన లాభాలను అందిస్తుంది. మెచ్యూరిటీ సమయంలో, మీ అంచనా మొత్తం రూ. 1,02,22,919 అవుతుంది.

2. ఐదు సంవత్సరాలలో కోటీశ్వరుడు అవ్వడం

 మీరు ఐదేళ్లపాటు ప్రతి నెలా రూ. 1,22,000 ఇన్వెస్ట్ చేస్తే, మీరు దాదాపు రూ. 1,00,63,337 కార్పస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను జమ చేస్తారు. ఇది మీ మొత్తం పెట్టుబడి రూ. 73,20,000 అవుతుంది.  దీర్ఘకాలిక మూలధన లాభాలు రూ. 27,43,337 వస్తాయి.

3. 20 ఏళ్లలో కోటీశ్వరుడు కావడం

ప్రతి నెలా రూ. 11,000 20 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్​ చేయాలి. 12 శాతం వార్షిక రాబడితో, మీ దీర్ఘకాలిక మూలధన లాభాలు రూ. 83,50,627 అవుతాయి. మీరు చివరికి దాదాపు రూ. 1,09,90,627 పొందుతారు.