
హైదరాబాద్, వెలుగు: ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ (ఇఫ్కో) చైర్మన్, ఎంపీ దిలీప్ సంఘాని బుధవారం తెలంగాణ మార్క్‌ఫెడ్‌ను సందర్శించారు. రాష్ట్రంలో మార్క్‌ఫెడ్ చేస్తున్న కార్యక్రమాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి మాట్లాడుతూ.. మార్కెట్‌లో పంటలకు మద్దతు ధర కంటే తక్కువ రేటు ఉన్నప్పుడు మార్క్‌ఫెడ్ రైతులకు మద్దతు ధర చెల్లించి పంటను సేకరిస్తున్నదని తెలిపారు.
ఎరువుల సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా, ధరలు స్థిరంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నదని వివరించారు. సంఘాని మాట్లాడుతూ.. గుజరాత్ మార్క్‌ఫెడ్ విత్తన సరఫరాతో పాటు వ్యవసాయ రంగానికి అవసరమైన పనిముట్లు అందిస్తున్నదని చెప్పారు. ఫలితంగా గుజరాత్ మార్క్‌ఫెడ్ గణనీయమైన ప్రగతి సాధించిందని తెలిపారు. ఈ సందర్భంగా దిలీప్ సంఘానికి మార్క్ ఫెడ్ ఎండీ సత్యనారాయణరెడ్డి, జనరల్ మేనేజర్ విష్ణువర్ధన్‌రావు పూల బొకే ఇచ్చి శాలువాతో సత్కరించారు.