ఆర్టీఐ చట్టంపై నిర్లక్ష్యం వద్దు

ఆర్టీఐ చట్టంపై నిర్లక్ష్యం వద్దు

ప్రభుత్వ సంస్థల నుంచి ప్రజలు తమకు కావాల్సిన వివరాలను తెలుసుకునేందుకు తీసుకొచ్చిందే సమాచార హక్కు చట్టం. ఈ చట్టం ప్రకారం అన్ని వివరాలనూ 30 రోజుల్లోగా వెల్లడి చేయాలి. కానీ చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు సమాచారాన్ని కోరే వ్యక్తుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వారు కోరిన సమాచారం ఇవ్వడం లేదు. ప్రభుత్వ సంస్థల నుంచి వివిధ పథకాల లబ్ధిదారుల వివరాలు, నిధుల మంజూరు, గ్రామ అభివృద్ధి వివరాలు వంటి సమగ్ర సమాచారాన్ని అధికారులు ఆర్టీఐ కింద అడిగినా ఇవ్వడం లేదు. విద్య, రెవెన్యూ, వ్యవసాయ శాఖల్లో అధికారులు నిర్లక్ష్యంగా ఉండి సమాచారం కోరే వ్యక్తులకు సరైన సమాధానం కూడా ఇవ్వడం లేదు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా చూసీ చూడనట్టు ఉంటూ చట్టాన్ని నీరు కార్చడం సరికాదు. 

సమాచార హక్కు చట్టాన్ని మరింత పటిష్ట పరిచి, ప్రజలకు త్వరితగతిన వివరాలు అందించాలి. కాల పరిమితి లోగా లెటర్ రూపంలో సమాచారాన్ని కోరే వ్యక్తుల ఇంటికి సమాధానం పంపించాలి. కానీ ప్రభుత్వ అధికారులు చట్టం ప్రకారం పనిచేయడం లేదు. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యాన్ని వీడాలి. ప్రజలు కోరుకున్న సమాచారాన్ని పక్కాగా అందించేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలి.

– రావుల రామ్మోహన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, వెల్దండ, జనగాం జిల్లా