
హైదరాబాద్, వెలుగు: ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీ ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల (బాండ్ల) ను ఇష్యూ చేయడం ద్వారా రూ.1,500 కోట్లను సేకరించాలని చూస్తోంది. ఈ పబ్లిక్ ఇష్యూ జూన్ 9 న అందుబాటులోకి వచ్చింది. ఈ నెల 22 న ముగుస్తుంది. బాండ్లపై 9 శాతం వరకు ఈల్డ్ (వడ్డీ) ను ఐఐఎఫ్‌ఎల్ ఆఫర్ చేస్తోంది. ఎన్‌సీడీల ఇష్యూ ద్వారా రూ.300 కోట్లను సేకరించనున్న కంపెనీ, రూ.1,200 కోట్ల విలువైన ఓవర్ సబ్‌స్క్రిప్షన్లను కూడా రిటైన్ చేసుకోనుంది. దీంతో మొత్తం రూ.1,500 కోట్లను సేకరించే ఆలోచనలో ఉంది.
బాండ్లను 24 నెలలు, 36 నెలలు, 60 నెలల కోసం ఇష్యూ చేస్తోంది. 60 నెలల టైమ్కిగాను ఏడాదికి 9 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. ఐఐఎఫ్‌ఎల్ బాండ్లకు క్రిసిల్ నుంచి ఏఏ, ఇక్రా నుంచి ఏఏ రేటింగ్ ఉంది. ఐఐఎఫ్‌ఎల్‌కు దేశం మొత్తం మీద 4,000 బ్రాంచులు ఉన్నాయని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రామీల అన్నారు. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా సేకరించిన ఫండ్స్‌ను అప్పులివ్వడానికి వాడతామని చెప్పారు. ఈ ఇష్యూకి ఎడెల్వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ , ఐఐఎఫ్‌ఎల్ సెక్యూరిటీస్, ఈక్విరస్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ లీడ్ మేనేజర్లుగా పనిచేస్తున్నాయి. ఈ ఎన్‌సీడీలు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్ అవుతాయి. ఈ బాండ్ల ఫేస్ వాల్యూ రూ.1,000 కాగా, కనీసం రూ.10,000 తో సబ్‌స్క్రయిబ్ అవ్వాల్సి ఉంటుంది.