ఆగస్టులో 4 శాతం వృద్ధి నమోదు చేసిన ఐఐపీ

ఆగస్టులో 4 శాతం వృద్ధి నమోదు చేసిన ఐఐపీ

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఆగస్టులో ఇండియా ఇండస్ట్రీల ప్రొడక్షన్‌‌ 4శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ (ఐఐపీ) వృద్ధి ఈ ఏడాది జులైలో వేసిన అంచనా 3.5శాతం నుంచి 4.3 శాతానికి  నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (ఎన్‌‌ఎస్‌‌ఓ) అప్‌‌డేట్ చేసింది.  గత ఏడాది ఆగస్టులో వృద్ధి స్థిరంగా ఉండగా, ఈసారి మైనింగ్, విద్యుత్ రంగాల మెరుగైన పనితీరును కనబరిచాయి. 

ఈ ఏడాది ఆగస్టులో తయారీ రంగంలో ప్రొడక్షన్ 3.8శాతం,  బేసిక్ మెటల్స్  12.2శాతం, మోటార్ వాహనాల తయారీ 9.8శాతం, మైనింగ్ రంగం 6శాతం వృద్ధిని నమోదు చేశాయి. విద్యుత్ ఉత్పత్తి 4.1శాతం పెరిగింది. ఏప్రిల్–ఆగస్టు కాలంలో మొత్తం ఐఐపీ వృద్ధి 2.8శాతంగా ఉంది. 

‘‘తక్కువ బేస్ ఉన్నప్పటికీ తయారీ రంగంలో ప్రొడక్షన్  మందగించడంతో ఐఐపీ వృద్ధి ఊహించని రీతిలో తగ్గింది. జీఎస్‌‌టీ సవరణలు పండుగ కాలంలో వినియోగాన్ని పెంచి సెప్టెంబర్–అక్టోబర్‌‌లో తయారీ వృద్ధికి దోహదపడతాయి” అని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా చీఫ్ ఎకనామిస్ట్ ఆదితి నాయర్ అన్నారు.  క్యాపిటల్ గూడ్స్ 4.4శాతం, ఇన్‌‌ఫ్రా/కన్​స్ట్రక్షన్ 10.6శాతం, ప్రైమరీ గూడ్స్ 5.2శాతం, ఇంటర్మీడియట్ గూడ్స్ 5శాతం వృద్ధి సాధించాయి. అయితే, కన్స్యూమర్ నాన్-డ్యురబుల్స్‌‌ సెక్టార్‌‌‌‌లో ప్రొడక్షన్  6.3శాతం తగ్గిందని ఎన్​ఎస్​ఓ తెలిపింది.