
భద్రాచలం, వెలుగు : భద్రాచలం మన్యంలో గిరిజనాభివృద్ధికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని బాంబే ఐఐటీ అందిస్తుందని ప్రొఫెసర్ కన్నన్ మౌద్గల్యా హామీ ఇచ్చారు. భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆహ్వానం మేరకు ఆయన ఆదివారం భద్రాచలం సీతారామచంద్రస్వామిని దర్శించుకుని అనంతరం ఐటీడీఏను సందర్శించారు. కలెక్టర్ తోపాటు పీవో బి.రాహుల్ ఆయన వెంట ఉన్నారు. గిరిజనులకు అందిస్తున్న వివిధ స్వయం ఉపాధి పథకాలు, సంక్షేమ పథకాలను పరిశీలించారు. కొత్తగూడెం జిల్లాలో వివిధ సమస్యలను ఓపెన్ సోర్స్ జియో స్పెషల్ టెక్నాలజీ ద్వారా పరిష్కరించినందుకు ఇటీవలే కలెక్టర్ జితేశ్ వి పాటిల్‌కు అవార్డులు వచ్చాయని గుర్తు చేశారు.
ఈ సందర్భంగా ప్రజల ఆదాయ మార్గాలకు సంబంధించిన అంశాలను పరిశీలించడానికి వచ్చినట్లు తెలిపారు. అంతరించిపోతున్న గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార, వ్యవహారాలు నేటి తరానికి తెలియజేసేలా ట్రైబల్ మ్యూజియం ఉందని పీవో రాహుల్‌ను ఆయన ప్రశంసించారు. మ్యూజియంలో ప్రతీ కళాఖండం గురించి తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో బోర్డులు రాయించాలన్నారు. వైటీసీ ద్వారా గిరిజన యువత ఉపాధికి చేపట్టిన పథకాలను కలెక్టర్ వివరించారు. మట్టి, సిమెంట్ఇటుకలను కూడా చూపించారు. మన్యంలో దొరికే ఔషధ మొక్కల గురించి వివరించారు. మున్ముందు చేపట్టబోయే పథకాలకు అవసరమైన టెక్నాలజీని అందిస్తామని తెలిపారు.