- జర్మనీకి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్లంగ్ హెల్త్ సంస్థతో కలిసి పరిశోధనలు
- బయో ఇంజినీరింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభించిన డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి
సంగారెడ్డి, వెలుగు: వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు ఐఐటీ హైదరాబాద్ అడుగులు వేస్తోంది. సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీహెచ్ వేదికగా జర్మనీకి చెందిన ప్రముఖ ఇన్‌స్టిట్యూట్ ఫర్ లంగ్ హెల్త్ (ఐఎల్‌హెచ్)తో కలిసి కృత్రిమ ఊపిరితిత్తుల తయారీపై రీసెర్చ్ చేస్తోంది. ఈ క్రమంలో బుధవారం ఐఐటీహెచ్ క్యాంపస్‌లో “బయో ఇంజినీరింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్” పేరుతో టెక్నికల్ రీసెర్చ్ సెంటర్ ను ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్, పద్మవిభూషణ్ డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కృత్రిమ ఊపిరితిత్తులకు పరిశోధనలు సక్సెస్ చేయడానికి, లంగ్స్‌కు వచ్చే వ్యాధుల నివారణ, చికిత్సలో మెరుగైన విధానాలను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు చేయనున్నట్టు తెలిపారు.
దేశీయంగా ఉన్న పరిస్థితులను అధ్యయనం చేస్తూ ప్రపంచ స్థాయిలోనూ పరిష్కారాలు చూడడమే ఈ పరిశోధనల లక్ష్యమన్నారు. ఇంజనీరింగ్, క్లినికల్ సైన్స్ సమ్మేళనంతో నాన్ ఇన్వెసివ్ డయాగ్రోస్టిక్, ఆధునిక చికిత్స విధానాల అభివృద్ధి, భవిష్యత్తు లంగ్ హెల్త్ పరిశోధక నాయకుల శిక్షణకు ఇండో- జర్మన్ భాగస్వామ్యం ఎంతో దోహదపడుతుందన్నారు.
కృత్రిమ ఊపిరితిత్తులతో ఫలితాలు..
- లంగ్స్ పూర్తిగా పాడైపోతే ప్రస్తుతం ‘ట్రాన్స్‌ప్లాంటేషన్’ మాత్రమే అందుబాటులో ఉంది. ఈ పద్ధతిలో సక్సెస్ రేట్ చాలా తక్కువ. దీనికి పరిష్కారం అత్యాధునిక సాంకేతికతతో తయారు చేసే కృత్రిమ ఊపిరితిత్తులే. వీటితో తక్కువ ఖర్చుతో మెరుగైన చికిత్స అందించాలని శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు.
- ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న శ్వాసకోశ సమస్యలకు మెరుగైన చికిత్సా విధానాలను అభివృద్ధి చేయనున్నారు. ఈ పరిశోధన సక్సెస్ అయితే భవిష్యత్తులో అవయవ దాతల కోసం ఎదురు చూడకుండా కృత్రిమ అవయవాలతో ప్రాణాలను కాపాడుకునే అవకాశం ఉంటుంది. -------
