
హైదరాబాద్, వెలుగు : కుటుంబమంతా కలిసి స్వీడన్ చూడాలనుందా….ఐతే, మా స్టోర్‌లో షాపింగ్ చేయండంటోంది ఐకియా. హైదరాబాద్‌లో స్టోర్ పెట్టి ఏడాది పూర్తైన సందర్భంగా కస్టమర్ల కోసం ఈ ఆఫర్‌ను ప్రకటించింది. ఐకియా ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఈ ప్రత్యేక ఆఫర్ తెచ్చామని, హైదరాబాద్, సికిందరాబాద్, తెలంగాణలోని కస్టమర్లకు మాత్రమే ఇది వర్తిస్తుందని ఐకియా స్పష్టం చేసింది. ఆగస్టు 18 లోపు షాపింగ్ చేసిన ఐకియా ఫ్యామిలీ మెంబర్లు ఆఫర్‌కు అర్హులని, షాపులో తమ ఫొటో తీసుకుని ఐకియా ఫ్యామిలీ పేజ్‌లో దానిని షేర్ చేస్తే చాలని తెలిపింది. అలా మెంబర్స్ పెట్టిన స్టోరీస్‌లోంచి 20 స్టోరీస్‌ను ఎంపిక చేసి, ఓటింగ్ కోసం ఐకియా ఇండియా వెబ్‌సైట్‌లో ఉంచనున్నట్లు పేర్కొంది.
ఎక్కువ ఓట్లు వచ్చిన స్టోరీ విన్నర్‌గా నిలుస్తుందని, ఆ స్టోరీ పంపించిన వ్యక్తితోపాటు, ముగ్గురు కుటుంబ సభ్యులకూ స్వీడన్లో ఆరు పగళ్లు, 5 రాత్రులు గడిపే అవకాశం దక్కుతుందని వివరించింది. స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో సైట్ సీయింగ్‌తోపాటు, ఐకియా పుట్టిన పట్టణం ఎల్మ్హట్ చూడొచ్చని పేర్కొంది. ఆన్‌లైన్ ఓటింగ్ సెప్టెంబర్ 9న మొదలై 20 న ముగియనున్నట్లు ఐకియా తెలిపింది. ఐకియా ఫ్యామిలీ మెంబర్లు తమ స్టోరీలను ఆగస్టు 31 లోగా సబ్మిట్ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. గెలుపొందిన వ్యక్తి ఏడాదిలోపు ఎప్పుడైనా స్వీడన్ పర్యటనకు వెళ్లొచ్చని తెలిపింది.