వైభవ్ సూర్యవంశీని ఆపడం ఎలా?.. ఆర్చర్ ఫన్నీ రిప్లై నెట్టింట వైరల్‌!

వైభవ్ సూర్యవంశీని ఆపడం ఎలా?.. ఆర్చర్ ఫన్నీ రిప్లై నెట్టింట వైరల్‌!

SRH vs RR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026)లో అన్ని జట్లను వేధిస్తున్న ఒకే ఒక్క ప్రశ్న.. 'వైభవ్ సూర్యవంశీని ఆపడం ఎలా?'.. రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ అనగానే, ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, టీనేజ్ సెన్సేషన్‌కు ఎలా బౌలింగ్ చేయాలనే దానిపైనే ప్రత్యర్థి జట్లు తమ సమయాన్నంతా కేటాయిస్తున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో కేవలం 29 బంతుల్లో 97 రన్స్ చేసి రాజస్థాన్‌ను క్వాలిఫయర్-2కి చేర్చాడు వైభవ్. దీంతో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న రాజస్థాన్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌ను "వైభవ్ సూర్యవంశీని ఎలా ఔట్ చేయాలి?" అని అడగ్గా అతడిచ్చిన ఫన్నీ రిప్లై నెట్టింట వైరల్‌గా మారింది.

ఐపీఎల్ అయ్యాక చెబుతా: 
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై రాజస్థాన్ రాయల్స్ 47 రన్స్ తేడాతో విజయం సాధించిన తర్వాత అందరి మదిలో మెదిలిన ప్రశ్న ఒక్కటే.. "అసలు వైభవ్ సూర్యవంశీకి ఎక్కడ బౌలింగ్ చేయాలి?". ఇదే ప్రశ్నను జోఫ్రా ఆర్చర్‌ను అడగ్గా.. ఇంగ్లండ్ స్పీడ్‌స్టర్ చిరునవ్వు చిందిస్తూ, ఆ విషయం ఐపీఎల్ పూర్తయ్యాక చెబుతాను అంటూ ఫన్నీగా ఆన్సర్ ఇచ్చాడు. ఈ 15 ఏళ్ల బ్యాటింగ్ సంచలనం సృష్టిస్తున్న విధ్వంసాన్ని, అతడి సహచర ఆటగాడు ఆర్చర్ సమాధానం కచ్చితంగా ప్రతిబింబిస్తుంది. సన్‌రైజర్స్‌పై ఎలిమినేటర్ మ్యాచ్‌లో వైభవ్ ఏకంగా 12 సిక్సర్లు కొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌తో రాజస్థాన్ గెలిచి, తమ టైటిల్ ఆశలను సజీవంగా నిలుపుకుంది.  

బద్దలవుతున్న రికార్డులు: 
ఐపీఎల్‌లో అరంగేట్రం చేసినప్పటి నుంచి వైభవ్ అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్‌గా మారిపోయాడు. ఐపీఎల్ 2026లో అతడికి 'సెకండ్-సీజన్ సిండ్రోమ్' ఏమాత్రం కనిపించడం లేదు.. పాత రికార్డులను బద్దలు కొడుతూ సరికొత్త చరిత్ర లిఖిస్తున్నాడు.

* గేల్ రికార్డ్ బ్రేక్: ఒకే సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రిస్ గేల్ ఆల్ టైమ్ రికార్డును వైభవ్ బ్రేక్ చేసేశాడు. 15 మ్యాచ్‌ల్లోనే ఏకంగా 65 సిక్సర్లు బాదాడు. రాజస్థాన్‌ మరో మ్యాచ్ (గెలిస్తే రెండు) మిగిలి ఉండటంతో ఈ సిక్సర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

* అద్భుతమైన స్ట్రైక్ రేట్: ఈ సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ ఏకంగా 242.85 స్ట్రైక్ రేట్‌తో 680 పరుగులు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో 200+కి పైగా స్ట్రైక్ రేట్‌తో 600కి పైగా పరుగులు సాధించిన ఏకైక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

* బౌండరీల మోత: వైభవ్ సాధించిన 680+ పరుగుల్లో 610 పరుగులు కేవలం బౌండరీల ద్వారానే రావడం విశేషం.. ఇందులో 65 సిక్సర్లు, 55 ఫోర్లు ఉండటం గమనార్హం. ఒకవేళ తన తదుపరి మ్యాచ్‌లో తను కేవలం రన్-ఏ-బాల్ ఆడి 20 పరుగులు చేసినా సరే, అతడు 233 స్ట్రైక్ రేట్‌తో 700 పరుగుల మైలురాయిని చేరుకుంటాడు.