కాచిగూడ లో మూగ జీవాల రక్తంతో అక్రమ దందా

కాచిగూడ లో మూగ జీవాల రక్తంతో అక్రమ దందా
  • కాచిగూడ సీఎన్‌‌కే కంపెనీ గుట్టు రట్టు చేసిన డ్రగ్స్ అధికారులు
  •     110 నిండు బ్లడ్ బ్యాగులు, 60 ఖాళీ బ్యాగులు సీజ్
  •     కీసర నుంచి కాచిగూడకు రక్తం తరలింపు.. దేశవ్యాప్తంగా ఎక్స్‌‌పోర్టు!

హైదరాబాద్, వెలుగు:  హైదరాబాద్ కాచిగూడలోనూ మూగ జీవాల రక్తాన్ని సేకరించి అక్రమ వ్యాపారం చేస్తున్న మాఫియా గుట్టు రట్టయింది. సెంట్రల్ అండ్ స్టేట్ డ్రగ్ కంట్రోల్ అధికారులు మంగళవారం అర్ధరాత్రి సీఎన్‌‌కే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌‌పోర్ట్స్ కంపెనీపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. పోలీసుల సహకారంతో చేపట్టిన ఈ సోదాల్లో.. ఎలాంటి అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన 110 జంతువుల బ్లడ్ బ్యాగులు, 60 ఖాళీ బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. కంపెనీలోని ఫ్రిజ్ లో ఈ బ్లడ్ బ్యాగులు దొరికాయి. 

వీటితోపాటు రక్త శుద్ధి, నిల్వకు ఉపయోగించే సెమీ ఆటోమేటిక్ ఆటోక్లేవ్ మిషన్, బ్యాక్టీరియాలజీ ఇంక్యుబేటర్ వంటి మెడికల్ ఎక్విప్‌‌మెంట్‌‌ను కూడా అధికారులు సీజ్ చేశారు. ఈ రక్తానికి సంబంధించిన కొనుగోలు, అమ్మకం బిల్లులు, డ్రగ్ లైసెన్స్ ఏమీ లేకపోవడంతో డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం కింద అధికారులు కేసు నమోదు చేశారు.

కీసర నిందితులిచ్చిన సమాచారంతో..

ఇటీవల మేడ్చల్ జిల్లా కీసరలోని నాగారంలో బతికున్న గొర్రెలు, మేకల నుంచి రక్తం తీసి అక్రమ వ్యాపారం చేస్తున్న ఘటన బయటపడిన విషయం తెలిసిందే. ఆ కేసులో నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగానే  కాచిగూడలో దాడులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.  దొరికిన బ్లడ్ బ్యాగుల్లో ఉన్నది హ్యుమన్ రక్తమా లేక జంతు రక్తమా అనేది ల్యాబ్ టెస్టుల అనంతరమే నిర్ధారణ అవుతుందని వెల్లడించారు. 

అయితే, ఈ దందా వెనుక పెద్ద నెట్‌‌వర్క్ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కీసరలో సేకరించిన రక్తాన్ని కాచిగూడకు తరలించి, ఇక్కడి నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు ఎక్స్‌‌పోర్టు చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ రక్తాన్ని క్లినికల్ ట్రయల్స్‌‌కు లేదా ఇతర ప్రయోగాలకు వినియోగిస్తున్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. 

సీఎన్‌‌కే కంపెనీ యజమాని నికేశ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఆసియన్ సైంటిఫిక్ ఇన్‌‌స్ట్రుమెంట్స్ నుంచి నికేశ్ పేరిట పరికరాలు కొనుగోలు చేసిన బిల్లులు లభ్యమైనట్లు సమాచారం. అతను దొరికితేనే ఈ అక్రమ రక్త వ్యాపారం వెనుక ఉన్న అసలు నెట్‌‌వర్క్, రక్త వినియోగం గురించి పూర్తి వివరాలు వెల్లడవుతాయని అధికారులు భావిస్తున్నారు.