శ్రీరాంపూర్​లో అక్రమంగా బొగ్గు తవ్వుతున్నరు.. హైకోర్టులో సర్పంచ్ పిటిషన్

శ్రీరాంపూర్​లో అక్రమంగా బొగ్గు తవ్వుతున్నరు..  హైకోర్టులో సర్పంచ్ పిటిషన్

హైదరాబాద్, వెలుగు: సింగరేణి కాలరీస్‌‌‌‌ సంస్థ మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌‌‌‌ కాలనీ ప్రాంతంలో అక్రమంగా బొగ్గు తవ్వకాలు చేస్తోందంటూ దాఖలైన పిటిషన్‌‌‌‌ను హైకోర్టు మంగళవారం విచారించింది. చట్ట వ్యతిరేకంగా మైనింగ్‌‌‌‌ చేయడంపై కౌంటర్‌‌‌‌ దాఖలు చేయాలని సింగరేణి కాలరీస్‌‌‌‌ యాజమాన్యానికి కోర్టు నోటీసులు జారీ చేసింది. శ్రీరాంపూర్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ కాస్ట్‌‌‌‌ మైనింగ్‌‌‌‌ కారణంగా పరిసర గ్రామాలు కలుషితం అవుతున్నాయంటూ మంచిర్యాల జిల్లా జైపూర్‌‌‌‌ మండలం రామా రావుపేట సర్పంచ్‌‌‌‌ సత్యవతి సహా మరో ఐదుగురు పిటిషన్ వేశారు. రూల్స్​కు విరుద్ధంగా సింగరేణి మైనింగ్‌‌‌‌ చేస్తోందని, ఇది కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌కు వ్యతిరేకమని పిటిషన్​లో పేర్కొన్నారు. ఈ మేరకు సింగరేణి కంపెనీ, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ, ఆ శాఖ డైరెక్టర్‌‌‌‌ జనరల్, గనుల భద్రత డైరెక్టర్‌‌‌‌ జనరల్, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, మంచిర్యాల జిల్లా కలెక్టర్, సింగరేణి జీఎం, సీఆర్‌‌‌‌ఆర్‌‌‌‌ ఇన్​ఫ్రా ప్రైవేట్‌‌‌‌ లిమిటెడ్​లకు కోర్టు నోటీసులిచ్చింది.