పటాకుల దుకాణాల అనుమతుల పేరుతో అక్రమ వసూళ్లు 

పటాకుల దుకాణాల అనుమతుల పేరుతో అక్రమ వసూళ్లు 

ఖమ్మం, వెలుగు: దీపావళి సందర్భంగా పటాకుల దుకాణాల పర్మిషన్లలో దళారుల దందా కొనసాగుతోంది. అన్ని శాఖల నుంచి అనుమతుల కోసం అంటూ ప్రతి యేటా షాపులు ఏర్పాటు చేసే వారి దగ్గర నుంచి కొందరు బ్రోకర్లు రూ.వేలల్లో వసూలు చేస్తున్నారు. జడ్పీ సెంటర్​ సమీపంలోని ఒక జిరాక్స్​ సెంటర్​ కేంద్రంగా ఈసారి కూడా ఆ టీమ్​ మళ్లీ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. షాపులు ఏర్పాటు చేసేందుకు ఒక్కొక్కరి నుంచి రూ. 35,500 వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో రూ.17,500 రేకుల షెడ్డు ఏర్పాటు కోసం, రూ.18 వేలు పోలీస్​, మున్సిపల్, ఫైర్​, కరెంట్ సహా వివిధ డిపార్ట్ మెంట్ల ఆఫీసర్లను మేనేజ్​ చేసేందుకు అని చెబుతున్నట్లు తెలుస్తోంది. పండుగ సమీపిస్తుండడం, పోలీసులు కూడా దరఖాస్తు చేసుకోమనడంతో దళారులు జోరు పెంచారు. 

రంగంలోకి దిగిన బ్రోకర్లు
కొన్నేళ్ల నుంచి నగరంలోని ఎస్ఆర్అండ్ బీజీఎన్ఆర్​ కాలేజీ గ్రౌండ్​లో దాదాపు 100 దుకాణాలు ఏర్పాటు చేసేందుకు పోలీసులు అనుమతులు ఇస్తున్నారు. అక్కడ రద్దీ పెరుగుతుండడంతో ఈసారి కాలేజ్​ గ్రౌండ్,  పెవిలియన్​ గ్రౌండ్​ లో అదనంగా మరో 50 షాపులు ఏర్పాటు చేసేందుకు ఆఫీసర్లు ప్లాన్​ చేశారు. ఒక షాపు ఏర్పాటు కోసం రూ.1500  బ్యాంకు చలానా తీసి, దరఖాస్తుతో పాటు  ఏఈ5 ఫామ్, సెల్ఫ్ అఫిడవిట్, చలానా రిసీప్ట్, ఆధార్ కార్డ్, ఫొటో జతపరచి ఈనెల 15లోగా పోలీస్ కమిషనర్  కార్యాలయంలో అందజేయాలని ఆఫీసర్లు సూచిస్తున్నారు. అఫిషియల్ ప్రాసెస్​ ఇది కాగా, తమకు డబ్బులిస్తే ఈ ప్రాసెస్​ అంతా తామే చేయిస్తామంటూ కొందరు బ్రోకర్లు బేరసారాలు చేస్తున్నారు. రెగ్యులర్​గా షాపులు ఏర్పాటు చేసే వారికి ఫోన్లు చేసి అన్నీ మేనేజ్​ చేస్తామంటూ నమ్మబలుకుతున్నారు. ఈ పేరుతో ప్రతి యేటా వందల మంది నుంచి లక్షల్లో వసూళ్లు చేస్తుండడంతో తమ ప్రమేయం లేకుండానే బద్నాం అవుతున్నామంటూ పోలీస్, మున్సిపల్ అధికారులు వాపోతున్నారు. రూల్స్ ప్రకారం అప్లై చేసుకుంటే సింగిల్ విండో విధానంలో, అవసరమైన అన్ని డిపార్ట్ మెంట్ల సమన్వయంతో పర్మిషన్స్​ వస్తాయని చెబుతున్నారు. ఎవరూ దళారులను నమ్మి నష్టపోవద్దని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.