సంగారెడ్డి జిల్లా కిష్టారెడ్డిపేటలో జోరుగా అక్రమ నిర్మాణాలు 

సంగారెడ్డి జిల్లా కిష్టారెడ్డిపేటలో జోరుగా అక్రమ నిర్మాణాలు 
  •     ప్రైవేట్ సర్వే నంబర్లతో ప్రభుత్వ భూములకు ఎసరు 
  •      కబ్జాదారులకు అధికాపార్టీ లీడర్ల అండ..! ఆందోళనలో స్థానికులు

సంగారెడ్డి/రామచంద్రపురం, వెలుగు : సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​ మండలం కిష్టారెడ్డిపేట గ్రామ పంచాయతీ పరిధిలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. సర్వే నంబర్ 164లో ఈద్గా ముందు రూ.20 కోట్ల విలువచేసే అర ఎకరం ప్రభుత్వ భూమిని కొందరు కబ్జా చేశారు. సర్కారు భూమి కాదని నమ్మించడానికి పక్కనే ఉన్న ప్రైవేట్ సర్వే నంబర్లు 165, 166ను చూపిస్తూ డాక్యుమెంట్లు తయారు చేశారు. ఆ భూమిలో వేగంగా బిల్డింగులు నిర్మించి అమ్మకానికి సైతం పెట్టారు.  ఇంత జరుగుతున్నా రెవెన్యూ, పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. 

లావుని పట్టా భూములనూ వదలట్లే.. 

ఎకరం లావుని పట్టా భూమిని  అదే గ్రామానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి ఎసరు పెట్టాడు. మూడు దశాబ్దాల కింద పేదలకు ఇచ్చిన ఎకరం లావుని పట్టా భూమిని నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేసి జేసీబీలతో చదును చేశాడు. ప్రహరీ నిర్మించి లోపల రోడ్లు కూడా వేయించాడు. దీనిని వ్యతిరేకిస్తూ స్థానికులు అతడిని ప్రశ్నించారు. కానీ అక్కడ గుడి కట్టిస్తానని వారికి చెబుతూ తనపని తాను చేసుకుపోతున్నట్లు తెలుస్తోంది. కోట్లాది రూపాయల భూములను దర్జాగా ఆక్రమిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కబ్జాలపై జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాపోతున్నారు. పేదలకు ఇచ్చిన భూములను పేదలకే ఉండనివ్వాలని డిమాండ్​ చేస్తున్నారు. 

అధికార పార్టీ లీడర్ల ప్రోత్సాహంతోనే..!

అధికార పార్టీ లోకల్​లీడర్ల ప్రోత్సాహంతోనే ప్రభుత్వ భూములను కబ్జా  చేస్తున్నారని కాంగ్రెస్, బీజేపీ లీడర్లు ఆరోపిస్తున్నారు. అమీన్​పూర్​ పరిధిలో ఎవరు ఎక్కడ నిర్మాణాలు చేపట్టినా వారికి ముడుపులు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందంటున్నారు. 
సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలన్న ఆశతో అక్కడ స్థలాలు, ఇండ్లను కొనుగోలు చేసి అమాయకులు మోసపోతున్నారని చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కిష్టారెడ్డిపేట సర్వే నంబర్ 164లోని ప్రభుత్వ భూమిలో జరుగుతున్న అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకొని స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

చర్యలు తీసుకుంటాం 

కిష్టారెడ్డిపేట 164 సర్వే నంబర్ లో ప్రభుత్వ భూమి ఉన్నట్టు రెవెన్యూ ఆఫీసర్లు నిర్ధారించారు. ప్రైవేట్ సర్వే నంబర్లతో ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేపట్టినట్టు నా దృష్టికి వచ్చింది. ఈ విషయమై పంచాయతీ అధికారులకు సర్వే నంబర్ల హద్దులను పరిశీలించాలని ఆదేశించాం. రెవెన్యూ ఆఫీసర్ల సహకారం తీసుకుంటున్నాం. వేదికలు వచ్చాక ఆక్రమణలపై చర్యలు తీసుకుంటాం. కబ్జాలో ఎంతటి వారు ఉన్నా ఉపేక్షించే ప్రసక్తే లేదు.– సతీశ్​రెడ్డి, డీఎల్ పీఓ