- సీఎంకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ
హైదరాబాద్, వెలుగు: కాకతీయుల కళా వైభవానికి ప్రతీకగా నిలిచిన వరంగల్ కోట కబ్జా కోరల్లో చిక్కుకుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కోట చుట్టూ ఉన్న ప్రాకారాలు, మట్టి గోడలను కబ్జాదారులు ధ్వంసం చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన మంగళవారం లేఖ రాశారు. చారిత్రక సంపదను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, వెంటనే కోట భూములను భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) పరిధిలోకి మారుస్తూ రెవెన్యూ రికార్డులను సవరించాలని డిమాండ్ చేశారు.
250 ఏళ్ల పాటు కాకతీయుల రాజధానిగా వెలుగొందిన ఓరుగల్లు కోటకు శత్రువుల నుంచి రక్షణగా అప్పట్లో 7 ప్రాకారాలను నిర్మించారని గుర్తుచేశారు. ప్రస్తుతం అందులో 3 ప్రాకారాలు మాత్రమే మిగిలి ఉన్నాయని, మిగిలిన వాటిని స్థానికులు కబ్జా చేశారని చెప్పారు. ఉన్న ఆ కాస్త భూముల్లో కూడా ప్రైవేటు వ్యక్తులు మట్టి గోడలను ధ్వంసం చేసి నిర్మాణాలు చేపడుతున్నారని తెలిపారు. ‘‘కోట భూములు ఏఎస్ఐ ఆధీనంలో ఉంటాయి. అక్కడ నిర్మాణాలు చేపట్టడం చట్టరీత్యా నేరమని ఏఎస్ఐ అధికారులు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది.
నేను సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 2022 నవంబర్ 4న, నిరుడు డిసెంబర్ 1, 3న వరంగల్ జిల్లా కలెక్టర్ కు ఏఎస్ఐ అధికారులు లేఖలు రాసినా.. అధికారులు కనీసం పట్టించుకోలేదు. ప్రస్తుతం రెవెన్యూ రికార్డుల్లో కోట భూములు ‘ప్రభుత్వం’ గా నమోదై ఉన్నాయి. దీనివల్ల ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవడంలో ఏఎస్ఐకి అడ్డంకులు ఎదురవుతున్నాయి” అని కిషన్ రెడ్డి వివరించారు. కోట భూములను ‘భారత పురావస్తు శాఖ’ కు చెందినవిగా రికార్డుల్లో మార్చాలని కోరారు.
