- ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు చిరుమర్తి లింగయ్య, జైపాల్ యాదవ్ విచారణ
- బాధితుడిగా రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డి స్టేట్‌మెంట్ రికార్డ్
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కొనసాగుతున్నది. గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గాల వారీగా ప్రత్యర్థుల ఫోన్ నంబర్లు ట్యాపింగ్ చేయించిన బీఆర్‌ఎస్ నేతలను ఎంక్వైరీ చేస్తున్నది. ఇందులో భాగంగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కు మరోసారి సిట్ నోటీసులు జారీ చేసింది.
గురువారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పీఎస్‌లోని సిట్ ఆఫీస్‌లో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ బాధితుడిగా సీఎం సోదరుడు కొండల్‌రెడ్డి స్టేట్‌మెంట్ రికార్డ్ చేయనున్నది. ఈ మేరకు చిరుమర్తి లింగయ్య, జైపాల్ యాదవ్, కొండల్ రెడ్డి గురువారం సిట్ ఎదుట హాజరుకానున్నారు.
ఎమ్మెల్సీ నవీన్‌రావు తండ్రి కొండల్ రావు, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొడుకు సందీప్ రావును బుధవారం ప్రశ్నించాల్సి ఉండగా... కొండల్‌రావు వయసు, అనారోగ్యం కారణంగా ఇంట్లోనే స్టేట్‌మెంట్ ఇస్తానని అడ్వకేట్ ద్వారా సమాచారం అందించారు. సందీప్ రావు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారని.. 4 రోజుల తర్వాత వస్తారని కృష్ణారావు సిట్ చీఫ్ సజ్జనార్‌కు చెప్పినట్లు తెలిసింది.
చిరుమర్తి, జైపాల్ యాదవ్ విచారణ ఇందుకే!
2023 నవంబర్ 15 నుంచి 30 మధ్యకాలంలో సేకరించిన ఫోన్ ట్యాపింగ్ లిస్ట్ ఆధారంగా సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నకిరేకల్ నియోజకవర్గంతో పాటు నల్గొండ జిల్లా నాయకుల ఫోన్ నంబర్లను లింగయ్య ట్యాప్ చేయించినట్లు ఇప్పటికే స్పెషల్ టీమ్ అధికారులు గుర్తించారు.
కల్వకుర్తి నియోజకవర్గంలో తన ప్రత్యర్థులు, వారి అనుచరులకు సంబంధించిన ఫోన్ నంబర్లను మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఎస్‌ఐబీ స్పెషల్ ఆపరేషన్స్ టార్గెట్స్ టీమ్‌కు అందించారు. ఈ మేరకు 2024, నవంబర్ 16న స్పెషల్ టీమ్ వీరిద్దరి స్టేట్‌మెంట్లను రికార్డ్ చేసింది. ఈ కేసులో నిందితుడైన మాజీ అడిషనల్ ఎస్పీ తిరుపతన్న, చిరుమర్తి లింగయ్య కాంటాక్ట్స్‌తో లింక్ అయిన దాదాపు 58 ఫోన్ నంబర్లను సిట్ సేకరించినట్లు తెలిసింది.
ఈ క్రమంలోనే జైపాల్ యాదవ్ కూడా 2 కుటుంబాలకు చెందిన ఫోన్ నంబర్లను తిరుపతన్నకు అందించినట్లు సిట్‌కు వెల్లడించారు. కాగా, తాను ఇచ్చిన ఫోన్ నంబర్లు ప్రత్యర్ధులవి కాదని.. రెండు కుటుంబాల మధ్య తలెత్తిన విభేదాల కేసులో వారి నంబర్స్ ఇచ్చినట్లు జైపాల్ యాదవ్ అంగీకరించారు. ఈ క్రమంలోనే అక్టోబర్, నవంబర్‌లో తిరుపతన్న, జైపాల్ యాదవ్ కాల్ డేటా ఆధారంగా స్టేట్‌మెంట్ రికార్డు చేశారు.
