- సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ సుదర్శన్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: దేశాభివృద్ధిలో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ చేసిన కృషిని మాటల్లో చెప్పలేమని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ సుదర్శన్ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో కొత్తగా ఏర్పాటు చేసిన ‘బ్రిడ్జ్’ (బీఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ డైలాగ్ ఆన్ గవర్నెన్స్ అండ్ ఈక్విటీ)ని సుదర్శన్ రెడ్డి ప్రారంభించి, మాట్లాడారు.
అంబేద్కర్ దార్శనికత, ఆయన లోతైన ఆలోచనలను ఈ సెంటర్ అందరికీ పంచాలన్నారు. ఎడ్యుకేషన్, ఎకానమీ, అడ్మినిస్ట్రేషన్ లో అంబేద్కర్ వేసిన ముద్ర చెరిగిపోనిదన్నారు. కుల వివక్షను రద్దు చేయడం ఆయన చేసిన అతిపెద్ద సంస్కరణ అని అన్నారు. అంబేద్కర్ ఇంకా వెలుగులోకి రాని రచనలపై, ఆయన బౌద్ధమత స్వీకారంపై ఈ సెంటర్ లో లోతైన చర్చ జరగాలని ఆకాంక్షించారు.
మాజీ సీఎస్ కాకి మాధవరావు మాట్లాడుతూ... అందరికీ సమాన న్యాయం అందాలనే లక్ష్యంతో అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాశారన్నారు. సమాజాన్ని విడదీస్తున్న అదృశ్య గోడలను కూల్చేయడమే ‘బ్రిడ్జ్’ సెంటర్ లక్ష్యమని వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అన్నారు. ప్రతి స్టూడెంట్కు అంబేద్కర్ స్ఫూర్తి అని, దృఢసంకల్పానికి ఆయన నిలువెత్తు నిదర్శనమని అడిషనల్ డీజీపీ సుధీర్ బాబు పేర్కొన్నారు.
