- వీసా ప్రత్యేక సౌకర్యం మాత్రమే.. హక్కు కాదు
న్యూఢిల్లీ: అమెరికాలో చట్టాలను ఉల్లంఘించడం వల్ల అంతర్జాతీయ విద్యార్థులకు తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని ఇండియాలోని యూఎస్ ఎంబసీ హెచ్చరించింది. చట్టాలను ఉల్లంఘించిన వారిని అరెస్ట్ చేయడం లేదా వీసా రద్దు చేసి, స్వదేశానికి తిప్పి పంపడం వంటివి జరుగుతాయని స్పష్టం చేసింది. భవిష్యత్తులో వారికి మళ్లీ వీసాలను ఇచ్చే అవకాశం కూడా ఉండదని పేర్కొంది.
యూఎస్ ఎంబసీ బుధవారం ఈ మేరకు ‘ఎక్స్’లో ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా వీసా అనేది హక్కు కాదని.. అది ఒక సౌకర్యం మాత్రమేనని తేల్చిచెప్పింది. హెచ్1బీ, హెచ్3 వర్క్ వీసాలపై వచ్చినవారు అమెరికాలో చట్టాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని గత వారం హెచ్చరించిన యూఎస్ ఎంబసీ.. తాజాగా స్టూడెంట్ వీసాలపైనా అలాంటి కఠిన చర్యలే ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది.
అలాగే అక్రమ ఇమ్మిగ్రెంట్లు తరచూ హింసాత్మక కార్టెల్స్, మానవ అక్రమ రవాణాదారులు, అవినీతి అధికారుల బారిన పడతారని హెచ్చరించింది. ‘‘అక్రమ ఇమ్మిగ్రెంట్లు దోపిడీకి గురై, బాధితులవుతారు. అది చివరికి వ్యర్థ ప్రయాణమవుతుంది. అక్రమ ఇమ్మిగ్రేషన్ నుంచి లాభపడేవారు కేవలం అక్రమ రవాణాదారులు మాత్రమే” అని ఎంబసీ పోస్ట్‌లో పేర్కొంది.
