పోలీసులు నా బట్టలు విప్పేశారు!..బీజేపీ మహిళా కార్యకర్త ఆరోపణ

పోలీసులు నా బట్టలు విప్పేశారు!..బీజేపీ మహిళా కార్యకర్త ఆరోపణ
  •  కర్నాటకలో బీజేపీ మహిళా కార్యకర్త ఆరోపణ
  •  ఖండించిన పోలీసులు
  •  సోషల్ ​మీడియాలో వీడియో వైరల్

హుబ్బళ్లి (కర్నాటక): కర్నాటకలో ఓ బీజేపీ మహిళా కార్యకర్తను అరెస్టు చేస్తున్న సమయంలో పోలీసులు తన బట్టలు విప్పేశారని ఆమె ఆరోపించింది. అయితే, ఆ మహిళ ఆరోపణలను పోలీసులు ఖండించారు. ఆమె తన బట్టలను తానే విప్పేసుకుందని.. పోలీసులపై కూడా దాడి చేసిందని తెలిపారు. ప్రస్తుతం ఈ అంశం కర్నాటకలో వివాదాస్పదమైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్​మీడియాలో వైరల్​గా మారింది. హుబ్బళ్లిలోని కేశవాపూర్‌‌‌‌‌‌‌‌లో గల చాలుక్య నగర్ ప్రాంతంలో కొందరు ప్రభుత్వ భూమిని ఆక్రమించారు. 

భూ సర్వే కోసం ప్రభుత్వ అధికారులు పోలీసులతో కలిసి ఆ ప్రాంతానికి వెళ్లగా.. ఆక్రమణదారులు పోలీసులపై దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. అందులో బీజేపీ మహిళా కార్యకర్త అయిన సుజాత హండి అలియాస్ విజయలక్ష్మి హండిని ప్రధాన నిందితురాలిగా చేర్చారు. ఈ క్రమంలో ఈ నెల 5న సుజాతను అరెస్టు చేసేందుకు పోలీసులు ఆమె ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. పోలీసులు ఆమెను బలవంతంగా పోలీసు వాహనంలోకి ఎక్కించారు. అయితే, ఆ వెహికల్​లో ఆమె బట్టలు లేకుండా ఉన్న వీడియోలు వెలుగులోకి వచ్చాయి. 

అనంతరం ఆమె మాట్లాడుతూ.. వెహికల్​లో పోలీసులు తనను వివస్త్రను చేసి దాడి చేశారని ఆమె ఆరోపించింది. ఈ ఘటనపై హుబ్బళ్లి -ధార్వాడ్ పోలీస్ కమిషనర్ ఎన్ శశికుమార్ బుధవారం స్పందించారు. ఆమె ఆరోపణలను తోసిపుచ్చారు. ఆ మహిళ తన బట్టలను తానే విప్పేసుకోవడమే కాకుండా.. ఇద్దరు సబ్-ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్లతో సహా నలుగురు పోలీసు అధికారులను కడుపుపై కొరికిందని పేర్కొన్నారు. అనంతరం మహిళా పోలీసులు స్థానికుల సహాయంతో ఆమెకు బట్టలు వేయించారని చెప్పారు.