హనుమకొండ జిల్లాలో అక్రమ గ్రానైట్ దందా గుట్టురట్టు

హనుమకొండ జిల్లాలో అక్రమ గ్రానైట్  దందా గుట్టురట్టు

హనుమకొండ, వెలుగు: ఎలాంటి అనుమతులు లేకుండా, ప్రభుత్వానికి ట్యాక్స్  కట్టకుండా ఐదారేండ్ల నుంచి దందా సాగిస్తున్న గ్రానైట్  క్వారీ వ్యవహారం బట్టబయలైంది. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ నుంచి ఎల్కతుర్తి స్టోన్  కటింగ్  ఇండస్ట్రీలకు గ్రానైట్  అక్రమంగా తరలుతున్న వ్యవహారంపై ఈ నెల 9న వెలుగు పేపర్ లో ‘రాత్రయితే రైట్  రైట్’ కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన మైనింగ్  ఆఫీసర్లు మడికొండలోని గ్రానైట్  క్వారీలు, క్రషర్లపై ఆరా తీశారు. సర్వే నంబర్  987లో ఎలాంటి అనుమతులు లేకుండా నడుస్తున్న గ్రానైట్  క్వారీని గుర్తించారు. మైనింగ్  ఏడీ రామాచారి, కాజీపేట తహసీల్దార్​ రాజు, మడికొండ సీఐ పుల్యాల కిషన్, ఆర్టీవో వేణుగోపాల్, జీడబ్ల్యూఎంసీ అధికారులు శుక్రవారం క్వారీకి వెళ్లారు. 

గేట్లకు తాళం వేసి లోపల క్వారీ నిర్వహిస్తుండగా, వాటిని తెరిపించి తనిఖీలు చేపట్టారు. పట్టాదారు రాజిరెడ్డి ఎలాంటి అనుమతులు లేకుండానే క్వారీ నిర్వహిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. చుట్టూ ఇండ్లు ఉన్నా లెక్కచేయకుండా క్వారీ నడుపుతున్నట్లు నిర్ధారణకు వచ్చారు. క్వారీలోని రెండు ఎక్స్ కవేటర్లతో పాటు రెండు హిటాచీలను సీజ్  చేశారు. ఇల్లీగల్ గా ఇండ్ల మధ్యనే క్వారీ నడిపిస్తున్నారని, డస్ట్ తో పొల్యూషన్  వస్తుండడంతో పీసీబీకి ఫిర్యాదు చేస్తామని మైనింగ్​ ఏడీ తెలిపారు. పూర్తి విచారణ అనంతరం డిమాండ్  నోటీస్  ఇస్తామని, ఇప్పటివరకు ఎంత మేర గ్రానైట్  తవ్వకాలు జరిపారో ఎస్టిమేషన్స్  వేసి సీనరేజి ఫీజుకు 10 రెట్లు పెనాల్టీ విధిస్తామని చెప్పారు.

రూ.కోట్లలో ట్యాక్స్ ఎగవేత

మైనింగ్  ఆఫీసర్లు గుర్తించిన అక్రమ క్వారీలో రూ.కోట్ల దందా సాగించినట్లు సమాచారం. ప్రభుత్వానికి రాయల్టీ, జీఎస్టీ కింద రూ.కోట్లలో ట్యాక్స్  ఎగ్గొట్టి దందా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. క్వారీ నిర్వాహకులు గ్రానైట్  తవ్వేసి, గుంతలను మట్టితో నింపేసినట్లు సమాచారం. దీంతో ఎంతమేర గ్రానైట్ తవ్వకాలు జరిపారో తెలుసుకోవడానికి ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. ఈ దందాపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, క్వారీని సీజ్  చేయాలని స్థానికులు డిమాండ్  చేస్తున్నారు.