
- సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కాసుల గలగల
- రెవెన్యూ ఆఫీసుల్లో సింగిల్ ప్లాట్లకు నాలా కన్వర్షన్
- ఎస్ఆర్వోల్లో చట్టానికి దొరక్కుండా అక్రమ రిజిస్ట్రేషన్లు
- ప్రభుత్వ ఆదాయానికి భారీ గండికొడుతున్న రియల్టర్లు
మంచిర్యాల, వెలుగు: జిల్లా కేంద్రంతో పాటు పక్కనున్న నస్పూర్, హాజీపూర్, లక్సెట్టిపేట, జైపూర్, భీమారం, మందమర్రి, కాసిపేట, బెల్లంపల్లి మండలాల్లో రియల్ ఎస్టేట్ దందా జోరుగా నడుస్తోంది. రియల్టర్లు పెద్దఎత్తున వ్యవసాయ భూములను కొని ఇల్లీగల్ వెంచర్లు చేస్తున్నారు. వాటిని గజాలు, గుంటల్లో అమ్ముతున్నారు.
జైపూర్, భీమారం, మందమర్రి, మండలాల్లో కొంతమంది రియల్టర్లు ఫామ్ ల్యాండ్స్ పేరిట సామాన్యులను ముంచుతుండగా, మిగతా మండలాల్లో నాన్లేఔట్లలో ప్లాట్లు అంటగడుతున్నారు. వీటిలో ఇండ్లు కట్టుకోవాలంటే పంచాయతీ, మున్సిపల్ పర్మిషన్లు రావు. దీంతో ఎల్ఆర్ఎస్ కట్టి ప్లాట్లను రెగ్యులరైజ్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలా కస్టమర్లుకు అదనపు భారం తప్పదు.
డీటీసీపీ రూల్స్ఇలా...
డీటీసీపీ పర్మిషన్‌కు వెళ్తే వెంచర్లో 30 శాతం జాగా రోడ్లకు, 10 శాతం సామాజిక అవసరాల కోసం పంచాయతీ లేదా మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్ చేయాలి. 33 నుంచి 40 ఫీట్ల బ్లాక్ టాప్ రోడ్లు, కరెంట్, వాటర్, డ్రైనేజీ, అవెన్యూ ప్లాంటేషన్వంటి సౌకర్యాలను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. 60 శాతం విస్తీర్ణంలో మాత్రమే ప్లాట్లు చేసి అమ్ముకోవాలి. దీంతో రియల్టర్లు నాన్ లేఔట్లు చేస్తూ కొనుగోలుదారులను మోసం చేయడమే కాకుండా స్టాంప్ డ్యూటీ రూపంలో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు.
చట్టానికి చిక్కుకండా...
గత బీఆర్ఎస్ సర్కారు తీసుకొచ్చిన మున్సిపల్ యాక్ట్‌లో నాన్ లే ఔట్లను బ్యాన్ చేసింది. ఆ తర్వాత ఇల్లీగల్ లేఔట్లకు చెక్ పెడుతూ 2020 ఆగస్టులో 257 సర్క్యులర్‌ను జారీ చేసింది. దీంతో రియల్టర్లు, అధికారులు కలిసి చట్టానికి చిక్కకుండా కొత్త ఐడియా ఆలోచించారు. ముందుగా కస్టమర్ల పేరిట అగ్రికల్చర్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తారు. తర్వాత రెవెన్యూ ఆఫీసులో సింగిల్ ప్లాట్లకు నాలా కన్వర్షన్ చేయిస్తారు. నాలా ఆధారంగా సబ్ రిజిస్ట్రార్ఆఫీసులో రిజిస్ట్రేషన్లు చేస్తారు. ‘నాలా కన్వర్షన్అయ్యింది కాబట్టి రిజిస్ట్రేషన్లు చేస్తున్నాం. ఇందులో మా తప్పేముంది’ అంటూ సంబంధిత అధికారులు తప్పించుకుంటున్నారు. డ్యాక్యుమెంట్‌కు ఇంతా అని ఎవరికి ఎంత ముట్టాలో అంత ముడుతోంది. జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో ఇదే దందా నడుస్తోంది.
కార్పొరేషన్ పరిధిలో ఇల్లీగల్‌గా..
నస్పూర్ మున్సిపాలిటీతో పాటు హాజీపూర్ మండలంలోని ఐదు గ్రామపంచాయతీలను విలీనం చేస్తూ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటైంది. దీంతో ఇటు శ్రీరాంపూర్ వరకు, అటు గుడిపేట వరకు కార్పొరేషన్ పరిధి విస్తరించింది. గుడిపేటలో 13వ పోలీస్ బెటాలియన్ ఉండగా, ఇటీవలే కేంద్రీయ విద్యాలయం ప్రారంభమైంది. మెడికల్‌కాలేజీ నిర్మాణం జరుగుతోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద ఇంటర్నేషనల్ ఫిష్‌పాండ్ మంజూరైంది.
అలాగే ముల్కల్ల నుంచి క్యాతన్‌పల్లి వరకు ఎన్‌హెచ్ 363 బైపాస్ సాంక్షన్ అయ్యి పెండింగ్‌లో ఉంది. అదే ప్రాంతంలో గోదావరిపై హైలెవల్ బ్రిడ్జికి ప్రపోజల్స్ ఉన్నాయి. వేంపల్లి శివారులో 250 ఎకరాల్లో ఇండస్ట్రేయల్ హబ్‌కు శంకుస్థాపన చేశారు. వీటి పేరు చెప్పి రియల్టర్లు వందల ఎకరాల్లో ఇల్లీగల్వెంచర్లు చేస్తున్నారు. వీటిపై మున్సిపల్ కార్పొరేషన్, డీటీసీపీ అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరముంది.