కి‘లేడీ’ గ్యాంగ్ ఫైనాన్స్ దందా.. ముందస్తు వడ్డీ తీసుకుని ..లోన్లు ఇవ్వకుండా సతాయింపు 

కి‘లేడీ’ గ్యాంగ్ ఫైనాన్స్ దందా.. ముందస్తు వడ్డీ తీసుకుని ..లోన్లు ఇవ్వకుండా సతాయింపు 
  • గ్యారంటీ కింద బాండ్లు, 
  •  చెక్కులు, ప్రామిసరీ నోట్లు 
  • రూ.వందకు 15 శాతం వడ్డీ  
  • ఇవ్వకపోతే ఇజ్జత్​ తీసి వసూలు చేస్తరు 
  • పట్టుకున్న మల్కాజిగిరి పోలీస్​ 

మల్కాజిగిరి, వెలుగు : పేదల అవసరాలను లక్ష్యంగా చేసుకుని ముందస్తుగా అధిక వడ్డీ తీసుకుని తర్వాత లోన్లు ఇవ్వకుండా సతాయించడం, ఇచ్చినా ఇజ్జత్​ తీసి వసూళ్లు చేస్తున్న ఓ లేడీ గ్యాంగ్​ను ఎల్బీనగర్​ఎస్‌‌‌‌ఓటీ, ఎల్‌‌‌‌బీనగర్ పోలీసులు అరెస్ట్​చేశారు. ఎల్‌‌‌‌బీనగర్, నేరేడ్‌‌‌‌మెట్, కీసర పీఎస్​ల పరిధిలో నమోదైన నాలుగు కేసుల దర్యాప్తులో ఈ ముఠా అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.

ఇచ్చిన మొత్తానికి మించి ప్రామిసరీ నోట్లు రాయించుకోవడం, ఖాళీ చెక్కులు తీసుకోవడం, తర్వాత బాధితులను బెదిరించి మరింత డబ్బు గుంజడం లాంటి పనులను ఈ ముఠా చేస్తోంది. ఈ కేసులో గత నెల 26న ముగ్గురిని అరెస్టు చేయగా, తాజాగా మరో ముగ్గురిని పట్టుకున్నారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. కేసు వివరాలను మల్కాజిగిరి సీపీ సుమతి గురువారం ఎల్బీనగర్ లోని సీపీ క్యాంపు ఆఫీసులో వెల్లడించారు. కుంభం నాగమ్మ (48), కండెలా గంగమ్మ (45), కండెలా మంగమ్మ అలియాస్ రాణి (36), అడుల్లా అనూష (32), వజ్రగిరి ఇంద్రమ్మ (38), గైక్వాడ్ స్వప్న (32)లతో కలిసి కండెలా శివకుమార్ అలియాస్ వరుణ్ (24) ఇల్లీగల్ ​ఫైనాన్స్​ దందా చేస్తున్నారు.

వీరు ఎవరైనా హాస్పిటల్​లో ఉండి అత్యవసరంగా డబ్బులు అవసరమైనా, ఇంకా ఏ రకమైన ఎమర్జెన్సీ వచ్చినా రూ. 100కు 10 నుంచి 15 శాతం వడ్డీకి ఫైనాన్స్​ ఇస్తామని నమ్మిస్తారు. మధ్యతరగతి ప్రజలు, చిన్న వ్యాపారులు, రిటైర్డ్ ఉద్యోగులను టార్గెట్ చేస్తారు. లోన్ మొత్తాన్ని చేతికి ఇవ్వకముందే భారీగా వడ్డీని అడ్వాన్సు రూపంలో  తీసుకుంటారు. బాధితులకు ఆశ చూపిన లోన్​లో కొంత మాత్రమే ఇచ్చి, మిగిలినది తర్వాత ఇస్తామని చెప్తారు. వారి నుంచి ఖాళీ ప్రామిసరీ నోట్లు, బాండ్లు, సంతకాలు చేసిన బ్లాంక్ చెక్కులను తీసుకునేవారు. అప్పును పూర్తిగా వడ్డీతో సహా చెల్లించినప్పటికీ డాక్యుమెంట్లను తిరిగిచ్చేవారు కాదు.

తీసుకున్న బ్లాంక్ చెక్కులపై భారీ మొత్తాలు రాసి, మరింత డబ్బు ఇవ్వాలని వేధించేవారు. మాట వినకుంటే హాని చేస్తామని, క్రిమినల్ కేసులు పెడతామని బెదిరింపులకు పాల్పడేవారు. అలాగే, డబ్బులు ఇవ్వకపోతే ఇండ్ల ముందు తిష్ట వేసి  వంట చేసుకుని తినేవారు. ఒక్కోసారి బట్టలు విప్పి ఇజ్జత్​ తీసి డబ్బులు వసూలు చేసేవారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

బాధితుల్లోని ఒక వృద్ధ మహిళా డాక్టర్ క్యాన్సర్ గుర్తింపు మిషన్‌‌‌‌ను కొనడానికి  లోన్ కోసం ఈ ముఠాను ఆశ్రయించగా.. కొన్ని పత్రాలు లాక్కోవడమే కాకుండా స్కోడా, ఇన్నోవా హైక్రాస్ కార్లను లాక్కున్నారు.  వీరి భారిన పడ్డ వారిలో ఓ ప్రైవేట్ టీచర్, డ్రైవర్, రిటైర్డ్ వెటర్నరీ ఉద్యోగి కూడా ఉన్నారు. డాక్టర్​తో పాటు మిగతా వారి ఫిర్యాదులతో రంగంలోకి దిగిన పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్ట్​ చేశారు. బాధితుల నుంచి లాక్కున్న రెండు కార్లు, 12 స్మార్ట్​ఫోన్లు, 25 ప్రామిసరీ నోట్లు, 22 బ్లాంక్ చెక్కులు, 2 పట్టాదార్ పాస్‌‌‌‌బుక్‌‌‌‌లు, సేల్ డీడ్లతో సహా 100కు పైగా కీలక పత్రాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. మరో 100 మంది బాధితులు ఉన్నారని 
తెలుస్తోంది.