వందల కోట్ల వడ్లు మాయం..కేసులు పెడుతున్నా మారని మిల్లర్లు.. ఇంకా స్టాక్ అమ్ముకుంటున్నరు

వందల కోట్ల వడ్లు మాయం..కేసులు పెడుతున్నా మారని మిల్లర్లు.. ఇంకా స్టాక్ అమ్ముకుంటున్నరు
  •  తాజా ఎన్​ఫోర్స్​మెంట్​ దాడుల్లో మిల్లర్ల బండారం బట్టబయలు
  •   సీఎంఆర్‌‌‌‌‌‌‌‌ విధానం దుర్వినియోగం
  •   అధికారుల తీరుపైనా అనుమానాలు
  •   ఆదిలాబాద్​ జిల్లాలో  ఓ మిల్లర్​ జైలుకు 

హైదరాబాద్, వెలుగు: కొత్త సర్కారు మిల్లర్లపై కొరఢా ఝులిపిస్తున్నా.. గత దశాబ్ధకాలంగా అక్రమాలకు అలవాటు పడిన వారి తీరు ఏమాత్రం మారడం లేదు. రెవెన్యూ రికవరీ యాక్ట్​(ఆర్ఆర్), క్రిమినల్​ కేసులు పెడతామని హెచ్చరిస్తున్నా.. ఇప్పటికీ స్టాక్​ అమ్ముకుంటున్నరు. 

సర్కారు సివిల్​ సప్లయ్స్​ద్వారా వేలకోట్ల రూపాయలు ఖర్చు చేసి ధాన్యం కొనుగోళ్లు చేసి ధాన్యం మిల్లింగ్​ చేయడానికి మిల్లులకు తరలిస్తే.. ఆ ధాన్యంతో మిల్లర్లు దర్జాగా వ్యాపారం చేస్తున్నరు. ధాన్యాన్ని మిల్లుల ద్వారా బియ్యంగా మార్చి, వాటిని పేదలకు పంపిణీ చేయడానికి ఉద్దేశించిన సీఎంఆర్‌‌‌‌‌‌‌‌ ప్రక్రియను కొందరు మిల్లర్లు కేవలం అక్రమ సంపాదనకు మార్గంగా మార్చుకుంటున్నరు.

 ప్రభుత్వ ధాన్యాన్ని సకాలంలో మిల్లింగ్‌‌‌‌‌‌‌‌ చేయకుండా దానిని బహిరంగ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో విక్రయించి, ఆ సొమ్మును వ్యక్తిగత అవసరాలు, ఇతర వ్యాపారాలకు మళ్లిస్తున్నరు. దీంతో వేలకోట్ల రూపాయల విలువైన ధాన్యం మాయమవుతోంది. రైస్‌‌‌‌‌‌‌‌ మిల్లర్ల అక్రమ దందాతో సర్కార్‌‌‌‌‌‌‌‌ ఖజానాకు భారీ చిల్లు పెడుతున్నరు. జిల్లాల్లో అధికార యంత్రాంగం అండతో చెలరేగిపోతున్నారు. 

అధికారుల వైఫల్యంపై ఆరోపణలు

రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద మొత్తంలో ప్రభుత్వ ధాన్యం మాయం కావడం, ఆ తర్వాత దానిని రికవరీ చేయడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందనే ఆరోపణలు వస్తున్నాయి. మిల్లర్లకు ధాన్యాన్ని కేటాయించిన తరువాత నిర్ణీత గడువులోగా బియ్యం తిరిగి అప్పగిస్తున్నారా? లేదా? అని పర్యవేక్షించడంలో సివిల్​సప్లయ్స్​ శాఖ అధికారులు నిర్లక్ష్యం వహించారనే విమర్శలు సైతం ఉన్నాయి. 

వెయ్యికోట్లకు పైగా దోపిడీ జరిగినట్టు అధికారిక లెక్కలే చెప్తున్నాయి. సివిల్​ సప్లయ్స్​ జిల్లా స్థాయి అధికారుల అలసత్వంతో రికవరీ చేయడం ప్రశ్నార్థకంగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. అధికారుల అండదండలకు తోడు విజిలెన్స్​ విభాగం నుంచి సరైన నిఘా లేక పోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. 

లక్షల టన్నుల ధాన్యం మాయమైనట్టు గుర్తించినా  మిల్లర్ల నుంచి  విలువైన ధాన్యాన్ని కానీ, దానికి సమానమైన బియ్యాన్ని తిరిగి రాబట్టడంలో అధికారులు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు రైస్‌‌‌‌‌‌‌‌ మిల్లర్లతో అధికారులు కుమ్మకై, వారి అక్రమాలకు పరోక్షంగా సహకరించారనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి.

మిల్లర్ల బండారం బట్ట బయలైంది ఇలా..

సివిల్​సప్లయ్స్​డిపార్ట్​మెంట్​కు చెందిన విజిలెన్స్​ఎన్​ఫోర్స్​మెంట్​అధికారులు తాజాగా జరిపిన దాడుల్లో భారీగా మిల్లర్ల అక్రమాలు వెలుగు చూశాయి. ఇటీవల ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, వరంగల్, హనుమకొండ, యాదాద్రి, వనపర్తి, 11 జిల్లాల్లో జరిపిన దాడుల్లో వందల కోట్ల విలువైన లక్ష టన్నుల ధాన్యం మాయమైనట్టు గుర్తించారు. 
    
వరంగల్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో 27 మంది రైస్‌‌‌‌‌‌‌‌ మిల్లర్లు ఏకంగా 32,083.23 టన్నుల వడ్లు మాయం చేసినట్టు తెలిసింది. 2023=-24 వానాకాలం, 2024-=25 యాసంగికి సంబంధించిన ఈ ధాన్యం విలువ రూ.131.57 కోట్లు ఉంటుందనే అంచనాలున్నాయి. 
    
నిర్మల్​ జిల్లాలోని లక్ష్మీ నర్సింహ రైస్​ మిల్ లో 2,958 టన్నులు, రాజేశ్వరీ మిల్ లో 4,056 టన్నులు, సిద్దేశ్వర మిల్​లో 3,782 టన్నులు మాయమైనట్టు గుర్తించారు. 
    
జగిత్యాల జిల్లాలోని సురేశ్ ఆగ్రో ఇండస్ట్రీస్, శ్రేయాస్​ రైస్​ ఇండస్ట్రీస్​లో 2,918 టన్నులు, ఎస్​ఆర్​ఆర్​ట్రేడర్స్​ మిల్​లో 1,975 టన్నులు, జీఎస్​కే ఆగ్రో ఇండస్ట్రీస్​ 5,562 టన్నులు మాయమైనట్టు అధికారులు గుర్తించారు. 
    
యాదాద్రి జిల్లాలో పద్మావతి రైస్​ మిల్​లో 3,180 టన్నులు మాయమైనట్టు ఎన్​ఫోర్స్​మెంట్​ దాడుల్లో బయటపడింది. 
    
ఆదిలాబాద్​ కౌటాల మండల కేంద్రంలోని ఓ రైస్ మిల్లులో  33,842 బస్తాల ధాన్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. సిర్పూర్(టి) మండలం వెంకట్రావ్​ పేట్​లోని ఓ రైస్ మిల్లులో 43,190 బస్తాల ధాన్యం తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన మిల్లును సీజ్ చేశారు. వెంకట్రావ్ పేట్ లోని ఓ రైస్ మిల్లులో దాదాపుగా రూ.4.45 కోట్ల విలువైన  ధాన్యం, కౌటాలలోని  రైస్ మిల్లులో రూ.3.50 కోట్ల విలువైన  ధాన్యం  తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. సిర్పూర్(టి), కౌటాల మండలాల్లోని రైస్ మిల్లుల్లో ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో దాదాపు 77 వేల ధాన్యం బస్తాలు మాయమైనట్లు గుర్తించారు.
    
వనపర్తి  జిల్లాలో కోట్ల విలువ చేసే  సీఎంఆర్ ధాన్యం మాయమైనట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. పెద్దమందడి మండలం మోజర్ల గ్రామ శివారులో చాముండి, వారాహి రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారులు  తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా వారాహి రైస్ మిల్లులో 37వేల బస్తాలు, చాముండి రైస్ మిల్లులో 97 వేల ధాన్యం బస్తాలు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. వీటి విలువ రూ.12.50 కోట్ల ధాన్యం ఉంటుందని అధికారులు గుర్తించారు.

అక్రమార్కులపై చర్యలుంటేనే రికవరీ

ప్రజాధనం దుర్వినియోగమైన ఈ అంశంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి పూర్తిస్థాయి విచారణ చేపట్టాల్సిన అవసరం ఉన్నది. ఆదిలాబాద్​ జిల్లాలోని నికిత్​ ఆగ్రో ఇండస్ట్రీస్​ మిల్లు యజమానికి కేటాయించిన 458 టన్నుల ధాన్యం అమ్ముకోవడంతో మిల్లు యజమానిపై క్రిమినల్​యాక్ట్​లు పెట్టి అరెస్టు చేసి జైలుకు పంపించారు. 

ఇలాంటి చర్యలు ఉంటే కానీ మిల్లర్లు ధాన్యం అమ్ముకోవడానికి జంకుతారని ఎక్స్​పర్ట్స్​అంటున్నరు. కేవలం మిల్లర్లపైనే కాకుండా వారికి సహకరించినట్టు ఆరోపణలు ఎదురొంటున్న అధికారులపైనా కఠిన చర్యలు తీసుకోవాలని.. అలాగే, మాయమైన  ధాన్యాన్ని లేదా దాని విలువను తక్షణమే రికవరీ చేయాలని  డిమాండ్‌‌‌‌‌‌‌‌ వ్యక్తమవుతోంది. ‘‘ఆర్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ యాక్ట్‌‌‌‌‌‌‌‌ కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నాం. 

డిఫాల్టర్ల ఆస్తులు గుర్తించాలని కలెక్టర్‌‌‌‌‌‌‌‌ నుంచి తహసీల్దార్లకు ఆదేశాలు జారీ అయ్యాయి’’అని కొందరు అధికారులు చెబుతున్నా ఇప్పటి వరకు పూర్తి స్థాయి చర్యలు మాత్రం లేవమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

2022-23 యాసంగిలో మాయమైన ధాన్యం నేటికీ రివకరీ కాలే..

2022-23 యాసంగిలో లక్షల టన్నుల ధాన్యం మాయమైనా నేటికీ రికవరీ కాలేదు. ఆ సీజన్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి 38 లక్షల టన్నుల ధాన్యాన్ని గత ఏడాది జనవరిలో సివిల్​సప్లయ్స్​సంస్థ వేలం ద్వారా విక్రయించింది. వేలంలో పాల్గొని ధాన్యాన్ని దక్కించుకున్న బిడ్డర్లు.. మిల్లర్ల నుంచి దాదా 25 లక్షల టన్నుల ధాన్యాన్ని తీసుకున్నారు. మిగిలిన ధాన్యం నిల్వలు ఆయా మిల్లుల్లో లేవంటూ సివిల్​ సప్లయ్స్​ సంస్థకు ఫిర్యాదు చేశారు. దీంతో నిర్వహించిన తనిఖీల్లో 314  రైస్‌‌‌‌‌‌‌‌ మిల్లుల్లో 5.40 లక్షల టన్నుల ధాన్యం లేదని గుర్తించారు.