
- గొర్రెల కాపర్లను అధిక ధరలకు విక్రయిస్తున్న వెటర్నరీ సిబ్బంది, ప్రైవేటు వ్యక్తులు
- తాజాగా సూర్యాపేట జిల్లాలో వెలుగులోకి వచ్చిన అక్రమ దందా
- ఔషధాల అక్రమాలపై దర్యాప్తు చేపట్టాలని గొర్రెల కాపర్ల సంఘాలడిమాండ్
హైదరాబాద్, వెలుగు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన నీలినాలుక (బ్లూ టంగ్) వ్యాక్సిన్‌ను అక్రమంగా తెలంగాణలోని గొర్రెల కాపర్లకు విక్రయిస్తున్నారు. ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్ లిమిటెడ్ నుంచి ‘రక్షా-బ్లూ’వ్యాక్సిన్‌ను ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసి, ఆ రాష్ట్ర పశుసంవర్థక శాఖ ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తోంది. అయితే, ఈ వ్యాక్సిన్‌ను ఏపీ పశుసంవర్థక శాఖ అధికారులు.. కొందరు వ్యక్తులతో కలిసి తెలంగాణలోని ప్రైవేటు వెటర్నరీ మెడికల్ షాపుల ద్వారా అక్రమంగా విక్రయిస్తున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో సూర్యాపేట జిల్లాలోని నూతనకల్ మండల కేంద్రం, శిల్పకుంట్ల గ్రామం, అర్వపల్లి మండల కేంద్రంలో ఈ వ్యాక్సిన్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయని గుర్తించారు. ‘ప్రభుత్వ సరఫరా’అని రాసి ఉన్న వ్యాక్సిన్ బాటిళ్లను గొర్రెల కాపర్లకు అత్యధికంగా ఒక్కో బాటిల్‌ను రూ.600 విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని గమనించిన గొర్రెల కాపర్ల సంఘాలు, వ్యాక్సిన్ బాటిళ్ల బ్యాచ్ నంబర్లను పరిశీలించగా, ఇవి తెలంగాణకు చెందినవి కావని, ఏపీ ప్రభుత్వ సరఫరాకు సంబంధించినవని గుర్తించాయి.
అక్రమాలపై దర్యాప్తు చేపట్టండి..
ఈ అక్రమ రవాణా వెనుక ఏపీ, తెలంగాణలోని పశుసంవర్థక శాఖ సిబ్బంది, ప్రైవేటు వ్యక్తులు కుమ్మక్కైనట్లు గొర్రెల కాపర్ల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఉచితంగా అందించాల్సిన వ్యాక్సిన్లను డబ్బులు వసూలు చేస్తూ అమ్మడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అక్రమాలను అరికట్టాల్సిన పశుసంవర్థక, ఔషధ నియంత్రణ శాఖలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించాయి. స్థానిక జిల్లా అధికారులకు ఈ విషయం తెలిసినా, ఉన్నతాధికారులకు నివేదించకపోవడం గమనార్హం.
ప్రభుత్వం వెంటనే ఈ అక్రమ వ్యాక్సిన్ రవాణాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. గొర్రెల కాపర్లకు ఉచితంగా మందులు, వ్యాక్సిన్లు సరఫరా చేయాలని సంఘాలు కోరుతున్నాయి. ఈ కుంభకోణంపై రెండు రాష్ట్రాల పశుసంవర్థక, ఔషధ నియంత్రణ శాఖలు దర్యాప్తు చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఔషధాల అక్రమ రవాణాను అరికట్టాలి..
ఔషధ నియంత్రణ శాఖ ఈ అక్రమ రవాణాను అరికట్టాలి. ప్రైవేటు వ్యక్తులపై నిఘా పెట్టాలి. ఏపీ నుంచి వస్తున్న వ్యాక్సిన్‌లను నియంత్రించాలి. పశుసంవర్థక శాఖ గొర్రెల కాపర్లకు ఉచిత వ్యాక్సిన్ సౌకర్యం కల్పించాలి. వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో గొర్రెల కాపర్లు ఆర్థికంగా నష్టపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నీలినాలుక, నట్టల మందులు ఉచితంగా వేయించాలి. ఉడుత రవీందర్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జీఎంపీఎస్