
- లేనిపోని భయాలు చూపి లక్షలు వసూళ్లు
- స్పెషల్ ప్యాకేజీల పేరిట మోసాలు
- ఇష్టారీతిగా టెస్టులు.. ప్రాణాలతో చెలగాటాలు
- నిబంధనలకు తూట్లు..
- సెంటర్ల ముసుగులో పిల్లల క్రయవిక్రయాలు
- సరోగసీ బోర్డు ఉన్నా పర్యవేక్షణ కరువు
- రాష్ట్రవ్యాప్తంగా 270 ఐవీఎఫ్ సెంటర్లు..
- ఇందులో సగానికి పైగా హైదరాబాద్‌లోనే!
హైదరాబాద్, వెలుగు: సంతానం లేని దంపతుల ఆశలను ఆసరాగా చేసుకొని రాష్ట్రంలో కొన్ని ఫెర్టిలిటీ సెంటర్లు రెచ్చిపోతున్నాయి. వారిని నమ్మించి, లక్షలకు లక్షలు గుంజి.. నట్టేట ముంచుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఈ సెంటర్లు.. రూల్స్‌ను ఖాతరు చేయడం లేదు. ఈ దందాను అడ్డుకోవాల్సిన అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ అండ్ సరోగసి బోర్డు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. తాజాగా సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ బాగోతం కలకలం సృష్టిస్తున్నది. సరోగసీ పేరిట ఓ జంటను నమ్మించి రూ. 40 లక్షల దాకా వసూలు చేసి.. రూ. 90 వేలతో ఓ బిడ్డను కొని ఆ జంటకు అప్పగించినట్లు విచారణలో తేలింది. ఇలాంటి దందాలు చేసే సెంటర్లు రాష్ట్రంలో చాలానే ఉన్నట్లు తెలుస్తున్నది.
అనవసర టెస్టులు చేస్తూ..!
సంతానం లేని దంపతులు మానసికంగా, భావోద్వేగపరంగా చాలా బలహీనంగా ఉంటారు. ఒక బిడ్డ కోసం ఎంత డబ్బయినా ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతుంటారు. దీన్నే ఆసరాగా చేసుకుని కొన్ని ఫెర్టిలిటీ కేంద్రాలు మోసాలకు పాల్పడుతున్నాయి. లేనిపోని కారణాలు చెప్పి భయభ్రాంతులకు గురిచేస్తూ.. అనవసరమైన టెస్టులు, చికిత్సల పేరుతో ఫీజులు వసూలు చేస్తున్నాయి. అవసర పరీక్షలు చేయించి, లేకపోతే గర్భం ధరించడం కష్టం అని భయపెడ్తున్నాయి. ఉదాహరణకు... సాధారణంగా 35 ఏండ్లలోపు వారికి అవసరం లేని కొన్ని జన్యు పరీక్షలు (పీజీటీ) చేయించడం, లేదా సరైన కారణం లేకుండానే పదే పదే ఐవీఎఫ్ సైకిల్స్ చేయిస్తూ డబ్బులు గుంజుతున్నాయి.
ఐవీఎఫ్ చికిత్సలో సక్సెస్‌కు సాధారణంగా ఎటువంటి గ్యారంటీ ఉండదు. కానీ కొన్ని కేంద్రాలు ‘100% గ్యారెంటీ’ అని ప్రచారం చేస్తూ, విఫలమైనా.. డబ్బులు తిరిగి ఇవ్వకుండా, మరింత డబ్బు చెల్లిస్తే మళ్లీ ప్రయత్నించొచ్చనని నమ్మిస్తూ నట్టేట ముంచుతున్నాయి. ఒక ఐవీఎఫ్ సైకిల్‌కు ప్రాథమిక దశలోనే కనీసం రూ. 3 లక్షల నుంచి 5 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. కొన్ని కేంద్రాలు అయితే, ‘ప్యాకేజీలు’ అని చెప్పిరూ. 10 లక్షల వరకు దండుకుంటున్నాయి. పిల్లల కోసం కొందరు దంపతులు తమ ఇండ్లు, భూములు అమ్ముకున్న ఘటనలూ ఉన్నాయి.
మందులు సరిగ్గా వాడ్తలేరని చెప్పి..!
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 270 ఐవీఎఫ్ సెంటర్లు ఉన్నాయి. ఇందులో సగానికి పైగా హైదరాబాద్ లోనే ఉన్నాయి. ఐవీఎఫ్ విధానంలో సంతానం పొందే ట్రీట్ మెంట్ కు హైదరాబాద్ తర్వాత కరీంనగర్ ప్రధాన కేంద్రంగా మారింది. కరీంనగర్ లో పది వరకు ఈ సెంటర్లు ఉన్నాయి. ఐవీఎఫ్ విధానంలో సంతానం కలగక ఫెయిలైతే డాక్టర్లు ‘మీరు మందులు సరిగ్గా వాడలేదు’ అని సింపుల్‌గా తప్పించుకుంటున్నారు. ఇలాంటి ఘటనలపై గతంలో కరీంనగర్ లోని ప్రముఖ సంతాన సాఫల్య కేంద్రంపై కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదయ్యాయి.
రిపోర్ట్ లు గోల్మాల్.. ట్రీట్మెంట్లో అవకతవకలు
పెండ్లయిన రెండు, మూడేండ్లలోపు పిల్లలు కాకపోతే ముందు గైనకాలజిస్ట్ ను సంప్రదిస్తారు. అక్కడ కొన్ని టెస్టులు చేశాక సాధారణ మెడిసిన్స్ ఇచ్చి టైమ్ తీసుకోవాలని డాక్టర్లు చెప్తుంటారు. అయితే, అప్పటికీ పిల్లలు కాకపోతే.. ఐవీఎఫ్ సెంటర్లను దంపతులు ఆశ్రయిస్తుంటారు. కొందరు డాక్టర్లయితే నేరుగా ఐవీఎఫ్కే రిఫర్ చేస్తుంటారు. దీంతో ఐవీఎఫ్ సెంటర్లలో.. అవసరం ఉన్నా, లేకున్నా అన్ని రకాల టెస్టులు చేస్తున్నారు. అదంతా సెంటర్లలోనే చేస్తున్నారు. ఇందుకు పెద్ద మొత్తంలో దంపతుల నుంచి డబ్బులు రాబడ్తున్నారు. అయితే ఈ క్రమంలో టెస్టుల రిపోర్టులను కూడా మార్చి ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏదో ఒక సంతానలేమి కారణం చూపి.. వారిని ఐవీఎఫ్‌కు ప్రిపేర్ చేయడం, వేల రూపాయల విలువైన మెడిసిన్ కొనుగోలు చేయించడమే లక్ష్యంగా దందాలు కానిస్తున్నారు. బయటి మెడికల్ షాపుల్లో తక్కువ ధరకు మందులు లభించే అవకాశమున్నా ఆ మందులను తమ ఆస్పత్రి ఫార్మసీలోనే కొనాలని కండిషన్లు
పెడ్తున్నారు.
కొన్ని జంటలకు చిన్న సమస్య ఉన్నప్పుడు ఐయూఐ (ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్) పద్ధతిలో గర్భందాల్చేలా చేస్తారు. ఇది తక్కువ ఖర్చుతోనే అయిపోతుంది. సాధారణంగానే గర్భధారణ ప్రక్రియ ముగుస్తుంది. దీన్ని ఐవీఎఫ్ పద్ధతిని చేయడానికి ముందుగా నిర్వహిస్తారు. ఈ విధానంలో భర్త నుంచి స్పెర్మ్ ని కలెక్ట్ చేసి దాన్ని డైరెక్ట్ గా భార్య యుటెరస్ లోకి ఎగ్స్ రిలీజ్ అయిన సమయానికి పంపిస్తారు. అప్పుడు ఫర్టిలైజేషన్ జరిగే అవకాశం ఉంది. దీనిలో స్పెర్మ్ ని పంపించగానే అది ఫాలోపియన్ ట్యూబ్స్ వద్దకి వెళ్తుంది. అయితే చాలా ఐవీఎఫ్ సెంటర్లు ఐయూఐను ఏదో నామమాత్రంగా చేస్తున్నాయి. దీంతో దంపతులను ఐవీఎఫ్ పద్ధతికే వెళ్లేలా పురిగొల్పుతున్నాయి.
ఐవీఎఫ్ పద్ధతిలో భార్య ఎగ్స్‌ని తీసి.. ఫర్టిలైజేషన్ చేస్తారు. సర్జికల్ ప్రొసీజర్ ద్వారా నీడిల్‌తో ఎగ్స్‌ని తీసి, ఆ తర్వాత భర్త స్పెర్మ్ ని కలెక్ట్ చేసి ఈ రెండింటినీ కూడా ఫర్టిలైజ్ చేస్తారు. అనంతరం ఎంబ్రియోని మహిళ కడుపులోకి పంపిస్తారు. ఈ ట్రీట్మెంట్ లో చాలా స్టెప్స్ ఉన్నాయి. వీటిని పూర్తి చేసుకోవడానికి కొన్ని నెలలు పడుతుంది. ఈ క్రమంలో కొన్ని జంటలకు సంబంధించి ఎగ్స్ వారివి కాకుండా ఇతరుల నుంచి తీసుకోవడం, కొందరు డాక్టర్లు భర్త స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నా తల్లిదండ్రులవుతారని తప్పుదారి పట్టిస్తూ భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ ప్రక్రియలో భర్తది కాకుండా మరొకరి స్పెర్మ్ ప్రవేశపెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
మన దేశంలో సరోగసీ (అద్దె గర్భం) విధానంపై పరిమితులు ఉన్నాయి. సరోగసీ(నియంత్రణ) చట్టం – 2021 పేరుతో కేంద్రం ప్రభుత్వం 2022 జనవరి నుంచి నిబంధనలను అమల్లోకి తీసుకువచ్చింది. దీని ప్రకారం.. కమర్షియల్ పద్ధతిలో, అంటే డబ్బుల కోసం సరోగసీ విధానంలో పిల్లలను కనడం చట్టవిరుద్ధం. కేవలం నిస్వార్థ పద్ధతిలో పిల్లలను కనేందుకు పరిమిత సంఖ్యలో అనుమతి ఉంది. కానీ, చాలా ఫెర్టిలిటీ సెంటర్లు కమర్షియల్ పద్ధతిలో సరోగసీని నడిపిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పైగా, సరోగసీపేరు చెప్పి నమ్మించి.. వేరే వాళ్ల పిల్లలను కొని జంటలకు అప్పగిస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహరణ సికింద్రాబాద్‌లోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఉదంతం.
ఏఆర్టీ చట్టం, బోర్డు ఉన్నా..!
అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (రెగ్యులేషన్) చట్టం- –2021 (ఏఆర్టీ చట్టం) ప్రకారం ప్రతి రాష్ట్రంలో ‘స్టేట్ అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ అండ్ సరోగసీబోర్డు’ ఉండాలి. ఈ బోర్డు రాష్ట్రంలోని ఫెర్టిలిటీ కేంద్రాలను పర్యవేక్షించడం, రిజిస్ట్రేషన్లు ఇవ్వడం, ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవడం వంటివి చేయాలి. అయితే, రాష్ట్రంలో ఈ బోర్డు నామమాత్రంగానే ఉందనే విమర్శలున్నాయి.
కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్ లో రాష్ట్రంలో 2022లో ఏర్పాటు చేసిన బోర్డుకు సంబంధించిన పాత వివరాలే ఉన్నాయి. బోర్డు కేవలం కాగితాలపైనే ఉందని, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడటంతోనే ఐవీఎఫ్ కేంద్రాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదులు చేసినా వాటిపై సరైన విచారణ జరగడం లేదని తెలుస్తున్నది. ఏఆర్టీ చట్టం – 2021 ప్రకారం ప్రతి ఫెర్టిలిటీ సెంటర్, ఏఆర్టీ బ్యాంక్ తప్పనిసరిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్ద రిజిస్టర్ అయి ఉండాలి. నిర్దిష్టమైన మౌలిక వసతులు, అర్హత కలిగిన వైద్య నిపుణులు ఉండాలి. అయితే చాలా చోట్ల ఈ నిబంధనలు గాలికొదిలేస్తున్నారు. ఏఆర్టీ చట్టం దాతల (స్పెర్మ్/అండం) వినియోగంపై కఠిన నిబంధనలు పెట్టింది. దాతలు నిర్దిష్ట వయస్సులో ఉండాలి,. ఆరోగ్యంగా ఉండాలి.. ఒక దాత నుంచి పరిమిత సంఖ్యలో మాత్రమే అండాలను సేకరించాలి. కానీ, కొన్ని కేంద్రాలు దాతలకు సరైన పరీక్షలు చేయకుండానే స్పెర్మ్, అండాలు ఉపయోగించడం.. లేదా ఒకే దాత నుంచి అధిక సంఖ్యలో వాటిని సేకరించి, అనేక మందికి వినియోగించి సొమ్ము చేసుకుంటున్నాయి.
రూ. 9.5 లక్షలు గుంజి..!
నల్గొండ జిల్లాకు చెందిన దంపతులకు నాలుగేండ్లుగా పిల్లలు లేరు. స్థానిక డాక్టర్ల సలహా మేరకు హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఫెర్టిలిటీ సెంటర్‌ను ఆశ్రయించారు. వారికి ‘‘సమస్య తీవ్రంగా ఉంది. ఐవీఎఫ్ తప్ప వేరే మార్గం లేదు’’ అని చెప్పి రూ. 3 లక్షల ప్యాకేజీకి సెంటర్ నిర్వాహకులు ఒప్పించారు. మొదటి సైకిల్ విఫలమైంది. ‘‘మీ అండాల నాణ్యత సరిగా లేదు. దాత అండాలు వాడాలి’’ అని చెప్పి అదనంగా రూ. లక్షన్నర గుంజారు. అది కూడా విఫలం కావడంతో, మూడో ప్రయత్నానికి రూ. 5 లక్షలు కడితే, ‘‘అన్ని టెస్టులు చేసి మీకు కచ్చితంగా బిడ్డ కలిగేలా చూస్తాం’’ అని నమ్మబలికారు. మొత్తంగా రూ. 9.5 లక్షలు ఖర్చు చేసినా సంతానం కలగలేదు. మరో సెంటర్‌లో చూపించుకోగా.. వీరికి సాధారణ చికిత్సతోనే గర్భం దాల్చే అవకాశం ఉందని తేలింది. మొదటి కేంద్రం అనవసరంగా ఐవీఎఫ్ చేయించిందని బయటపడింది.
కవలలు.. ముగ్గురు పిల్లలంటూ..!
సంతానలేమితో బాధపడేవారికి ఐవీఎఫ్‌లో ఒక్కసారే కవలలు లేదా ముగ్గురు పిల్లలను పుట్టిస్తామంటూ మహిళల ప్రాణాలతోనూ కొన్ని ఫెర్టిలిటీ సెంటర్లు చెలగాటమాడుతున్నాయి. సాధారణంగా ఎగ్స్‌ను తీసి ఎంబ్రియో ఫ్రీజింగ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే దానికి కూడా లక్షల్లో వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకేసారి ఇద్దరు పిల్లలను కనేలా చేస్తాం.. ఇందుకు కొంత ఖర్చు ఎక్కువవుతుందని నమ్మిస్తున్నారు. దీంతో ఆశపడుతున్న జంటలు అందుకు ఒప్పుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రక్రియ విఫలమై కొందరు మహిళలు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఇంకోవైపు అసలు జంటకు సంబంధం లేకుండానే వేరేవాళ్ల ఎగ్, స్పెర్మ్‌తో ఫలదీకరణ చేస్తున్నారు. ఇలా పలు ఫెర్టిలిటీ సెంటర్లు అనేక అక్రమాలకు పాల్పడుతున్నాయి.
పెరుగుతున్న సంతానలేమి సమస్య
వాస్తవానికి రాష్ట్రంలో సంతానలేమి సమస్యతో బాధపడేవారి సంఖ్య పెరుగుతున్నది. ఒకప్పుడు వందలో కొన్ని జంటలు మాత్రమే సంతానలేమితో బాధపడేవి. ఇప్పుడు ఆ సంఖ్య 30 శాతం వరకు ఉంది. ఇలాంటి జంటలు డాక్టర్లను సంప్రదించి చికిత్స తీసుకుని గర్భం దాలుస్తున్నారు. ఇటీవల యువతీయువకులు జీవితంలో స్థిరపడ్డాక వివాహం చేసుకుంటున్నారు. అమ్మాయిల సంఖ్య తగ్గిపోవడం, సెటిల్ అవ్వడం వంటి కారణాలతో ఆలస్యంగా వివాహం చేసుకుంటున్నారు. దీంతో సంతానలేమి సమస్యలు పెరుగుతున్నాయి. దీనికి తోడు మారిన జీవనశైలి, వ్యాయామం లేకపోవడం, స్థూలకాయం, మహిళల్లో పీసీఓడీ (అండాశయంలో తిత్తులు), రాత్రివేళల్లో ఆలస్యంగా నిద్రపోవడం, జంక్‌ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం తదితర కారణాలతో సంతానలేమి సమస్యలు పెరుగుతున్నట్లు రీసెర్చ్‌లు చెప్తున్నాయి.
పీసీవోడీ సమస్య ఉందని భయపెట్టి..!
వరంగల్‌కు చెందిన 32 ఏండ్ల ఓ మహిళ.. పెండ్లయి ఆరేండ్లయినా పిల్లలు లేక హైదరాబాద్‌లోని ఓ ఫెర్టిలిటీ క్లినిక్‌ను సంప్రదించింది. ‘మీకు పీసీవోడీ సమస్య తీవ్రంగా ఉంది. వెంటనే ఐవీఎఫ్ చేయాలి. లేకపోతే కష్టం’ అని క్లినిక్ నిర్వాహకులు భయపెట్టారు. అప్పుడున్న ఆందోళనతో వెంటనే ఆమె ఐవీఎఫ్‌కు ఒప్పుకుంది. రూ. 2.5 లక్షల బిల్లు వేశారు. అయితే చికిత్స సమయంలో అనేక టెస్టులు, ఇంజెక్షన్ల పేరుతో అదనంగా రూ. ఒక లక్ష వసూలు చేశారు. దురదృష్టవశాత్తు, సైకిల్ విఫలమైంది. ఆ మహిళ ఆ క్లినిక్‌ను నిలదీయగా.. ‘అది నార్మల్. తదుపరి సైకిల్‌కు డిస్కౌంట్ ఇస్తాం’ అని చెప్పి మళ్లీ డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించారు. దీంతో ఆ మహిళ వేరే డాక్టర్‌ను సంప్రదించి, తన పీసీవోడీ సమస్యకు ఐవీఎఫ్ అవసరం లేదని తెలుసుకుంది. కేవలం ట్యాబ్లెట్స్, ఇతర మార్గాలలో పీసీవోడీ తగ్గే అవకాశం ఉండగా.. నేరుగా ఐవీఎఫ్‌కు రిఫర్ చేయడం వెనక ఫెర్టిలిటీ సెంటర్ వాళ్లు డబ్బులు గుంజే పనిపెట్టుకున్నట్లు గుర్తించింది.
పీజీటీ టెస్టు పేరిట..!
హైదరాబాద్‌లో నివసించే ఓ జంట పిల్లల కోసం ఓ ఐవీఎఫ్ సెంటర్‌ను సందర్శించారు. ‘‘మీ పిండాల్లో జన్యులోపాలున్నాయి. అందుకే గర్భం నిలబడట్లేదు. పిండాల్లో లోపాలు గుర్తించడానికి పీజీటీ (ప్రీఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్) చేయాలి. దీనికి రూ. 2 లక్షలు అవుతుంది’ అని సెంటర్ నిర్వాహకులు చెప్పారు. ఆ జంటకు ఇంతకు ముందు ఎటువంటి జన్యు సమస్యలు ఉన్నట్లు నిర్ధారణ కాలేదు. కానీ, పిల్లల కోసం ఆశతో ఆ డబ్బు చెల్లించారు. పీజీటీ చేసిన తర్వాత కూడా మొదటి ప్రయత్నం విఫలమైంది. ఒక సీనియర్ గైనకాలజిస్టును సంప్రదించగా.. ‘అవసరం లేకుండానే పీజీటీ చేయించారు. మీకు కేవలం కొన్ని హార్మోనల్ అసమతుల్యతలు మాత్రమే ఉన్నాయి’ అని చెప్పారు.
దాతలను ముంచుతున్నరు
హైదరాబాద్ లోని ఓ ఫెర్టిలిటీ సెంటర్‌లో అండాలను దానం చేసే ఒక యువతి నుంచి నిబంధనల కంటే (ఒక సంవత్సరంలో నాలుగు సార్లు) ఎక్కువ సార్లు అండాలను సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం ఒక్కోసారి రూ. 20 వేల నుంచి 30 వేల వరకు ఇస్తామని చెప్పి, ఆమె ఆరోగ్యంపై ఎలాంటి శ్రద్ధ చూపకుండానే అధిక సంఖ్యలో అండాలను సేకరించి, వాటిని అనేక మందికి అమ్మి సొమ్ము చేసుకున్నట్లు సమాచారం. దీనివల్ల ఆ యువతి ఆరోగ్యం దెబ్బతింది.