ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో అక్రమ రియల్​ వెంచర్లు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. డీటీసీపీ, మున్సిపల్​ పర్మిషన్లు లేకుండా కొంతమంది రియల్టర్లు, భూ యజమానులు వెంచర్లు చేసి ప్లాట్లు అమ్ముతున్నారు. ఇటీవల ఏసీసీ క్వారీ రోడ్డు మార్గంలోని 303 సర్వేనంబర్​లో ఓ ఇల్లీగల్​ వెంచర్ వెలిసింది. జిల్లా కేంద్రానికి చెందిన రియల్టర్లు ఎకరంన్నర భూమిని రూ.3.60 కోట్లకు కొని అందులో పాట్లు చేశారు. సమాచారం అందుకున్న మున్సిపల్​ అధికారులు మూడ్రోజుల కిందట వెంచర్​ను పరిశీలించారు. డీటీసీపీ, మున్సిపల్​ పర్మిషన్లు లేకుండానే ప్లాట్లు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. 303 సర్వే నంబర్​లోని అక్రమ వెంచర్​లో ఎలాంటి రిజిస్ర్టేషన్లు చేయరాదని మున్సిపల్​ అధికారులు మంచిర్యాల సబ్​ రిజిస్ర్టార్​కు నోటీసు ఇచ్చారు. ఇదే కాకుండా మున్సిపల్​ పరిధిలోని అనుమతి లేని వెంచర్లలో రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని సూచించారు.

రాజీవ్ కాంప్లెక్స్ షాపుల అద్దె గొడవ

బెల్లంపల్లి,వెలుగు: బెల్లంపల్లి బజార్ ఏరియాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజీవ్ కాంప్లెక్స్ వద్ద గురువారం ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజీవ్ కాంప్లెక్స్ లో తొమ్మిది షెటర్స్ ఉండగా, వ్యాపారులు అద్దె సక్రమంగా చెల్లించడంలేదని లీడర్లు షాపులను మూసివేశారు. అంతకు ముందు అక్కడికి చేరుకున్న పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి చిలుముల శంకర్, టౌన్ ప్రెసిడెంట్ కంకటి శ్రీనివాస్,  టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బండి ప్రభాకర్ యాదవ్, టౌన్ మాజీ ప్రెసిడెంట్ ముచ్చర్ల మల్లయ్య, ఎన్ఎస్ యూఐ జిల్లా అధ్యక్షుడు ఎర్ర ఆదర్శ్ వర్ధన్ రాజు, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి రొడ్డశారద, యూత్ కాంగ్రెస్ నియోజక వర్గ అధ్యక్షుడు ముడి మడుగుల మహేందర్​లు వచ్చి వ్యాపారులకు చెందిన సామాన్లను బయటపడేశారు. దీంతో వ్యాపారులు, కాంగ్రెస్ లీడర్ల మధ్య గొడవ జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో  టౌన్ , రూరల్​ఇన్​స్పెక్టర్లు​ఎం.రాజు,కె.బాబూరావు, వన్ టౌన్ ఎస్సైలు ఎం.సంతోష్, రాములు, ఏఎస్సై తిరుపతి అక్కడికి చేరుకొని ఇరువర్గాలకు సర్దిచెప్పారు. 

అవినీతిని ప్రోత్సహిస్తున్న కలెక్టర్​ను బదిలీ చేయాలి

ఆసిఫాబాద్,వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్​జిల్లాలో అవినీతి, అక్రమాలను ప్రోత్సహిస్తున్న కలెక్టర్ రాహుల్​ రాజ్​ను బదిలీ చేయాలని తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు కొట్నాక విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక అంబేద్కర్ చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి, తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసీల సమస్యలపై పలుమార్లు వినతి పత్రలు ఇచ్చినా పట్టించుకోవడంలేదన్నారు. అక్రమాలకు పాల్పడిన ఆర్డీవోపై ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అధికార పార్టీ అండదండల కారణంగా కలెక్టర్​ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నిరసనలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కె. విశ్వప్రసాద్,  సీపీఐ జిల్లా కార్యదర్శి బద్రీ సత్యనారాయణ, సిర్పూర్​బీఎస్పీ నియోజకవర్గ ఇన్​చార్జి హర్షద్ హుస్సేన్, బీఎస్పీ ఆసిఫాబాద్ మాజీ నియోజకవర్గ లీడర్​కనక ప్రభాకర్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు రూప్ నార్ రమేశ్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్ టీఏజీఎస్ రాష్ట్ర నాయకురాలు మాలశ్రీ, ఏఐ వై ఎఫ్ జిల్లా కార్యదర్శి ఆత్మకూరి చిరంజీవి,  డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం ఏది?

మంచిర్యాల, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్​తో పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నాలుగు నెలలుగా పరిహారం ఇయ్యలేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావు విమర్శించారు. గురువారం ఆయన దండేపల్లి మండలం ద్వారకలో ముంపు రైతులతో కలిసి పంట చేన్లు, పొలాలను సందర్శించారు. వారికి జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. పంటనష్టంపై ఎమ్మెల్యే దివాకర్​రావు ఇప్పటివరకూ స్పందించకపోవడం శోచనీయమన్నారు. సీఎం కేసీఆర్​ ముందుచూపు లేకుండా కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల జిల్లాలో వేల ఎకరాల్లో పంటలు నీటమునిగాయని అన్నారు. ఇప్పటికైనా రైతులకు ఎకరానికి రూ.20వేల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వరదలతో నీటమునిగిన ఇండ్లకు కూడా పరిహారం అందించాలన్నారు.    

ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలి

బోథ్,వెలుగు: అభివృద్ధిని పట్టించుకోని ప్రజాప్రతినిధులు వెంటనే రాజీనామా చేయాలని బోథ్ బచావో కన్వీనర్ పసుల చంటి డిమాండ్ చేశారు. ప్రభుత్వం నూతనంగా ప్రకటించిన అగ్నిమాపక కేంద్రాల మంజూరు జాబితాలో బోథ్​పేరు లేకపోవడంతో గురువారం స్థానిక అంబేద్కర్​ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. మండలంలో తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బోథ్​కు మంజూరైన అగ్నిమాపక కేంద్రాన్ని ఇచ్చోడకు తరలించారని ఫైర్​అయ్యారు. మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు కృషి చేయాలని లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు జక్కుల వెంకటేశ్, సల్ల రవి, సుమేర్ పాష, కురుమే ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

స్టూడెంట్లకు రాగిజావా పంపిణీ 

మంచిర్యాల, వెలుగు: బెంగళూరు కేంద్రంగా సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో గవర్నమెంట్​ స్కూళ్లలోని స్టూడెంట్లకు రాగి జావా, బెల్లం అందించినట్లు డీఈవో ఎస్​.వెంకటేశ్వర్లు తెలిపారు. 708 స్కూళ్లలో చదువుకుంటున్న 40,607 మంది స్టూడెంట్లకు నెలవారీగా 4,743 కిలోల రాగిపిండి, 3,162 కిలోల బెల్లం గురువారం అన్ని స్కూళ్లకు పంపిణీ చేశారు. విద్యార్థులకు రోజు విడిచి రోజు ఉదయం రాగిజావా తయారు చేసి అందిస్తామన్నారు.  

డీఈవో పనితీరు బాగాలేదు

‌‌ఆదిలాబాద్, వెలుగు: జిల్లా విద్యాధికారి కార్యాలయానికి కూతవేటు దూరంలోని పాఠశాలలోనే హాజరు శాతం తక్కువగా ఉండడం ఏంటని ఎమ్మెల్యే జోగురామన్న అసహనం వ్యక్తం చేశారు. విధినిర్వహణలో డీఈవో, ఎంఈవోలు ఫెయిల్ అయ్యారని మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని గెజిటెడ్ నంబర్  వన్​ స్కూల్​లో ‘మన ఊరు మన బడి’ కార్యక్రమంలో భాగంగా గురువారం ఎమ్మెల్యే పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం విద్యారంగా అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఇలాంటి సమయంలో విద్యార్థుల హాజరు శాతం పెంచాల్సిన అధికారులు, టీచర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. కార్యక్రమంలో డీఈవో ప్రణీత, మున్సిపల్ చైర్మన్​జోగు ప్రేమేందర్, మున్సిపల్ కమిషనర్ శైలజ ఉన్నారు.