
వీడు మామూలోడు కాదు..ఏకంగా ఐఏఎస్ ఆఫీసర్ ని అని మోసాలు చేస్తున్నాడు..కొన్నిసార్లు కేబినెట్ స్పెషల్ సెక్రటరీనంటూ.. మరికొన్ని సార్టు పట్టణ గ్రామీణాభివృద్ది కార్యదర్శినంటూ ఇలా అనేక ఐఏఎస్ అవతారాల్లో ప్రజలను అధికారులను మోసం చేస్తున్నాడు. అధికారం ఉపయోగించకొని డబ్బు దండుకున్నాడు.. నెట్ వర్క్ ను పెంచుకున్నాడు. వీడి లీలలు చెప్పుకుంటూ పోతే పెద్ద బుక్కే రాయొచ్చు.. వివరాల్లోకి వెళితే..
యూపీలో రాజధాని లక్నోలో వాహనాలను తనిఖీ చేస్తున్న ట్రాఫిక్ పోలీసులకు దిమ్మదిరిగే నిజాలు తెలిశాయి. ఓ లగ్జరీ కారులో ప్రయాణిస్తున్న వ్యక్తిని అనుమానం వచ్చి విచారిస్తే సంచలన విషయాలు బయటికొచ్చాయి.మొదటి అతడిని నిజంగానే ఐఏఎస్ అని నమ్మిన ట్రాఫిక్ ఎస్సై..ఎందుకో డౌట్ వచ్చి మరోసారి చెక్ చేస్తే పదిహేనేళ్లుగా ఐఏఎస్ గా చెలామని అవుతూ ప్రజలను, అధికారులను మోసం చేస్తున్న వ్యక్తి అసలు రంగు బయటపడింది.
సౌరభ్ త్రిపాఠి..మౌ జిల్లాలోని సరాయ్ లఖాన్సీకి చెందిన సాధారణ వ్యక్తి.. ఇతను నేను ఐఏఎస్ ను అని చెప్పుకుంటూ మోసాలకు పాల్పడుతున్నాడు.. ఒక్కరోజు కాదు.. రెండు రోజులు కాదు.. ఏకంగా పదిహేనేళ్లుగా అటు యూపీతో సహా చుట్టు పక్కల రాష్ట్రాల్లో ఐఏఎస్ అధికారిగా చెలామణి అవుతూ తన అటు రాష్ట్రాల, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేశాడు. పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నవారితో ఫొటోలు దిగి నిజంగా ఐఏఎస్ గా నమ్మించడం మొదలు పెట్టాడు.అలా నమ్మింయి డబ్బు,అధికారాలను పొందేవాడు.
అతని మోసాలకు సోషల్ మీడియానే సాధనం..
దర్యాప్తులో సౌరభ్ వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో నకిలీ ప్రొఫైల్‌లను క్రియేట్ చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు తేలింది. కొన్నిసార్లు అతను కేబినెట్ స్పెషల్ సెక్రటరీ అని..మరికొన్నిసార్లు పట్టణ ,గ్రామీణాభివృద్ధి కార్యదర్శి అని చెప్పుకున్నాడు. ఈ ప్రొఫైల్‌లు అతని తప్పుడు ఇమేజ్‌ను పెంచడమే కాకుండా నెట్‌వర్క్‌ను విస్తరించుకునేందుకు సాయపడ్డాయి.ఎవరూ అనుమానించకుండా ఉండేలా అతని మోసపూరిత వలలోకి ఆకర్షించాయి.
చాలా రాష్ట్రాల్లో చాలా మోసాలు
పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సౌరభ్ తన నకిలీ గుర్తింపు కార్డును ఉపయోగించి వివిధ జిల్లాలు ,రాష్ట్రాల్లో ప్రభుత్వ సౌకర్యాలను పొందాడు. అనేక మంది వ్యక్తులను మోసం చేశాడు. ఆర్థిక ,లాజిస్టికల్ బెనిఫిట్స్ కోసం ఐఏఎస్ ముసుగును ఉపయోగించాడని పోలీసులు చెబుతున్నారు.
వజీర్‌గంజ్ పోలీసులు సౌరభ్ త్రిపాఠి కార్యకలాపాలపై సమగ్ర విచారణ జరుపుతున్నారు. ఈ పథకంలో ఇతరుల ప్రమేయం ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అతని మోసాలు,తెరవెనుక ఉన్న నెట్‌వర్క్ పై విచారణ చేపట్టారు.