- కరీంనగర్లో కుండపోత కామారెడ్డి, నిర్మల్లోనూ దంచికొట్టింది
- రేపట్నుంచి అతిభారీ వర్షాలు!
- బంగాళాఖాతంలో అల్పపీడనం.. తీవ్ర వాయుగుండంగా మారే చాన్స్
- ఆరెంజ్ అలర్ట్ జారీ
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ లో కుండపోత వర్షం కురిసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అరగంట వానలు దంచికొట్టాయి. ఆదివారం రాష్ట్రంలోనే అత్యధికంగా కరీంనగర్ సిటీ పరిధిలోని చింతకుంటలో 76 మి.మీ. వర్షపాతం నమోదైంది. చొప్పదండి, జమ్మికుంట, చిగురుమామిడి, సైదాపూర్, తిమ్మాపూర్ మండలాల్లోనూ వర్షం కురిసింది. కరీంనగర్ సిటీలో ఏకధాటిగా బోరున వర్షం కురవడంతో మంకమ్మ తోట రోడ్డు నంబర్ 1లో కాలనీ నీట మునిగింది.
పైనుంచి వరద నీరంతా కాలనీలోకి వచ్చి ఇళ్లలోకి చేరడంతో జనం ఇబ్బందులుపడ్డారు. సరైన కాల్వలు లేకపోవడంతో భారీ వర్షం కురిసిన ప్రతిసారి ఇలాగే ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కరీంనగర్ ముకరంపురలోనూ డ్రైనేజీ పొంగడంతో కాలనీలోని ఇళ్లలోకి నీళ్లు చేరాయి.
కరీంనగర్ టూటౌన్ పోలీస్ స్టేషన్, కలెక్టరేట్, ప్రతిమ మల్టీప్లెక్స్, ఆర్టీసీ వర్క్ షాపు ఏరియాల్లో రోడ్లపై భారీగా వరద నీరు ప్రవహించడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఆదివారం కావడంతో వినాయక మండపాల వద్ద అన్నదానాలకు ఏర్పాట్లు చేయగా.. వర్షం కురవడంతో అంతరాయం కలిగింది.
కరీంనగర్ లో జలమయమైన లోతట్టు ప్రాంతాల్లో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు పర్యటించారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో భారీ ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. ఇక ఉమ్మడి జిల్లా అంతటా విస్తారంగా వానలు కురవడంతో నీళ్లు లేక ఎండుతున్న పంటలకు ప్రాణం పోసినట్లయింది.
ఉరుములు, మెరుపులతో భారీ వర్షం
భారీ వర్షాలతో కామారెడ్డి ఆగమైంది. జిల్లాకేంద్రంతో పాటు దోమకొండ, బీబీపేట్, మాచారెడ్డి, భిక్కనూరు, రాజాంపేట మండలాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ఇక కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మధ్యాహ్నం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములతో కూడిన వర్షం కురిసింది.
రేపట్నుంచి అతిభారీ వర్షాలు
రాష్ట్రంలో వారం రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం వాయుగుండంగా.. మంగళవారం తీవ్ర వాయుగుండంగా బలపడుతుందని పేర్కొంది. దాని ప్రభావంతో సోమవారం భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. 22 నుంచి 25వ తేదీ వరకు అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆ రోజులకు గానూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
