
తెలంగాణ రాష్ట్రంలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్ నగరంలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
మరోవైపు ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీమ్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లె, జె.భూపాలపల్లి, సిద్దిపేట, ములుగు, బి.కొత్తగూడెం, వై.భువనగిరి, ఎం.మల్కాజిగిరి, వికారాబాద్, జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
కాగా నిన్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో అధిక వర్షపాతం నమోదైంది. ఇప్పటి వరకు తెలంగాణలో సగటు వర్షపాతం 407.3 మిల్లీమీటర్లు కాగా ఇప్పటివరకు 313.2 మిల్లీమీటర్లు నమోదైంది. మరోవైపు హైదరాబాద్‌లో సాధారణ వర్షపాతం 246.1 మిల్లీమీటర్లకు గాను 282 మిల్లీమీటర్లు నమోదైంది. ఇందులో చార్మినార్‌లో అత్యధిక వర్షపాతం నమోదైంది, అక్కడ 240.5 మిల్లీమీటర్లకు గాను 333.9 మిల్లీమీటర్లు నమోదైంది.