ఈ ఏడాది ఎండలు దంచి కొడుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చి ఆరంభం నుండే భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. ప్రస్తుతం ఏపీలోని పలు ప్రాంతాల్లో దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదఅవుతున్నాయి. నంద్యాల, బ్రాహ్మణ కొట్కూరు, పల్నాడు జిల్లా రావిపాడు, ప్రకాశం జిల్లా తోకపల్లె, అనకాపల్లి జిల్లా రావికమతం ప్రాంతాల్లో శనివారం 44.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో పాటు చాలా చోట్ల 41డిగ్రీల నుండి 45డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఈ నేపథ్యంలో చిన్న పిల్లలు, వృద్దులు, గర్భిణీ మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. ఉదయం 11 నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరిస్తోంది. ఇదే సమయంలో ఎండలతో అల్లాడుతున్న జనాలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. వచ్చే 3రోజులు ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమలోని జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురవనున్నాయి. ఈ క్రమంలో మండే ఎండల నుండి ఆయా ప్రాంత ప్రజలకు కాస్త ఉపశమనం దక్కనుంది.

