
గత నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ప్రాంతానికి మరోసారి వర్షం ముప్పు పొంచి వాతావరణ శాఖ హెచ్చరించింది.
బుధవారం(ఆగస్టు 14) ఎర్నాకులం, త్రిసూర్, కన్నూర్‌లలో ఒకటి లేదా రెండు చోట్ల.. గురువారం(ఆగస్టు 15) కోజికోడ్, వయనాడ్ ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు ఆయా ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ 'ఆరెంజ్' అలర్ట్ జారీ చేసింది. అదే సమయంలో లక్షద్వీప్‌కు 'రెడ్' అలర్ట్ జారీ చేసింది. బుధవారం ఒంటరి ప్రదేశాలలో 24 గంటల వ్యవధిలో 20 సెం.మీ కంటే ఎక్కువ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
తీవ్రమైన వర్షపాతం కారణంగా వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడ్డాయని, వాతావరణ మార్పుల వల్ల ఇది 10 శాతం పెరిగిందని ప్రపంచ శాస్త్రవేత్తల బృందం నివేదించింది.
కాగా, జూలై 30న వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడడానికి కారణమైన భారీ వర్షాన్ని అంచనా వేయడంలో IMD విఫలమైందని కేరళ ప్రభుత్వం గతంలో ఆరోపించింది. అయితే, IMD చీఫ్ మృత్యుంజయ్ మహపాత్ర మాత్రం ఈ ఆరోపణలను కొట్టి పారేశారు. పశ్చిమ తీరంలో వర్షపాతం గురించి వాతావరణ శాఖ క్రమం తప్పకుండా సూచనలను జారీ చేస్తుందని తెలిపారు. జూలై 30న తెల్లవారుజామున కేరళకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది.